అంతర్‌రాష్ట్ర దొంగలు అరెస్ట్
– రూ.4.35 లక్షలు విలువ చేసే సొమ్ములు రికవరీ
కర్నూలు: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకుతిరుగుతున్న ముగ్గురు అంతర్‌రాష్ట్ర దొంగలను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరా పర్యవేక్షణలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు బృందాలుగా ఏర్పడి చోరీ కేసులలో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం చెన్నమ్మ సర్కిల్‌లోని హైవే బ్రిడ్జి కింద అనుమానాస్పదస్థితిలో తిరుగుతుండగా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన తెలుగు నాగిరెడ్డి, కొత్తపల్లి గ్రామానికి చెందిన షేక్ సద్దాం హుసేన్, మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామానికి చెందిన కుతాటి హరికుమార్‌ను పోలీసులుఅదుపులోకి తీసుకుని విచారించగా వారి నేరచరిత్ర బయటపడింది.
వారి వద్ద నుంచి సుమారు రూ.4.35 లక్షలు విలువ చేసే 14.50 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని శనివారం అదనపు ఎస్పీ షేక్‌షావలి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన దొంగల వివరాలను వెల్లడించారు.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్:
నాగిరెడ్డి, సద్దాం హుసేన్ జల్సాలకు అలవాటు పడి నేరాల బాట పట్టారు. తాళం వేసిన ఇళ్లను ఎంపిక చేసుకుని ముందుగా రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడేవారు. వీరిపై కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో పలు పోలీస్‌స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నాయి. కుతాటి హరికుమార్ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. అక్కడ నాగిరెడ్డి, సద్దాం హుసేన్‌తో పరిచయం ఏర్పడింది. చిన్నప్పటి నుంచే చోరీలకు పాల్పడుతూ జైలుకు వెళ్లి తిరిగి బెయిల్‌పై రావడం, మళ్లీ చోరీలకు పాల్పడటం వీరికి అలవాటుగా మారింది. ఏడాది క్రితం ముగ్గురు నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చి ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, బళ్లారి ప్రాంతాల్లో ఇటీవల ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు.
పలుమార్లు వీరు జైలు జీవితం గడిపినప్పటికీ మార్పు రాలేదు. కర్నూలులోని నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు ఇళ్లలో, ఒకటి, రెండు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు అదనపు ఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకుని సొమ్మును రికవరీ చేయడంలో కృషి చేసిన సీఐలు లక్ష్మయ్య, నాగరాజరావు, ఎస్‌ఐలు నారాయణ, శ్రీనివాసులు, రమేష్ బాబు, లక్ష్మయ్య, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్, కానిస్టేబుళ్లు సుదర్శన్, నాగరాజు, రవికిషోర్, సమీర్ తదితరులను అదనపు ఎస్పీ అభినందించారు.