వైజాగ్‌ రూట్ | Buses Services From Every Town To Visakhapatnam | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ రూట్

Dec 7 2020 3:37 AM | Updated on Dec 7 2020 3:37 AM

Buses Services From Every Town To Visakhapatnam - Sakshi

సాక్షి, అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌– తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కారణంగా ఏపీఎస్‌ ఆర్టీసీ.. తెలంగాణలో 1.03 లక్షల కి.మీ. బస్సులు నడపే అవకాశం కోల్పోయింది. అలాగే తెలంగాణకు సర్వీలు తగ్గించడంతో మరో 80 వేల కి.మీ. కోల్పోయింది. అంటే మొత్తం 1.83 లక్షల కి.మీ.లను తిప్పడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేసుకొనేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలో రూట్ల వారీగా బ్లూ ప్రింట్‌ రూపొందించింది. సోమవారం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల (ఈడీల) కమిటీకి దీన్ని అందించనున్నారు. కమిటీ ఆమోదించగానే, గుర్తించిన 223 డిమాండ్‌ రూట్లలో ఆర్టీసీ బస్సులను నడపనుంది. తెలంగాణతో ఏపీఎస్‌ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా గతం కంటే 371 బస్సులు తగ్గించుకుంది. దీంతో ఏపీకి ఏటా రూ.265 కోట్లు నష్టం వాటిల్లుతోంది. ప్రజా రవాణాలో బస్సులు తగ్గించుకోకుండా డిమాండ్‌ ఉన్న పట్టణాల నుంచి చెన్నై, బెంగళూరు, ఏపీలోని అన్ని ముఖ్య నగరాలకు బస్సు సర్వీసులు తిప్పనున్నారు. జిల్లాల్లో అంతర్గత రూట్లపై ఆర్టీసీ అధికారులు సర్వే పూర్తి చేశారు. 

నగరాల నుంచి పగటిపూట విశాఖకు సర్వీసులు
– ఏపీలోని అన్ని పట్టణాల నుంచి నగరాలకు, ముఖ్య మండల కేంద్రాల నుంచి పొరుగు జిల్లాలకు సర్వీసులు తిప్పేందుకు నిర్ణయించారు.
– మొత్తం 223 డిమాండ్‌ రూట్లు గుర్తించారు. ప్రతి పట్టణం నుంచి విశాఖపట్నానికి సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు.
– ఇతర నగరాల నుంచి పగటి పూట సైతం విశాఖకు బస్సులు నడవనున్నాయి.
– విజయవాడ నుంచి తిరుపతికి మినహాయిస్తే, రాయలసీమకు కనెక్టివిటీ తక్కువగా ఉంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఏసీ సర్వీసులు మరీ తక్కువగా ఉన్నాయి.
– కడప, కర్నూలుకు ఏసీ సర్వీసులు మూడు చొప్పున మాత్రమే నడుస్తున్నాయి. అనంతపురానికి అసలు ఏసీ సర్వీసు లేదు. 
– నాన్‌ ఏసీ సర్వీసులు కూడా రాయలసీమ జిల్లాలకు పెద్దగా లేవు. దీంతో విజయవాడ నుంచి కడప, కర్నూలు, అనంతపురానికి మరిన్ని ఎక్కువ సర్వీసులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఏసీ సర్వీసులు పెంచేందుకు నిర్ణయం..
– ప్రస్తుతం ఏసీ బస్సులు 243 ఉండగా, కేవలం 84 మాత్రమే నడుస్తున్నాయి. కోవిడ్‌ కారణంగా ఏసీ సర్వీసులకు ఆదరణ లభించనందున ఏసీ సర్వీసులు తగ్గించారు. జనవరి నుంచి ఏసీ సర్వీసులు పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. 
– సిటీ సర్వీసులు విజయవాడ, విశాఖపట్నంలో కలిపి 1,009 వరకు ఉండగా, 740 వరకు సిటీ సర్వీసుల్ని తిప్పుతున్నారు.
– అద్దె బస్సులను పెంచి డిమాండ్‌ ఉన్న రూట్లలో తిప్పేందుకు నిర్ణయించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement