సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు విస్తరించిన ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు, సర్వీసులు నడపాలని, రాత్రి సర్వీసుల సమయాన్ని పొడిగించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ వెల్లడించారు. ఐటీ కంపెనీలు కోరితే వారి ఉద్యోగుల కోసం ప్రత్యేక సర్వీసులతోపాటు, అద్దెకు కూడా బస్సులను అందజేస్తామని తెలిపారు. ఐటీ కారిడార్ పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చే అంశంపై ఐటీ సంస్థల ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులతో సీఎం కిరణ్ శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఐటీ కారిడార్‌లో 2 లక్షల మంది పనిచేస్తుండగా వారిలో 40% మంది ప్రజారవాణా ద్వారానే ప్రయాణిస్తున్నారని, వీరి సౌకర్యార్థం ఆర్టీసీ రోజూ 300 బస్సులతో 4 వేల ట్రిప్పులు నడుపుతోందని తెలిపారు. నగరం నలుమూలలతోపాటు దగ్గరలోని ఎంఎంటీఎస్ స్టేషన్లతో బస్సులను అనుసంధానిస్తామని చెప్పారు.