సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా గత ఏడాది భారీగా ఆదాయాన్ని కోల్పోయిన ఏపీఎస్ ఆర్టీసీ ఈ ఏడాది ఆరంభం నుంచి రాబడి క్రమంగా పెరుగుతుండటంతో గాడిన పడుతోంది. గతేడాది మార్చి 22 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రూ.2,603 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి పుంజుకోవడంతో రోజువారీ సగటు ఆదాయం రూ.12 కోట్లకు చేరింది. గత ఏడాది జనవరిలో 69 శాతం ఆక్యుపెన్సీతో రూ.420 కోట్ల ఆదాయం లభించగా.. ఈ ఏడాది జనవరిలో 64 శాతం ఆక్యుపెన్సీతో రూ.360 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ నెలలో 12వ తేదీ వరకు లభించిన ఆదాయం రూ.145 కోట్లకు చేరింది. మార్చి నాటికి టికెట్ రెవెన్యూ రూ.400 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దూరప్రాంత సర్వీసులపై ప్రత్యేక దృష్టి
దూర ప్రాంత సర్వీసులను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణతో అంతర్ రాష్ట్ర సర్వీసుల ఒప్పంద సమయంలో.. కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే తెలంగాణకు నడిపే 1,60,999 కిలోమీటర్ల మేర సర్వీసులను 2,08,856 కిలోమీటర్లకు పెంచుకుంటామని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ దిశగా దృష్టి సారించారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి వచ్చే సర్వీసులకు డిమాండ్ పెరిగింది. ఎక్కువమంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తుండటంతో స్పెషల్ సర్వీసులను నడుపుతున్నారు. శుక్రవారం ఏపీలోని అన్ని ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి 81 స్పెషల్ సర్వీసులు తిప్పారు. మరోవైపు తిరుపతికి కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ ప్రవేశపెట్టిన తిరుమల శీఘ్రదర్శనం టికెట్ ఆఫర్‌కు మంచి స్పందన వస్తోంది. రోజుకు సగటున 20 వేల మంది తిరుపతి వెళ్లేందుకు ఆర్టీసీ టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు.
దూరప్రాంత సర్వీసుల్లో 10 శాతం రాయితీ
విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకు వెళ్లే డాల్ఫిన్, అమరావతి, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో ప్రయాణించే వారు 48 గంటల ముందే టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటే టికెట్ ధరలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. అయితే బస్సులో నాలుగైదు సీట్లకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుంది.
డాల్ఫిన్ బస్సులో 58 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి.. అమరావతి బస్సులోలో 49 సీట్ల కెపాసిటీకి గాను ఐదుగురికి, ఇంద్రలో 40 సీట్లుంటే నలుగురికి, సూపర్ లగ్జరీలో 35 సీట్లకు గాను నలుగురికి, అల్ట్రా డీలక్స్‌లో 39 సీట్లకు గాను నలుగురు, ఎక్స్‌ప్రెస్ బస్సులో 49 సీట్లకు ఐదుగురికి రాయితీ అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మార్చి నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ ఐటీ అధికారులు సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment