RTC officers
-
‘సామాజిక బాధ్యత’తో కార్పొరేట్ లుక్
సాక్షి, హైదరాబాద్: ‘ఎంత సేపు ప్రభుత్వంపై ఆధారపడటమేనా.. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలేవీ చేయరా’పలు సందర్బాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ అధికారులను ఉద్దేశించి అన్న మాటలివి. ప్రతినెలా జీతాలు మొదలు ఇతర అవసరాలకు ఆర్టీసీ కొంతకాలంగా ప్రభుత్వంపైనే ఆధారపడుతుండటమే దీనికి కారణం. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని ఆర్టీసీ కొత్త ఎండీ నిర్ణయించారు. తాను బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ మేరకు ప్రకటన చేసిన ఆయన రెండో రోజు దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం ప్రారంభిం చారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఆర్టీసీ దివాలా దశకు చేరడంతో.. దాని అనుబంధ విభాగాలు కూడా అదే బాట పట్టాయి. ఇందులో ఆర్టీసీ ఆసుపత్రి కూడా ఉండటం విశేషం. 49 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్యానికి పెద్దదిక్కయిన ఈ ఆసుపత్రి కొన్ని రోజులుగా కునారిల్లుతూ వస్తోంది. కరోనా రెండు దశలో ఈ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్‌గా మార్చాలన్న డిమాం డ్ వచ్చింది. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించినా.. ఆక్సిజన్ పైప్‌లైన్ వరకు నిర్మించి గాలికొదిలేశారు. ఇప్పుడు దీన్ని అభివృద్ధి చేయాలని ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. సామాజిక బాధ్యతతో.. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిని శనివారం ఉదయం సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు గంటలపాటు ఆసుపత్రి అంతా కలియదిరిగి అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిని కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొలుత తమ స్థాయిలో ఎంత అభివృద్ధి చేయగలమో చూసి.. తర్వాతే అవసరమైతే ప్రభుత్వ సాయం తీసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్)æని అనుసరించాలని భావిస్తున్నారు. త్వరలో ఈ పద్ధతిలో రెండు అంబులెన్సులు సమకూర్చేందుకు ఆయన ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి, కోవిడ్ సెంటర్ పనులు పూర్తి చేయాలని కోరారు. వెంటనే పనులు పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో అత్యాధునిక వసతులతో కూడిన ఇన్సెంటివ్ కేర్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికి కావాల్సిన పరికరాల జాబితా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మందుల విభాగాన్ని పరిశీలించి, కొరత లేకుండా ప్రత్యేక ఏర్పాటు అవసరమని తేల్చారు. దీన్ని కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యతతో అనుసంధానించాలని ఆయన నిర్ణయించారు. అలాగే ల్యాబ్ ఖాళీగా ఉండే సమయంలో ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో బయటి వ్యక్తుల నమూనాల పరీక్షలు చేయించి ఆదాయ సేకరణకు అనువుగా మార్చే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇలా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వీలైనంత తొందరలో ఆసుపత్రి ముఖచిత్రం మార్చి రోగులను రిఫరల్ ఆసుపత్రులకు పంపాల్సిన అవసరం లేకుండా చూడాలని ఆయన నిర్ణయించారు. సిబ్బంది అందరికి కోవిడ్ టీకాలు ఇప్పించాలని పేర్కొన్న ఆయన, రెండో డోస్ వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. కావాల్సినంత మంది వైద్యుల నియామకం వెంటనే చేపట్టనున్నట్లు వెల్లడించారు.అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట ఈడీలు పురుషోత్తం, వినోద్, వెంకటేశ్వర్లు, మునిశేఖర్, యా దగిరి, సూపరింటెండెంట్ వెంకటరమణ ఉన్నారు. -
ఆర్టీసీలో అన్ని సేవలకూ ఒకే యాప్
సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఆర్టీసీలో టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే ఓ వెబ్‌సైట్‌ను, బస్సు ఎక్కడుందో తెలుసుకోవడానికి అంటే.. ట్రాకింగ్‌కు మరో వెబ్‌సైట్‌ను, పాస్‌లు పొందడానికి, ఫిర్యాదులు చేయడానికి వేర్వేరు వెబ్సైట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇలా వేర్వేరు వెబ్సైట్లకు వెళ్లకుండా ఇకపై అన్ని సేవలు ఒకే యాప్‌లో లభ్యం కానున్నాయి. ఇందుకోసం వినూత్నమైన రీతిలో యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్(యూటీఎస్) విధానాన్ని ఏపీఎస్ ఆర్టీసీ అమల్లోకి తీసుకొస్తోంది. ఏపీఎస్ ఆర్టీసీలో టికెటింగ్ విధానంపై రూపొందిన ఈ సరికొత్త ప్రాజెక్టు త్వరలో ఆరంభం కానుంది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా ఆర్టీసీలోనూ ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇందుకోసం టెండర్లు పిలిచేందుకు ఆర్థిక అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24న టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించారు. దీనికి ముందుగా ఈ నెల 8న ప్రీ బిడ్ సమావేశానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. టెండర్ల తర్వాత ఆన్లైన్లోనే రివర్స్ టెండర్లను ఆర్టీసీ నిర్వహించనుంది. టిక్కెట్ బుక్ చేసుకోవడం చాలా సులభం.. దేశంలో ఏ ఆర్టీసీ అమలు చేయని విధంగా ఏపీఎస్ఆర్టీసీ క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆర్టీసీ టికెటింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అడాŠవ్న్స్ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే ఇకపై డైనమిక్ క్యూ ఆర్ కోడ్ ప్రయాణికుడికి అందుతుంది. ఆ క్యూ ఆర్ కోడ్‌ను బస్సులో డ్రైవరు వద్ద ఉన్న ఈ–పోస్ (ఎల్రక్టానిక్ పాయింట్ ఆఫ్ సేల్) మిషన్‌కు చూపిస్తే చాలు.. ఎంచక్కా ప్రయాణించవచ్చు. అంతేకాదు.. యూటీఎస్ విధానంలో బస్సు బయలుదేరిన తర్వాత కూడా టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. దూర ప్రాంత సర్వీసైనా.. లేదా స్థానికంగా తిరిగే సర్వీసుల్లోనైనా.. టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు విజయవాడ నుంచి తిరుపతి వెళ్లే దూరప్రాంత సర్వీసుకు ఇప్పుడున్న విధానంలో బస్సు బయలుదేరితే టికెట్ బుక్ చేసుకోవడానికి కుదరదు. యూటీఎస్ విధానం అమల్లోకి వచ్చాక గుంటూరులో ఉండే ప్రయాణికుడు విజయవాడ నుంచి బయల్దేరే తిరుపతి సర్వీస్ బస్సుకు ఇంట్లో కూర్చుని సీటు బుక్ చేసుకోవచ్చు. బస్సు విజయవాడ నుంచి గుంటూరు వచ్చేలోపు బుక్ చేయవచ్చు. రియల్ టైం సమాచారం యూటీఎస్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఇదే కాదు.. నాన్‌స్టాప్ బస్సుల్లో సైతం అవి బయల్దేరాక కూడా బుక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే నాన్‌స్టాప్ బస్సుకు రామవరప్పాడులో ఉండి.. సీట్లున్నాయో లేవో తెలుసుకుని బుక్ చేయవచ్చు. ఆన్లైన్లో అందుబాటులోకి 20 లక్షల సీట్ల బుకింగ్ ఆర్టీసీలో రోజూ 60 లక్షల సీట్ల వరకు అందుబాటులో ఉంటాయి. వీటిలో 1.40 లక్షల సీట్లకు ఆన్లైన్లో రిజర్వేషన్ సౌకర్యం ఉంది. ఈ సీట్ల సంఖ్యకు 15 రెట్లు అంటే దాదాపు 20 లక్షల సీట్లకు ఆన్లైన్లో బుక్ చేసేలా అవకాశం కల్పించనున్నారు. పల్లెవెలుగు బస్సుల నుంచి హై ఎండ్ టెక్నాలజీ బస్సులకు ఈ విధానం అమలవుతుంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్లను కలిపి ఈ ప్రాజెక్టు అమలు చేస్తారు. ఈ ప్రాజెక్టులో క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ వినియోగించనున్నారు. ఆన్లైన్ టికెటింగ్‌ను ప్రోత్సహించేందుకు యూటీఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 39 శాతం మేరకే ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ శాతాన్ని ఇంకా పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. యూటీఎస్ విధానం అంటే... రియల్ టైంలో బస్సు ఎక్కడుందో.. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. బస్సులో టిమ్ మిషన్లకు బదులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ–పోస్ మిషన్లలో టికెట్లను జారీ చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏ ఆర్టీసీ బస్సులో ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో.. ప్రధాన కార్యాలయంలో నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. డ్రైవరు ఈ–పోస్ మిషన్‌లో నమోదు చేసే వివరాలు సెంట్రల్ సర్వర్‌కు ఎప్పటికప్పుడు వెళతాయి. అక్కడ్నుంచి యాప్‌లో ప్రయాణికుడు తెలుసుకోవచ్చు. ప్రస్తుతమున్న విధానంలో డిపోకు టిమ్ మిషన్ తీసుకువచ్చాకనే టికెట్ల అమ్మకం వివరాలు తెలుస్తాయి. సీఎం సూచనలతో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు అమలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ ప్రాజెక్టును అమలు చేయనున్నాం. అత్యంత పారదర్శకంగా టికెట్ విధానం ఉంటుంది. ఆర్టీసీ మొత్తం 47 రకాల పాస్‌లు జారీ చేస్తుంది. వికలాంగులు, విద్యార్థులు, ఎన్జీవోలకు.. ఇలా అన్ని కేటగిరీల వారికి పాస్‌లు అందిస్తున్నాం. పాస్‌లు పొందాలన్నా.. టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలన్నా.. ఫిర్యాదులు చేయాలన్నా.. వేర్వేరు వెబ్సైట్లకు వెళ్లకుండా ఒకే యాప్ త్వరలో అందుబాటులోకి వస్తుంది. డిజిటల్ పేమెంట్లు ప్రోత్సహించే విధంగా రాబోయే కాలంలో మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. – ఆర్పీ ఠాకూర్, ఆర్టీసీ ఎండీ -
గాడిన పడుతున్న ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా గత ఏడాది భారీగా ఆదాయాన్ని కోల్పోయిన ఏపీఎస్ ఆర్టీసీ ఈ ఏడాది ఆరంభం నుంచి రాబడి క్రమంగా పెరుగుతుండటంతో గాడిన పడుతోంది. గతేడాది మార్చి 22 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రూ.2,603 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి పుంజుకోవడంతో రోజువారీ సగటు ఆదాయం రూ.12 కోట్లకు చేరింది. గత ఏడాది జనవరిలో 69 శాతం ఆక్యుపెన్సీతో రూ.420 కోట్ల ఆదాయం లభించగా.. ఈ ఏడాది జనవరిలో 64 శాతం ఆక్యుపెన్సీతో రూ.360 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ నెలలో 12వ తేదీ వరకు లభించిన ఆదాయం రూ.145 కోట్లకు చేరింది. మార్చి నాటికి టికెట్ రెవెన్యూ రూ.400 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దూరప్రాంత సర్వీసులపై ప్రత్యేక దృష్టి దూర ప్రాంత సర్వీసులను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణతో అంతర్ రాష్ట్ర సర్వీసుల ఒప్పంద సమయంలో.. కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే తెలంగాణకు నడిపే 1,60,999 కిలోమీటర్ల మేర సర్వీసులను 2,08,856 కిలోమీటర్లకు పెంచుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ దిశగా దృష్టి సారించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి వచ్చే సర్వీసులకు డిమాండ్ పెరిగింది. ఎక్కువమంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తుండటంతో స్పెషల్ సర్వీసులను నడుపుతున్నారు. శుక్రవారం ఏపీలోని అన్ని ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి 81 స్పెషల్ సర్వీసులు తిప్పారు. మరోవైపు తిరుపతికి కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ ప్రవేశపెట్టిన తిరుమల శీఘ్రదర్శనం టికెట్ ఆఫర్‌కు మంచి స్పందన వస్తోంది. రోజుకు సగటున 20 వేల మంది తిరుపతి వెళ్లేందుకు ఆర్టీసీ టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. దూరప్రాంత సర్వీసుల్లో 10 శాతం రాయితీ విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకు వెళ్లే డాల్ఫిన్, అమరావతి, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో ప్రయాణించే వారు 48 గంటల ముందే టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటే టికెట్ ధరలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. అయితే బస్సులో నాలుగైదు సీట్లకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుంది. డాల్ఫిన్ బస్సులో 58 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి.. అమరావతి బస్సులోలో 49 సీట్ల కెపాసిటీకి గాను ఐదుగురికి, ఇంద్రలో 40 సీట్లుంటే నలుగురికి, సూపర్ లగ్జరీలో 35 సీట్లకు గాను నలుగురికి, అల్ట్రా డీలక్స్‌లో 39 సీట్లకు గాను నలుగురు, ఎక్స్‌ప్రెస్ బస్సులో 49 సీట్లకు ఐదుగురికి రాయితీ అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మార్చి నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ ఐటీ అధికారులు సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. -
రోడ్డు భద్రత ఎక్కడ..?
సాక్షి, హైదరాబాద్: దేశసరిహద్దుల్లో చనిపోయే సైనికుల కన్నా.. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యే అధికం. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ 11న జరిగిన జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదం దేశచరిత్రలోనే ఒక చీకటి దినంగా మిగిలిపోయింది. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి 65 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 100 అడుగుల లోయలో పడ్డా.. 30 మందికి మించి మరణించిన దాఖలాలు లేవు. కానీ, పట్టుమని 10 అడుగుల లోతులేని కందకం లో పడి భారీ ప్రాణనష్టం జరగడం ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఓవర్లోడింగ్.. కొండగట్టు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఓవర్లోడింగ్. బస్సు సామర్థ్యం 44 సీట్లు కాగా దుర్ఘటన సమయంలో బస్సులో 110 మంది వరకు ప్రయాణికులు ఎక్కారు. ఫలితంగా కందకంలో పడగానే.. మహిళలు, చిన్నారులు ఊపిరాడక ప్రాణాలొదిలారు. ప్రమాదం జరిగిన రోజు 57 మంది మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65కి చేరింది. దేశ స్వాతంత్య్రం తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇంతటి భారీ ప్రాణనష్టం ఇదే కావడం గమనార్హం. ఘటనాస్థలాన్ని రవాణామంత్రి, ఆర్టీసీ చైర్మన్, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ సంబంధిత అధికారులంతా పరిశీలించారు. ఆ దుర్ఘటన తర్వాత ఆర్టీఏ నాలుగు రోజుల పాటు తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంది. అంతమంది ప్రాణాలు బలి తీసుకున్న తర్వాత ప్రభుత్వం రోడ్డు భద్రతలో ప్రత్యేకంగా చర్యలేమీ తీసుకోకపోవడం గమనార్హం. ప్రమాదానికి కారణమైన ఘాట్ రోడ్డుపై భారీ వాహనాలను, బస్సులను కంటితుడుపు చర్యగా నిషేధించింది. కానీ, ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణాలో, గూడ్సు వాహనాల్లో ఓవర్ లోడింగ్ సమస్య కొనసాగుతూనే ఉంది. రోజుకు 646 కేసులు రాష్ట్రంలో రోజుకు సగటున 646 ఓవర్లోడింగ్ కేసులు బుక్కవుతున్నాయి. సెప్టెంబర్ 5 వరకు వీటి సంఖ్య దాదాపుగా 15,400 వరకు చేరింది. రోజుకు రూ.లక్ష చొప్పున ఇప్పటిదాకా రూ.29 కోట్ల వరకు జరిమానా రూపంలో చెల్లించారు. రాష్ట్రంలో రోజుకు 59 ప్రమాదాల చొప్పున మొత్తం 14,700 వరకు రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. అందులో రోజుకు 18 మంది చొప్పున మరణిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 4,300 మంది ప్రాణాలు రోడ్డు పాలయ్యాయి. ప్రతీ 93 నిమిషాలకో ప్రాణాన్ని రోడ్డు ప్రమాదాలు బలితీసుకుంటున్నాయి. రోజుకు 62 మంది గాయపడుతుండగా ఇప్పటివరకు 15,400 మంది వరకు క్షతగాత్రులయ్యారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓవర్లోడింగ్ సమస్య కారణంగా రోజుకు వందలాది కేసులు బుక్కవుతున్నా.. ఎలాంటి వాటి నివారణలో ఎలాంటి పురోగతి లేదన్న విషయం తేటతెల్లమవుతోంది. -
ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లింది.. ఆటోడ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: గౌలిగూడ బస్టాండ్ నుంచి కుషాయిగూడకు చెందిన ఆర్టీసీ బస్సును ఎత్తుకుపోయింది అన్నదమ్ములైన ఆటోడ్రైవర్లుగా తేలింది. గతంలో పలు చోరీలు చేసిన ఈ ద్వయం తన సమీప బంధువు ఇచ్చిన ‘సలహా’తో ఈ బస్సు దొంగతనం చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించామని, 8మందిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శనివారం తెలిపారు. చోరీకి సంబంధించి ఆర్టీసీ అధికారుల నుంచి తమకు ఫిర్యాదు ఆలస్యంగా అందిందని చెప్పారు. తూర్పు మండల సంయుక్త పోలీసు కమిషనర్ ఎం.రమేశ్‌తో కలసి తన కార్యాలయంలో మీడియాకు ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. తీరు మార్చుకోమంటే పంథా మార్చుకుని... నగరంలోని చిలకలగూడకు చెందిన అన్నదమ్ములు సయ్యద్ అబేద్, సయ్యద్ జహీద్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్లు. ఇలా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందక చోరీల బాటపట్టారు. అబేద్ ఒంటరిగా 2015 నుంచి 2018 వరకు గోపాలపురం, పంజగుట్ట, నల్లకుంట, ఎల్బీనగర్, మీర్‌చౌక్, మలక్‌పేటల్లో 9 చోరీలు చేశాడు. గత ఏడాది జహీద్ కూడా ఇతడికి తోడయ్యాడు. దీంతో ఇద్దరూ కలసి మలక్‌పేట, ఎల్బీనగర్, హయత్‌నగర్, మారేడ్‌పల్లి, మీర్పేట్, ఉప్పల్‌లో 7 నేరాలు చేశారు. ఇలా పదేపదే నేరాలు చేస్తూ జైలుకు వెళ్తున్న వీరిపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉండే సమీప బంధువు మహ్మద్ నవీద్ స్క్రాప్ వ్యాపారం చేస్తుంటారని, అక్కడకు వెళ్లి ఆయనతో కలసి పని చేసుకుని బతకాలని సూచించింది. దీంతో వారం క్రితం వీరు నాందేడ్ వెళ్లి అతడిని కలిశారు. వాస్తవానికి ఓ మరమ్మతుల దుకాణంలో చేరాలని భావించారు. నవీద్ ఓ సందర్భంలో ఏవైనా పాత భారీ వాహనాలు ఉంటే తీసుకురావాలని, తాను ఖరీదు చేస్తానని వీరికి చెప్పాడు. దీనికి ఇద్దరూ అంగీకరించి రూ.లక్షకు ఒప్పందం చేసుకుని రూ.60 వేలు అడ్వాన్స్ తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి లారీ లేదా బస్సు చోరీ చేయాలని భావించారు. నవీద్‌కు నాందేడ్‌లో నేరచరిత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. భారీ వాహనాలు నడపడంలో అబేద్ దిట్ట... దుబాయ్‌లో ఉండి వచ్చిన అబేద్ భారీ వాహనాలను వేగంగా నడపడంలో దిట్ట. బుధవారం నగరానికి చేరుకున్న వీరు భారీ వాహనం చోరీకి అనువైన ప్రాంతం కోసం వెతికారు. వీరు ఆటోడ్రైవర్లుగా గౌలిగూడ బస్టాండ్ పరిసరాల్లో ఎక్కువగా సంచరించారు. రాత్రివేళ అక్కడ బస్సులు ఆపి ఉంచడాన్ని వీరు గమనించారు. దీంతో నేరుగా అక్కడకు వెళ్లిన వీరు కుషాయిగూడ డిపోకు చెందిన 3డీ రూట్ బస్సును సెల్ఫ్‌స్టార్ట్‌తో స్టార్ట్ చేశారు. బస్సును ఎంట్రీ గేటు నుంచి రాత్రి 12 గంటలకు తీసుకుని బయటకు వచ్చారు. అక్కడ నుంచి తూప్రాన్, నిర్మల్, బోకరోల మీదుగా నాందేడ్ వెళ్లారు. బస్సు 2009 మోడల్‌ది కావడం, 480 కి.మీ. ఆపకుండా వేగంగా నడపడంతో నాందేడ్‌కు 35 కి.మీ. దూరంలో యాక్సిల్ రాడ్ విరిగిపోయింది. దీంతో ఓ క్రేన్ మాట్లాడుకుని నాందేడ్‌కు 10 కి.మీ. దూరంలోని తాత్కాలిక షెడ్‌కు చేరుకున్నారు. గ్యాస్ కట్టర్‌తో తుక్కుగా... బస్సు చోరీకి సంబంధించి ఆర్టీసీ అధికారుల నుంచి పోలీసులకు ఫిర్యాదు ఆలస్యంగా అందింది. గురువారం ఉద యం 5.30 గంటలకు డ్రైవర్ జె.వెంకటేశం బస్సు చోరీ అయినట్లు గుర్తించారు. విష యం పోలీసులకు చేరే వరకు ఉదయం 10 గంటలైంది. అప్పటికే అబేద్, జహీ బస్సును తాత్కాలిక షెడ్‌కు తరలించేశారు. అక్కడ నవీద్, అతడి భాగస్వామి ఫారూఖ్ వద్ద పని చేసే గ్యాస్ కటింగ్ వర్కర్లు మహ్మద్ జుబేర్, మహ్మద్ ఒమర్, సయ్యద్ సల్మాన్, మహ్మద్ షఫీఖ్, మహ్మద్ కలీం సిద్ధంగా ఉన్నారు. గ్యాస్ కట్టర్లతో ఇంజన్, చాసిస్ మినహా మొత్తం తుక్కుగా మార్చేశారు. అఫ్జల్‌గంజ్ ఏసీపీ దేవేందర్ నేతృత్వంలోని బృందం సీసీ కెమెరాల ఫీడ్‌తో పాటు వివిధ మార్గాల్లో అన్వేషిస్తూ బస్సును తుక్కుగా మారుస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న ఫారూఖ్ మినహా 8 మందిని పట్టుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకోవడం మరికాస్త ఆలస్యమైనా బస్సు పూర్తిగా అదృశ్యమైపోయేదే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబేద్‌పై గతంలో మలక్‌పేట పోలీసులు పీడీ యాక్ట్ సైతం ప్రయోగించారు. ఈ బస్సు చోరీ నేపథ్యంలో గౌలిగూడ బస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ లోపాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని చక్కదిద్దడం కోసం సుల్తాన్‌బజార్ శాంతిభద్రతల విభాగం ఏసీపీ, ట్రాఫిక్ ఏసీపీ, సీఎస్‌డబ్ల్యూ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగం వారితో కూడిన బృందం శనివారం ఆ ప్రాంతంలో సెక్యూరిటి ఆడిట్ నిర్వహించింది. దీనిపై త్వరలో ఓ నివేదిక రూపొందించనుంది. -
సకాలంలో రాని బస్సు..
సాక్షి, హైదరాబాద్: బస్సు సకాలంలో రాకపోవడంతో ఓ ప్రయాణికుడు ఎస్ఎంఎస్ ద్వారా రవాణా మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్టీసీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కరీంనగర్‌కు చెందిన శంకరయ్య, అతని కుమారుడు అరవింద్‌లు అహ్మదాబాద్ నుంచి ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఎయిర్‌పోర్టు నుంచి కరీంనగర్ వెళ్లాల్సిన బస్సులో ఆన్లైన్ ద్వారా వీరు టికెట్ బుక్ చేసుకున్నారు. ఉదయం పదిన్నరకు రావాల్సిన బస్సు కనిపించకపోవటంతో వారు ఎయిర్‌పోర్టులో ఉన్న ఆర్టీసీ కౌంటర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కౌంటర్లో సిబ్బంది కూడా లేకపోవటంతో ఎస్ఎంఎస్ ద్వారా రవాణా శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే బస్సును ఏర్పాటు చేశారు. అయితే బస్సు సకాలంలో ఎందుకు రాలేదని, సిబ్బంది కౌంటర్లో ఎందుకు లేరని ప్రశ్నించిన మంత్రి ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. -
సీబీఎస్ అభివృద్ధి పనులపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సెంట్రల్ బస్ స్టేషన్ (సీబీఎస్) పునర్నిర్మాణ, ఆధునీకరణ పనులపై రాష్ట్ర ఆర్టీసీ అధికారులు సమీక్షించారు. కొద్ది రోజుల కిందటే సీబీఎస్ రేకుల షెడ్డు కూలిపోవడంతో ఆ స్థలంలో ఆధునీకరణ పనులు చేపట్టేందుకు కార్యాచరణను రూపొందించారు. సీబీఎస్‌లో ప్రయాణీకులకు మెరుగైన రవాణా సదుపాయాల కల్పనతో పాటు సంస్థ వాణిజ్య పరంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీ ఈడీ, కార్యదర్శి పురుషోత్తం పర్యవేక్షణలో సీటీఎం (ట్రాఫిక్), సీటీఎం (ఎం అండ్ సీ)లతో పాటు ఇతర కమిటీ సభ్యులు సీబీఎస్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆదివారం సమీక్షించారు. ఇక్కడ బస్ పార్కింగ్ స్థలాన్ని సెల్లార్లో కేటాయించాలని నిర్ణయించారు. సంస్థ ఆర్థిక పరిపుష్టి కోసం 3 నుంచి మూడున్నర ఎకరాల స్థలాన్ని బీఓటీ పద్ధతిలో వాణిజ్య సముదాయాలకు ఇవ్వాలని సూత్రప్రాయంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మినీ థియేటర్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుతో పాటు ఖాళీ స్థలంలో పెట్రోల్ బంకు నిర్వహణను చేపట్టే దిశలో ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వేసవిలో తీవ్రమవుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకుల సౌకర్యం కోసం నామినేషన్ బేసిన్ మీద తాత్కాలిక షెల్టర్లను నెలకొల్పడానికి చర్యలు తీసుకోబోతున్నా రు. గతేడాదితో పోలిస్తే.. 16శాతం కమర్షియల్ అభివృద్ధి చెందగా, 25 నుంచి 30 శాతం మేర వాణిజ్య ఆదాయాన్ని పెంచుకోవడానికి గల అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఈడీ పురుషోత్తం మాట్లాడుతూ, సంస్థ ఆర్థిక స్థితిని మెరు గుపరుచుకునే క్రమంలో వాణిజ్య ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. -
‘అధికారులపై వేధింపులకు పాల్పడితే చర్యలు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉన్నతాధికారులపై, కార్మికులపై ఎవరు దూషణలకు పాల్పడినా అకారణంగా వేధించినా సహించేది లేదనీ, వారిపై చర్యలు తీసుకుంటామని సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. బుధవారం ఆర్టీసీ భవన్లో మాట్లాడు తూ.. ఇటీవల సీసీఎస్ బకాయిలను చెల్లించాలంటూ జరిగిన నిరసన సందర్భంగా టీఎం యూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డిలు అకారణంగా ఆర్థిక సలహాదారు స్వర్ణ శంకరన్‌పై నిందలు వేయడాన్ని తప్పుబట్టారు. మరోసారి ఇలాంటి చర్యలకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులకు చెందిన సీసీఎస్, పీఎఫ్, ఎస్ఆర్బీఎస్ నిధులను సంస్థ మళ్లించడం తప్పేనని, తప్పని పరిస్థితుల్లోనే అలా చేశామన్న సంగతిని గుర్తించాలని విన్నవించారు. ప్రగతి నివేదన సభకు తరలించే బస్సులకు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
నంబర్ ప్లేట్ కావాలా నాయనా!
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ పేరుతో వాహనదారుల నుంచి డబ్బులు నొక్కేస్తున్నారు. నెలకు లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారు. వాహనదారులు ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్నారు. కంపెనీ ప్రతినిధుల అక్రమాలపై సంబంధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పేట్లలో నాణ్యతకూడా అంతంత మాత్రంగానే ఉంది. నెల్లూరు(టౌన్): హై సెక్యూరిటీ పేరుతో కంపెనీ ప్రతినిధులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ప్రమాదాలను తగ్గించి ప్రమాణాలను పెంపొందించాలన్న ఉద్దేశంతో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వాహనానికి నంబర్ ప్లేట్‌ను బిగించాల్సి ఉంది. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అక్రమ వసూళ్లను నియంత్రించాల్సిన రవాణా, ఆర్టీసీ అధికారులు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్లేట్ కోసం ఎదురుచూపులు హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు విధానం 2016 జనవరి నుంచి అమలులోకి వచ్చింది. నంబర్ ప్లేట్ల తయారీ కాంట్రాక్ట్ట్ను లింకో ఆటో టెక్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి వాహనానికీ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవాలని అధికారులు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే నంబర్ ప్లేట్‌కు కూడా చలానా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చలానా చెల్లించిన నాలుగు రోజులకు నంబర్ ప్లేట్ బిగించాల్సిఉంది. అయితే 20 నుంచి 25 రోజులకు పైగా నంబర్ ప్లేట్ కోసం ఎదురుచూడాల్సివస్తోందని వాహనదారులు వాపోతున్నారు. అన్ని రకాల పన్నులతో కలిపి ద్విచక్రవాహనానికి రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ.282, నాలుగు చక్రాల వాహనానికి రూ.619, లారీలకు రూ.650, ట్రాక్టర్ ట్రైలర్‌కు రూ.900 ధరను నిర్ణయించారు. నంబర్ ప్లేట్‌ను కంపెనీ ప్రతినిధులే బిగించాల్సిఉంటుంది. అయితే నంబర్ ప్లేట్ నాణ్యత పడిపోయి పలుచటి రేకును వాడుతుండడంతో దెబ్బతింటోందని వాహనదారులు చెబుతున్నారు. నెలకు రూ.3 లక్షల అక్రమార్జన జిల్లాలో నెల్లూరుతోపాటు గూడూరు, కావలి, సూళ్లూరుపేట, ఆత్మకూరు ప్రాంతాల్లో వాహనాలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు సరాసరి 200కు పైగా వివిధ రకాల వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే నంబర్ ప్లేట్‌కు చలానా కట్టించుకున్న లింక్ ఆటో టెక్ ప్రతినిధులు సంబంధిత వాహనానికి ప్లేట్‌ను ఉచితంగా బిగించాలన్న నిబంధన ఉంది. కంపెనీ ప్రతినిధులు మాత్రం నంబర్ ప్లేట్ బిగించినందుకు కారు, రవాణా వాహనాలకు రూ.200 నుంచి రూ.300 వరకు, బైకుకు రూ.50 నుంచి రూ.100 వరకు ఇస్తేనే నంబర్ ప్లేట్ బిగిస్తున్నారు. అదనంగా ఎందుకు ఇవ్వాలని వాహనదారులు అడిగితే కంపెనీ ప్రతినిధులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఈ లెక్కన అన్ని రకాల వాహనాలకు కలిపి సరాసరి రూ.50 ప్రకారం లెక్కిస్తే రోజుకు ఆదాయం రూ.10 వేలు ఉంటోంది. అంటే నెలకు వీరి అక్రమ సంపాదన రూ.3 లక్షల వరకు ఉంటోంది. ఇంటికి వచ్చి వాహనానికి నంబర్ ప్లేట్ బిగిస్తే రూ.200 వసూలు చేస్తున్నారు. ఇలా కంపెనీ ప్రతినిధులు వాహనదారులను దోపిడీ చేస్తున్నారు. చోద్యం చూస్తున్న అధికారులు నంబర్ ప్లేట్ బిగించే విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రవాణా కార్యాలయంలోనే తమ కళ్ల ముందే కంపెనీ ప్రతినిధులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా అదనపు వసూళ్లపై ప్రశ్నిస్తే రవాణా అధికారుల సాయంతో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. నంబర్ ప్లేట్ కూడా వాహనానికి సక్రమంగా బిగించడం లేదని చెబుతున్నారు. వాహనానికి ఇచ్చిన రంధ్రాలు, నంబర్ ప్లేట్ సైజు సరిపడకపోవడంతో వంకరటింకరగానే ప్లేట్ బిగించుకోవాల్సివస్తోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా కంపెనీ ప్రతినిధుల అక్రమ వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న విషయం దృష్టికి వచ్చింది.నంబరు ప్లేటు బిగిస్తే అదనంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే రవాణాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. వారి మీద చర్యలు తీసుకునే అధికారం మాకులేదు. కొంతమంది వాహన యజమానులు ఎక్కువ డబ్బులు ఇచ్చి నెంబరు ప్లేటును ఇంటికి తీసుకెళ్తుతున్నారు. – ఎన్.శివరాంప్రసాద్, రవాణాశాఖ ఉప రవాణా కమిషనర్ తయారీ వరకే మా పరిధి నంబర్ ప్లేట్ తయారీ వరకే మా పరిధి ఉంది. నాణ్యత ప్రమాణాలుపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి దానిని ఫార్వర్డ్ చేస్తాం. మిగిలిన వాటిని రవాణా అధికారులు చూసుకుంటారు. – రవివర్మ, రీజనల్ మేనేజర్, ఆర్టీసీ -
ఆర్టీసీలో ‘చిల్లర’కొట్టుడు
విజయనగరం అర్బన్: ‘లెంక నాగభూషణ భార్యతో కలసి విజయనగరం నుంచి విశాఖకు వెళ్లడానికి మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండులోని మెట్రో సిటీబస్సు ఎక్కారు. కండక్టర్ టికెట్ అడగడంతో రూ.100 నోటు ఇచ్చారు. టికెట్ రూ.47 వంతున రెండు టిక్కెట్లకు రూ.94 పోగా మిగిలిన ఆరు రూపాయలకు టికెట్ వెనుక కండెక్టర్ రాసిచ్చాడు. బస్సు దిగిన తర్వాత టికెట్ చూపించగా... నాలుగు రూపాయలిస్తే పది రూపాయలు ఇస్తానని కండెక్టర్ అన్నాడు. దీంతో తన వద్ద చిల్లర లేదని ప్రయాణికుడు చెప్పడంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు ప్రయాణికుడే చిల్లర వదులుకోవాల్సి వచ్చింది’. ఈ సమస్య ఒక్క విశాఖ రూట్లో సర్వీస్‌లకు మాత్రమే కాదు. దాదాపు ప్రతి సర్వీస్‌లోనూ ఎదురవుతున్నాయి చివరకు ప్రయాణికులే నష్టపోవాల్సి వస్తోంది. ప్రయాణికులకు చిల్లర తిరిగిచ్చే కండక్టర్లు ఎంతోమంది ఉన్నప్పటికీ, చిల్లర చూపులు చూసే వారు కూడా ఉండడంతో సంస్థకు చెడ్డ పేరు వస్తోంది. బస్సు దిగే సమయంలో చిల్లర అడిగితే కస్సుబుస్సులాడడం... కాయిన్స్ ఉన్నా ఇవ్వకపోవడం.. కావాలనే టికెట్ వెనుకరాయడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఇదే విషయమై ఇటీవల నిర్వహించిన ‘డయల్ యువర్ డీఎం’కు ఫిర్యాదులు కూడా అందాయి. టికెట్ కోసం రూ. 100, రూ.500 నోట్లు ఇచ్చినప్పుడు మిగిలిన చిల్లరను టికెట్ వెనుక రాస్తుండడంతో బస్సు దిగే తొందరలో చాలామంది డబ్బులు మరిచిపోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. యాజమాన్యం చిల్లర ఇవ్వదా..? ఆర్టీసీ కండక్టర్లకు విధుల్లో చేరిన రోజున యాజమాన్యం కేవలం రూ.150 చిల్లర మాత్రమే ఇస్తుంది. మిగిలిన చిల్లరను డ్యూటీలోనే సర్దుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ చిల్లర విషయంలో ఇబ్బందులెదురవుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ మార్గాల్లో సమస్యలు జిల్లాలోని విజయనగరం, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట డిపోల పరి«ధిలో 412 బస్సులు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. నెలలో సుమారు 49.80 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, 6.19 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. విజయనగరం మీదుగా విశాఖ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లతో పాటు విజయనగరం నుంచి బొబ్బిలి మీదుగా పార్వతీపురం, సాలూరు రాకపోకలు చేసి పల్లెవెలుగులు, విజయగరం నుంచి చీపురుపల్లి మీదుగా రాజాం, పాలకొండ సర్వీసుల్లో ఈ చిల్లర సమస్య అధికంగా ఉంటుంది. ఈ మార్గాల్లోని కండక్టర్లకు చిల్లర సర్దుబాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర అవసరం మరింత ఎక్కువ. ఈ విషయమై ప్రజలకు, కండక్టర్ల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ విధులకు హాజరయ్యే కండక్టర్లకు యాజమాన్యం చిల్లర ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం రూ.500 విలువచేసే రూ.1, రూ.2, రూ.5 నాణేలు, మరో రూ.1000 విలువ చేసే రూ.10 నోట్లు ఇస్తే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. అయితే ఆర్టీసీ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. పరిష్కార అవకాశాలున్నా.... జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో ఉన్న వేయింగ్ (తూనిక) మిషన్ల ద్వారా చిల్లర సమస్య కొంతమేరకు పరిష్కరించుకోవచ్చు. వీటి ద్వారా వచ్చే నాణేలను ఆయా డిపోల్లో చెల్లించే విధంగా అధికారులు ఆదేశిస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది. అలాగే విశాఖ ఆ పై పట్టణాలకు రాకపోకలు చేసే బస్సుల్లో మెరుగైన ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని ప్రయాణికులు సూచిస్తున్నారు. డెబిట్‌కార్డు, ఫోన్‌పే, నగదు బదిలీ చేసే యాప్‌లు ఉపయోగిస్తే చిల్లర సమస్య కొంతమేర తీరే అవకాశం ఉంది. సమస్య తీవ్రంగా ఉంది చిల్లరతో ప్రతిరోజూ సమస్యలొస్తున్నాయి. విధుల్లో చేరే ముందుగానే చిల్లర సిద్ధం చేసుకుంటున్నాం. అయినప్పటికీ ప్రయాణికులు రూ. 500 నోట్లు ఎక్కువగా ఇస్తుండడంతో ఇబ్బందులేర్పడుతున్నాయి. దీనికితోడు యాజమాన్యం చిల్లర నాణేలు, రూ.10 నోట్లు ఇవ్వడం లేదు. –ఎం.రామారావు, కండక్టర్, విజయనగరం డిపో సహకరించాలి చిల్లర సమస్య అన్ని చోట్లా ఎదురవుతున్నట్లు గుర్తించాం. ప్రయాణికులు ఎక్కువగా రూ. 100, రూ. 500 నోట్లు ఇస్తున్నారు. బ్యాంక్‌ల నుంచి చిల్లర తీసుకుంటున్నాం. ప్రయాణికులు సరిపడా చిల్లర తెచ్చుకుంటే మంచింది. కండక్డర్లకు ప్రయాణికులు సహకరిస్తే చిల్లర సమస్య అధిగమిస్తాం. – ఎన్వీఏస్వేణుగోపాల్, డిపో మేనేజర్, విజయనగరం -
ఎక్స్‌ప్రెస్‌లొస్తే ఒట్టు..
భిక్కనూరు : ఆ ఊరికి బస్సుల్లేవని పిల్లనివ్వడం లేదు..నిజమే వింతగా అనిపించినప్పటికీ భిక్కనూరు మండలానికి ఇలాంటి చిక్కొకటి వచ్చిపడింది. మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు భిక్కనూరు రాష్ట్రంలోనే ఆదర్శమండలంగా పేరొందింది. నాలుగులైన్ల రోడ్డు ఏర్పాటు కానప్పుడు ప్రతి ఆర్టీసీ బస్సు భిక్కనూరు మీదుగా వెళ్లేది. ఏ రాత్రయినా భిక్కనూరు రావాలంటే బస్సులుండేవి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. జంకుతున్నారు.. భిక్కనూరు పిల్లనివ్వాలంటే జంకే రోజులొచ్చాయి. ఎప్పుడైతే నిజామాబాద్, హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్డు వచ్చిందో భిక్కనూరును చూసేవారే కరువయ్యారు. ఎక్స్‌ప్రెస్ బస్సు కనిపిస్తే ఒట్టు.. ఒకప్పుడు నాల్గులైన్ల రోడ్డును భిక్కనూరు మీదుగా వెళ్ల వద్దని కొందరూ అభ్యంతరం చెప్పడంతో ఎన్‌హెచ్ అధికారులు భిక్కనూరుకు బైపాస్‌ను ఏర్పాటు చేశారు. దీంతో భిక్కనూరు మండల కేంద్రానికి ఎక్స్‌ప్రెస్ బస్సులు రావడం తగ్గాయి. దీంతో ప్రజలు పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టడం నిరాహారదీక్షలు చేశారు. హామీలు రెండ్రోజులకే.. ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టి బస్సులను అడ్డుకుంటే ఆర్టీసీ అధికారులు వచ్చి బస్సులున్నింటిని భిక్కనూరు మీదుగా వెళ్తాయని హామీ ఇచ్చి వెళ్తారు. ఆ తర్వాత రెండు, మూడురోజుల భిక్కనూరు మీదుగా వెళ్తాయి. అనంతరం షరామూమాలే.. బైపాస్ రోడ్డు మీద దిగి భిక్కనూరుకు నడుచుకుంటూ వస్తున్నారు. ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లు భిక్కనూరులో స్టాప్ ఉన్నప్పటికి బస్సులను భిక్కనూరు మీదుగా తీసుకెళ్లడం లేదు. కొందరూ ప్రయాణికులు డ్రైవర్లను, కండక్టర్లను నిలదీయడంతో ఆ ఒక్క బస్సు మాత్రమే భిక్కనూరు మీదుగా వెళ్తుంది. తర్వాత మళ్లీ మామూలే. ప్రతిరోజూ గొడవ పడలేం.. ప్రతిరోజు ఏం గొడవ పెట్టుకుంటాం మా ఖర్మ.. అనుకుంటూ ప్రయాణికులు భిక్కనూరు స్టాప్ దగ్గర దిగి ఊళ్లోకి నడుచుకుంటూ వస్తున్నారు. పిల్లాపాపలను ఎత్తుకొని అంతదూరం నడుచుకుంటూ ఊళ్లోకి రావడం నరకాన్ని తలపిస్తోంది మహిళలు అంటున్నారు. కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్–1 నిజామాబాద్–2 నిర్మల్, ఆదిలాబాద్, బైంసా, బాన్స్వాడ, హైదరాబాద్ డిపోలకు చెందిన బస్సులు ప్రధానంగా వెళ్తాయి. కామారెడ్డి డిపోకు చెందిన కొన్ని ఎక్స్‌ప్రెస్ బస్సులు కూడా భిక్కనూరు మండల కేంద్రం మీదుగా వెళ్లడంలేదు. ఎక్స్‌ప్రెస్‌లు ఆగట్లేదు.. ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రయాణం అంటే భయమేస్తోంది. భిక్కనూరు నుంచి వేరే గ్రామాలకు వెళ్లాలంటే బస్సుల కోసం మం డల కేంద్రంలో గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తుంది. ఇక కామారెడ్డి హైదరా బాద్ వైపునుంచి బస్సులు బైపాస్ గుండా వెళ్లడంతో అక్కడి దిగి రావడం ఇబ్బందికరంగా ఉంది. – లక్ష్మీనారాయణ ప్రయాణికుడు భిక్కనూరు. చాలా కష్టంగా ఉంది.. మీ భిక్కనూరుకు పిల్లను ఇద్దామంటే బస్సులు రావు ఎలా ఇ స్తాం అని అంటున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులు రావు ఆర్డినరీ బస్సుల్లో వెళ్దామంటే నిల్చోవడానికే జాగా ఉండదు. ఏమి చేస్తాం ఆటోల్లో పోవాల్సి వస్తుంది. అన్ని బస్సులు భిక్కనూరు మీదుగా పోయేలా చేయాలి. అప్పుడే మాకు బస్సుల కష్లాలు పోతాయి. –ప్రమీల, బీడీ కార్మికురాలు భిక్కనూరు. -
సిటీ సర్వీసులెన్నడో?
రోజురోజుకు నగర పరిధి విస్తరిస్తున్నా అం దుకు అనుగుణంగా రవాణా వ్యవస్థ మెరుగుపడటం లేదని నగర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివారు కాలనీలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయిస్తే వారు నిర్ణయించిన చార్జీలు ఇవ్వాల్సి వస్తుందని, రాత్రి వేళల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందంటున్నారు. నిజామాబాద్ నాగారం: నగరంలో సిటీ బస్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ఏళ్లుగా నగరవాసులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆర్టీసీ అధికారులు అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తూనే ఉన్నారు. సాక్షాత్తు ఆర్టీసీ సంస్థ ఎండీ జీవీ రమణారావు ఏడాదిక్రితం సిటీ బస్సులు ప్రారంభిస్తామని చెప్పినా ఆ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదు. నగరంలో ఆటోల జోరు కొనసాగుతోంది. ఆదాయ మార్గమున్నా ఆర్టీసీ మాత్రం సిటీబస్సు సర్వీసులను ప్రారంభించడానికి ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగర పరిధి రోజురోజుకు నలువైపులా విస్తరిస్తూనే ఉంది. ఏవైపు వెళ్లినా సుమారు ఐదు కిలోమీటర్ల వరకు కాలనీలు వెలిశాయి. దీంతో నగరనడిబొడ్డున ఉన్న బస్టాండ్ నుంచి శివారు కాలనీలకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గల్లీలో నుంచి బస్టాండ్‌కు వెళ్లాలన్నా, బస్టాండ్‌నుంచి గల్లీలోకి వెళ్లాలన్నా ఆటోలే దిక్కు. ఇదే అదనుగా ఆటోవాలలు అందినకాడికి దండుకుంటున్నారు. బస్టాండ్ నుంచి కంఠేశ్వర్ మీదుగా దాస్‌నగర్ వరకు, అలాగే బస్టాండ్ నుంచి పూలాంగ్ మీదుగా మాధవనగర్ వరకు, బస్టాండ్ నుంచి వర్నిచౌరస్తా మీదుగా నాగారం వరకు, మరోవైపు గాంధీచౌక్, అర్సపల్లి మీదుగా సారంగపూర్ వరకు 5కిలో మీటర్ల పైనే విస్తరించింది. నగరంలోని 50 డివిజన్ల పరిధిలో 100కు పైగా కాలనీలున్నాయి. దీంతో బ స్టాండ్ నుంచి శివారు ప్రాం తాల్లోని ఏ కాలనీకి వెళ్లాలన్నా ఆటోవాలాలు రూ. 10 నుంచి 30వరకు వసూ లు చేస్తున్నారు. అదే రాత్రి 8గంటలకు దాటితే ఒక్కోరికి రూ.20 నుంచి రూ.50 కి పైగా వసూలు చేస్తు న్నారు. అయినా తప్పని పరిస్థితుల్లో ఆటో ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. నగరంలో 6వేల నుంచి 8వేల వరకు ఆటోలున్నాయి. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ భరోసా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతం. ఇది అందరికి తెలిసిందే. ప్రైవే ట్ ఆటోలో ప్రయాణం చేయాలంటే రాత్రుల్లో నగర ప్రజలు జంకుతున్నారు. ఆటోవాలల ఆగడాలు గురించి అందరికి తెలిసిందే. ఆర్టీసీ సిటీ సర్వీసులను తిప్పితే రాత్రి వేళల్లో సైతం సురక్షితంగా ఇంటికి చేరుకొవచ్చని నగరప్రజలంటున్నారు. నగరంలోని రోడ్లు విస్తరిస్తుండటంతో పాటు పునరుద్ధరిస్తుండటంతో బస్సులు నడపాలని కోరుతున్నారు. -
బస్టాండ్లలోకి ‘వజ్ర’ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ మొండిపట్టు వీడింది. వజ్ర మినీ బస్సులను బస్టాండ్లలోకి అనుమతించాలని నిర్ణయించింది. ఇంతకాలం ముఖ్యమంత్రి ఆదేశం పేరుతో వాటిని బస్టాండ్లకు అనుమతించకుండా కాలనీల మీదుగా నేరుగా గమ్యస్థానం వెళ్లేలా ప్రణాళిక అమలు చేశారు. కానీ, ప్రయాణికులు లేక ఖాళీగా అవి ఉరుకులు పరుగులు పెడుతూ భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. దీంతో వాటిని కూడా సాధారణ బస్సుల్లాగా బస్టాండ్ల మీదుగా తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా తొలుత హైదరాబాద్–నిజామాబాద్ మధ్య తిరుగుతున్న వజ్ర బస్సుల్లో, మెహిదీపట్నం, హైదరాబాద్–2 డిపో పరిధిలో ఉన్న బస్సులను సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్, అటు నిజామాబాద్ బస్టాండ్లలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం మొదలుపెట్టిన నాలుగు రోజుల్లోనే వాటి ఆక్యుపెన్సీరేషియో పెరిగింది. వాస్తవాన్ని గుర్తించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పుడు మిగతా బస్సులను కూడా బస్టాండ్లలోకి అనుమతించాలని భావిస్తున్నారు. సీఎం వద్దన్నారని... సాధారణ ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు బస్టాండ్లకు వెళ్లి ఎక్కటం పరిపాటి. ఆ శ్రమ లేకుండా బస్సులే కాలనీలకు వస్తే సమీపంలోనే వాటిల్లో ఎక్కేందుకు అవకాశం ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ మేరకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను గత సంవత్సరం ఆదేశించారు. దీంతో వజ్ర ఏసీ మినీ బస్సులను ఆర్టీసీ ఐదు నెలల క్రితం ప్రారంభించింది. ఇందులో కండక్టర్ ఉండరు, డ్రైవర్ టిమ్ యంత్రం ద్వారా టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. ప్రయాణికులు నేరుగా యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని నిర్ధారిత ప్రాంతంలో ఎక్కాల్సి ఉంటుంది. నగదురహిత లావాదేవీని ప్రోత్సహించినట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆర్టీసీ దీనికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్– నిజామాబాద్ మధ్య వీటిని ప్రారంభించింది. కానీ యాప్‌పై అవగాహన తక్కువ మందికి ఉండటంతో తొలిరోజు నుంచి ఇవి ఖాళీగా పరుగుపెట్టడం మొదలైంది. నెల తర్వాత రెండు చోట్ల ప్రైవేటు ఏజెన్సీలు టికెట్ ఇచ్చేలా నిబంధన మార్చారు. తర్వాత డ్రైవరే టికెట్ ఇచ్చే వెసులుబాటు తెచ్చారు. మరో నెల తర్వాత ప్రధాన బస్టాండ్ల సమీపంలో ఆగేవిధంగా నిబంధన మార్చారు. ఎంత చేసినా ఆక్యుపెన్సీ రేషియో 35 శాతాన్ని మించలేదు. నిబంధన మారిస్తే ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురవ్వాల్సిఉంటుందన్న భయంతో అధికారులు నష్టాన్ని భరిస్తూ వచ్చారు. కానీ, పరిస్థితి చేజారిపోతుండటంతో నిర్ణయం మార్చుకున్నారు. మెహిదీపట్నం, హైదరాబాద్–2 డిపో పరిధిలోని బస్సులు 4 రోజులుగా జూబ్లీబస్టాండ్, నిజామాబాద్ బస్టాండ్లలోకి వెళ్తున్నాయి. దీంతో ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి చేరుకుంది. వీటి టికెట్ ధరలు తగ్గిస్తే ఇవి కూడా సాధారణ బస్సుల్లాగా కిక్కిరిసి తిరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్ మార్గంలో తిరుగుతున్న బస్సులను కూడా బస్టాండ్లకు అనుమతిస్తే ఆక్యుపెన్సీ శాతం 60 శాతానికి చేరుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలో అధికారులు ఆ నిర్ణయం కూడా తీసుకుంటారని తెలుస్తోంది. -
ఆర్టీసీ సమావేశంలో కుదరని ఏకాభిప్రాయం
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల చర్చలు ఎటువంటి అంగీకారం లేకుండానే ముగిశాయి. ఆస్తుల పంపకాలపై జాతీయ స్థాయి అధికారుల సమక్షంలో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారులు సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అసంపూర్తిగా ముగిసింది. విభజన సమయంలో ఉమ్మడిగా ఉన్న 14 ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా అడుగుతోంది. అయితే తెలంగాణ మాత్రం కేవలం బస్ భవన్లో మాత్రమే వాటా ఇస్తామని అంటోంది. ఆస్తుల పంపకంపై ఏపీ అధికారులు ఓటింగ్ నిర్వహించాలని కోరినా తెలంగాణ అధికారులు తిరస్కరించారు. దీంతో ఉమ్మడి పాలక మండలి రెండు రాష్ట్రాల అభిప్రాయాలతో కూడిన నివేదికను కేంద్రం నియమించిన నిపుణుల కమిటీకి అందజేయాలని నిర్ణయించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వమే అంతిమ నిర్ణయం తీసుకోనుంది. -
కారుణ్యం కాదు..కాఠిన్యం!
విజయనగరం అర్బన్: సంస్థకు సేవలందించిన ఉద్యోగుల వారసుల పట్ల ‘కారుణ్యం’ చూపాల్సిన ఆర్టీసీ అధికారులు కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. విధి నిర్వహణలో ఉంటూ అకాల మరణం పాలైన ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడకుండా వారసులకు ఉద్యోగాలివ్వాలని చట్టం శాసించినా.. అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. అప్పుడప్పుడు అరకొర ఉద్యోగాలను భర్తీ చేస్తామనిప్రకటించి కాలం గడిపేస్తున్నారు. ఫలితంగా బాధిత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. 1998 నుంచి ఇప్పటివరకు ఆర్టీసీ నార్త్‌ఈస్టు కోస్టు(నెక్) రీజియన్ పరిధిలోని ‘కారుణ్య’ నియామకాలకు అర్హులు 600 మందికిపైగా ఉన్నారు. వీరి కోసం ఎప్పటికప్పడు పోస్టులను మంజూరు చేయాల్సిన అధికారులు తమ తోచినపుడు పరిమిత సంఖ్యలో భర్తీ చేస్తున్నారు. ధ్రువీకరణపత్రాల పరిశీలనలో జాప్యం.. అభ్యర్థుల పాట్లు తాజాగా నెక్ రీజియన్ అధికారులు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని డిపోల పరిధిలో కేవలం 116 కారుణ్య పోస్టులను ప్రకటించారు. వీటిలో 45 పోస్టుల భర్తీ ప్రక్రియను బుధవారం స్థానిక ఆర్ఎం కార్యాలయంలో చేపట్టారు. భర్తీ చేస్తున్న పోస్టులు 45 ఉండగా సీనియార్టీ ప్రాతిపదకన 94 మంది అభ్యర్థులను పిలిచారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పని ప్రారంభించకపోవడంతో అభ్యర్థులు అవస్థలు పడ్డారు. గంటల తరబడి ఎండలో నిరీక్షించలేక నరకయాతన అనుభవించారు. విజయనగరం జిల్లాలోని 37 కండక్టర్ పోస్టుల కోసం వచ్చిన 44 మంది, శ్రీకాకుళం జిల్లాలోని 8 పోస్టుల కోసం వచ్చిన 54 మంది ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. విజయనగరం జిల్లా పోస్టుల్లో డిపోలకు 33, నాన్ ఆపరేషన్ విభాగానికి 4 పోస్టులు కేటాయించారు. శ్రీకాకుళం జిల్లాలో నాలుగు కండక్టర్లు, నాలుగు శ్రామిక పోస్టులున్నాయి. వీటిలో సగం పోస్టులను మహిళలకు కేటాయించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఈ అప్పలనారాయణ, డీప్యూటీ సీటీఎం కె.శ్రీనివాసరావు (శ్రీకాకుళం), ఆర్ఎం కార్యాలయం పీవో మల్లికార్జునరాజు, సహాయ మేనేజర్ జె.తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
దోచుకున్న వారికి దోచుకున్నంత..
3 రోజుల ఆర్టీసీ సమ్మెతో తాత్కాలిక కార్మికుల చేతివాటం ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ శూన్యం బిక్కుబిక్కుమంటూనే ప్రయాణికుల పయనం జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల్లో ఇదే తంతు ఆత్మకూరు : సమయం వచ్చింది..! దోచుకున్న వారికి దోచుకున్నంత అన్న తీరున ఆర్టీసీలో సమ్మె పుణ్యమాని తాత్కాలిక కార్మికులుగా నమోదైన వారు చేతివాటం చూపుతున్న ఉదంతమిది. ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారంతో మూడో రోజుకు చేరింది. దీంతో పలు ఆర్టీసీ డిపోల్లో అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి బస్సులను నడిపేందుకు విశ్వప్రయత్నమే చేస్తున్నారు. దీంతో జిల్లాలోని నెల్లూరు 1, 2, ఆత్మకూరు, కావలి, రాపూరు, వెంకటగిరి, గూడూరు, సూళూరుపేట, వాకాడు, ఉదయగిరి డిపోల్లో మొత్తం 402 బస్సులను శుక్రవారం రోడ్డుపైకి పంపారు. రోజుకు డ్రైవర్‌కు రూ.1000, కండెక్టర్‌కు రూ.800 వంతున చెల్లించే ఒప్పందాలు కుదిరాయి. అన్ని యూనియన్లతో పాటు ఆర్టీసీ సూపర్వైజర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో రోడ్డుపై వెళ్లే బస్సుల్లో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. దీంతో తాత్కాలిక కార్మికులు రెచ్చిపోతున్నారు. శుక్రవారం ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తుండడంతో వీరి చేతివాటం మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకుంటూ మిగిలిన సొమ్ము స్వాహా చేస్తున్నారు. ప్రయాణం మధ్యలో ఎవరు ఎక్కడ ఎక్కినా దిగినా వారి నుంచి లెక్కాపక్కా లేకుండా నగదు వసూలు చేస్తున్నారు. ఆ లెక్కలేమి ఎస్‌ఆర్‌లోకి ఎక్కకపోవడం గమనార్హం. ఉదాహరణకు ఆత్మకూరు ఆర్టీసీ డిపోలో శుక్రవారం 57 బస్సులకు గాను 28 సర్వీసులు రోడ్డుపైకి వచ్చాయి. ఆత్మకూరు-నెల్లూరు వెళ్లే ప్రయాణికుల సంఖ్య మాత్రమే కొంతకు కొంత రికార్డుల్లోకి ఎక్కుతుంది. మధ్యలో ఉండే ఊళ్లలో ఎవరూ ఎక్కడ ఎక్కిన దిగినా అదంతా వసూలు చేసుకోవడం, గాంధీ లెక్కతో జమకడుతున్నారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఈ తంతు కొనసాగుతుందని ప్రయాణికులు బాహాటంగా చెబుతున్నారు. అసలే సమ్మెతో ఆర్టీసీ నష్టాల ఊబిలో కొనసాగుతుండగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఆర్టీసీకి రావాల్సిన ఆదాయానికి తాత్కాలిక కార్మికులు గండి కొట్టడం చర్చనీయాంశమైంది. తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లకు అంతంతమాత్రమే అనుభవం ఉండటంతో ఈ బస్సుల్లో ప్రయాణించే వారు అభద్రతతోనే ప్రయాణిస్తున్నారు. బస్సులపై నిఘా ఉంచుతాం : - దివ్య కామాక్షి, డీఎం, ఆత్మకూరు తాత్కాలిక కార్మికుల చేతివాటంపై నిఘా ఉంచుతాం. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రయాణికుల చార్జీల సొమ్ము స్వాహా కాకుండా చూస్తాం. మోటారు వాహనాల తనిఖీ అధికారి పరిశీలన అనంతరమే తాత్కాలిక డ్రైవర్ల నియామకాలు చేపడుతున్నాం. ఎంసెట్ విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ఆత్మకూరు డిపో నుంచి 48 బస్సు సర్వీసులను నడిపాం. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు ఒక్కొక్కటిగా చేపడుతున్నాం. -
కొత్తపల్లి అరెస్ట్‌తో ఉద్రిక్తత
నరసాపురం అర్బన్ :ఆర్టీసీ అధికారుల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును గురువారం పోలీసులు అరెస్టు చేయడంతో నరసాపురంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ విషయంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు మహాధర్నాలను నిర్వహించాలని నిర్ణరుుంచిన విషయం విదితమే. ఏలూరులో జరుగనున్న రైతు మహాధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం పన్నాగాలు పన్నింది. ఈ విషయం గురువారం నరసాపురంలో చోటు చేసుకున్న ఘటనతో రుజువైంది. మొదట మహాధర్నాకు, రైతులకు బస్సులు అద్దెకిస్తామని అంగీకరించిన స్థానిక ఆర్టీసీ అధికారులు చివరి నిమిషంలో అడ్డం తిరిగారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. ఇదేమి అన్యాయమని ఆర్టీసీ అధికారులను నిలదీసింది. ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగే రైతు మహాధర్నాకు బస్సులు కేటాయించాలని, ఆర్టీసీ నిబంధనల మేరకు ఒక్కో బస్సుకు ఎంత చార్జీ అవుతుందో, అంత మొత్తాన్ని వెంటనే చెల్లిస్తామని స్థానిక రైతు సంఘాల ప్రతినిధులు వారం రోజుల క్రితమే నరసాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్కుమార్కు విజ్ఞప్తి చేశారు. ఆయన మొదట అంగీకరించారు. గురువారం బస్సుల అద్దె నిమిత్తం సొమ్ము చెల్లించేందుకు రైతు సంఘాల ప్రతినిధులు వెళ్లగా తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించలేదని బస్సులు ఇవ్వలేమని పేర్కొన్నారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు గంటలపాటు కొత్తపల్లి ఆందోళన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్చార్జి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆర్టీసీ డిపోకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. రైతు మహాధర్నాకు బస్సులు అద్దెకిస్తామని తనకు కూడా చెప్పారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బస్సులు అద్దెకిచ్చేవరకు కదిలేది లేదని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్టాండ్‌లో ఆందోళన చేపట్టారు. డిపో మేనేజర్ క్యాంపులో ఉండడంతో అసిస్టెంట్ డిపో మేనేజర్ ప్రసాద్‌బాబు కొత్తపల్లి, ఇతర నాయకులతో మాట్లాడారు. అయితే బస్సులు ఇచ్చే వరకు కదిలేది లేదని వైఎస్సార్ సీపీ నాయకులు తెగేసి చెప్పారు. తమ సొంతానికి బస్సులు అడగడంలేదని అలాగని అధికార పార్టీ మాదిరిగా ఏ చార్జీ చెల్లించకుండా బస్సులు తీసుకెళతామని చెప్పడం లేదని కొత్తపల్లి అన్నారు. నిబంధనల మేరకు తగిన మొత్తాన్ని చెల్లిస్తే ఎవరికైనా బస్సులు అద్దెకిచ్చే సంప్రదాయం ఆర్టీసీలో ఉందని కేవలం వైఎస్సార్ సీపీ మహాధర్నా విషయంలో మాత్రమే ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బస్టాండ్‌లో కొత్తపల్లి ఆందోళన మొదలైంది. బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నరసాపురం, పాలకొల్లు సీఐలు సిబ్బందితో కలిసి బస్టాండ్‌కు చేరుకున్నారు. కొత్తపల్లిని ఆందోళన విరమించమని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. చట్ట ప్రకారం తాము బస్సులు అద్దెకడుగుతున్నామని తమ విజ్ఞప్తిని అంగీకరిస్తేనే ఆందోళన విరమిస్తామని పోలీసులతో వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. భారీగా రైతులు, కార్యకర్తలు రాక కొత్తపల్లి సుబ్బారాయుడు బస్టాండ్‌లో ఆందోళన చేస్తున్న విషయం నియోజకవర్గం నలుమూలలా వ్యాపించడంతో నరసాపురం, మొగల్తూరు మండలాల నుంచి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా రైతులు కూడా పట్టణానికి చేరుకున్నారు. కొత్తపల్లికి బాసటగా నిలిచి ఆందోళన కొనసాగించారు. చివరికి ఆర్టీసీ అధికారులు.. తమ సంస్థ ఎండీ నుంచి బస్సులు కేటాయించవద్దని ఆదేశాలు అందాయని తామేమీ చేయలేమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇన్చార్జి డీఎం సాయిచరణ్‌తేజ్ వెల్లడించారు. అయితే అదే విషయాన్ని తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కొత్తపల్లి పట్టుపట్టారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కార్యక్రమాలకు బస్సులు అద్దెకి వెళ్లాయని, మొన్న జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆర్టీసీ బస్సులు తరలించారు కదా అని ప్రశ్నించారు. చివరకు బస్సులు కేటాయించలేమని వైఎస్సార్ సీపీ నాయకులు ఇచ్చిన వినతి పత్రాన్ని ఆర్టీసీ అధికారులు తిరస్కరిస్తూ సంతకం పెట్టి ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆందోళన విరమించారు. పోలీసులు హైడ్రామా, బస్టాండ్ వద్ద ఉద్రిక్తత కొత్తపల్లి ఆందోళన విరమించి బయటకు వస్తుండడంతో ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని.. సహకరించాలని కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇతర నాయకులతో చెప్పడంతో వారు అవాక్కయ్యారు. ఆందోళన విరమించే సమయంలో అరెస్ట్ అంటూ డ్రామాలాడతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొత్తపల్లిని అరెస్ట్ చేస్తే వేలాది మందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చివరకు సహకరించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని అంగీకరించి కొత్తపల్లి బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్‌కు నడచుకుంటూ వెళ్లారు. కొత్తపల్లి అరెస్ట్ అయి వెళుతుండడంతో దారి పొడవునా స్థానిక వ్యాపారులు, ప్రజలు ఆయనకు సంఘీభావం తెలిపి వెంట నడిచారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద భారీ జనసందోహం కనిపించింది. చివరకు స్టేషన్ బెయిల్‌పై కొత్తపల్లిని విడుదల చేశారు. కొత్తపల్లి సుబ్బారాయుడితో పాటు పార్టీ నాయకులు పాలంకిప్రసాద్, మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినాథ్ ప్రసాద్ షేక్ బులిమస్తాన్, మావూరి సత్యనారాయణ, జిలా ్లలీగల్ సెల్ కన్వీనర్ కామన బుజ్జి, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు నల్లిమిల్లి జోసఫ్, దొంగ గోపి, మొగల్తూరు మండల కన్వీనర్ కర్రి ఏసు, కౌన్సిలర్లు వన్నెంరెడ్డి శ్రీనివాస్, గోరు సత్యనారాయణ, నల్ల కృష్ణంరాజు, పప్పులరామారావు, చెన్నా రమేష్, గుగ్గిలపు మురళి తదితరులు 21 మందిపై కేసు నమోదు చేసినట్టు నరసాపురం సీఐ భాస్కరరావు చెప్పారు. బ్రిటిష్ పాలనే నయం : కొత్తపల్లి చంద్రబాబు పాలన బ్రిటిష్ పాలనకంటే దారుణంగా తయారైందని కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. అరెస్ట్ అయి విడుదలైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో కష్టాలను ఎదుర్కొంటున్న రైతులు స్వచ్ఛందంగా మహాధర్నాకు తరలిరావాలని చూస్తున్నారన్నారు. ధర్నా విజయవంతం అయితే పరువు పోతుందని భావించిన ప్రభుత్వం ఇలాంటి చిల్లర వ్యవహారాలను చేస్తోందన్నారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు చాలా అనుభవం ఉందన్నారు. చట్టప్రకారం డబ్బులు చెల్లిస్తామంటే బస్సులు ఇవ్వబోమని ఆర్టీసీ నిరాకరించడం ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ శాఖల పనితీరు అధ్వానంగా తయారైందన్నారు. ముందుగా మేమడిగినప్పుడే బస్సులు ఇవ్వలేమని చెపితే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే వారమని అన్నారు. -
అక్రమ రూటు!
నంద్యాల : తిరుపతి ఆర్టీసీ అధికారులు పట్టీపట్టన ట్లు వ్యవహరించడం.. ఎర్రచందనం స్మగ్లర్ల ఉచ్చులో చిక్కి, కూలీలను తరలిస్తున్న డ్రైవర్లకు బాగా కలిసొచ్చింది. నంద్యాల, ఆళ్లగడ్డ డిపోల బస్సులు ప్రతిరోజూ రాత్రి ఏడు గంటల సమయంలో చెన్నై నుంచి బయల్దేరుతాయి. మార్గమధ్యలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుృతి బస్టాండ్‌కు చేరుకోవాలి. అయితే తిరుపతి బస్టాండ్‌లోకి వెళ్లకుండా ఈ బస్సుృ డ్రైవర్లు రేణిగుంట మీదుగా నేరుగా రాజంపేటకు వెళ్తున్నారు. ఏడాది కాలం నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోకి చెన్నై నుంచి రావాల్సిన నంద్యాల, ఆళ్లగడ్డ బస్సులు రాకపోయినా.. చార్టులో డ్రైవర్లు సంతకాలు చేయకపోయినా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎస్టీఐలు పట్టించుకోలేదు. ఎందుకు రావడంలేదో కనీసం ఆరా కూడా తీయలేదు. దీంతో డ్రైవర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఆర్టీసీ నిబంధనల మేరకు చెన్నై నుంచి నంద్యాలకు వచ్చే మార్గంలో తిరుపతి బస్టాండ్‌లోని చార్టులో వారు సంతకం చేయాల్సి ఉంది. అయితే ృక్క రోజు కూడా చార్టులో సంతకం చేయకపోవడంతో ఆర్టీసీ అధికారులకు అనుమానం రాకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేగాక ఈ బస్సులకు తిరుపతిలో గాని, చెన్నైలో గాని రిజర్వేషన్ సౌకర్యం కూడా లేదు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. వారే బస్సులో టిమ్ టికెట్లను ఇస్తారు. ఇది ఒక రకంగా డ్రైవర్లకు ఉపయోగపడిందని ఆర్టీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బుధవారం తిరుపతి రీజనల్ మేనేజర్ సంబంధిత రికార్డులను తెప్పించుకొని డ్రైవర్లు సంతకాలు చేస్తున్నారా.. లేదా అనే విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే. ఈ అప్రమత్తత ముందుగా ఉంటే డ్రైవర్ల అక్రమాలకు ముకుతాడు పడేది. కానీ బాధ్యులైన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వారి అక్రమాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఉచ్చులో మరి కొంత మంది డ్రైవర్లు? ఎర్రచందనం స్మగ్లర్లకు సహకారం అందించి పట్టుబడిన వారు తక్కువేనని.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకే కాక ఇతర డిపోలకు చెందిన డ్రైవర్లకు కూడా సంబంధాలు ఉన్నట్లు వారు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పట్టుబడిన నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన డ్రైవర్లను రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు. ఈ విచారణలో చెన్నైకి వెళ్లే ఇతర డిపోలకు చెందిన డ్రైవర్లు కూడా కూలీలకు సహకారం ఇస్తూ వచ్చారని వివరించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి రావడానికి కీలక పాత్ర పోషించిన నంద్యాల డిపోకు చెందిన సయ్యద్ అక్బర్‌హుసేన్ ద్వారా సీమ జిల్లాలకు చెందిన బస్సుల డ్రైవర్లు కూడా సహకారం అందించారని వివరించినట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ నిన్న పట్టుబడిన డ్రైవర్ల సంఖ్య స్వల్పమేనని వీరి బాటలోనే మరికొన్ని డిపోలకు చెందిన డ్రైవర్లు ఉన్నారని వారి కోసం విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. వీరిలో అప్పుడే కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. నల్లమల బస్సు సర్వీసులపై నిఘా.. ఎర్రచందనం స్మగ్లర్లతో కడప, చిత్తూరు, చెన్నై ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధాలు ఉన్నాయని తేలడంతో నల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లే ఆర్టీసీ బస్సులపై కూడా పోలీసులు, అటవీ శాఖ అధికారులు నిఘాను పెంచారు. మంగళవారం కడప ఎస్పీ నవీన్‌గులాటి ఆధ్వర్యంలో విచారణ జరిపి రాజంపేట, కుక్కలదొడ్డి, తదితర ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం వచ్చే కూలీలకు నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు సహకారం ఇస్తున్న విషయం రూడీ కావడంతో నల్లమలకు బస్సులు నడుపుతున్న ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన బస్సులపై బుధవారం నుంచి నిఘాను పెంచారు. మరోసారి డొల్లతనం బయట పడకుండా... ఏడాది కాలం నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన 11 మంది డ్రైవర్లు చెన్నై సర్వీసులకు వెళ్తూ అక్రమాలకు పాల్పడుతున్నా అటు స్క్వాడ్లు కాని, ఇటు వారి రికార్డులను పరిశీలించే అధికారులు కాని పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధమైన 11 మంది డ్రైవర్లతో పాటు వారి టికెట్ల రికార్డులను స్టేజీలను పరిశీలించే అధికారులపై కూడా చర్యలు తీసుకొనే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజంపేట కోర్టులో హాజరు.. కడపలో పట్టుబడిన 11 మంది ఆర్టీసీ డ్రైవర్లను బుధవారం రాజంపేట జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరచగా వారికి ఈనెల 16వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వారిని వెంటనే రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. -
రేపు జెడ్పీ చైర్మన్ ఎన్నిక
కండక్టర్ విధులను కూడా నిర్వర్తించడం ఆర్టీసీ డ్రైవర్లకు పెద్ద సమస్యగా మారింది. ఒకే సమయంలో డ్రైవింగ్‌తో పాటు టికెట్ల జారీపై దృష్టి పెట్టాల్సిరావడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. డ్రైవింగ్‌పై ఏ మాత్రం ఏకాగ్రత చెదిరినా ప్రమాదాలు జరిగే అవకావం ఉండడం, మరోవైపు నగదు వసూళ్లలో తేడా వ స్తే జేబుకి చిల్లుపడే అవకాశం ఉండడంతో అడకత్తెరలో పోక చెక్కలా మారారు. డ్రైవింగ్ విధులను డ్రైవర్, టికెట్ల జారీని కండక్టర్ మాత్రమే చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆర్టీసీ అధికారులు అమలు చేయకపోవడంపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. చైర్మన్ ఎన్నిక ఆదివారం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఎన్నికను సజావుగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఎలా జరుగుతుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 24 మంది సభ్యులతో జిల్లాపరిషత్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. మెజార్టీ సభ్యులు లేకున్నా టీడీపీ ఎలాగైనా జిల్లా పరిషత్ చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు పలురకాల కుట్రలకు పాల్పడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన పలువురు సభ్యులను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తోంది. కోట్లు గుమ్మరిస్తామంటూ టీడీపీ నేతలు ఆశ చూపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు, బెదిరించారు. వారిని సైతం ప్రలోభపెట్టారు. అయినా సరే కొం దరు మినహా మిగిలిన సభ్యులు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగలేదు. మాటపై నిలబడ్డారు. తమను గెలి పించిన పార్టీని ,నేతలను వదలమంటూ విశ్వాసం చూపారు. ప్రాణా లు పోయినా పార్టీ వెన్నంటే ఉంటామంటూ ప్రమాణాలు చేశారు. అయినా సరే అధికార బలంతో టీడీపీ దౌర్జన్యానికి దిగి నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రకే మాయని మచ్చ తెచ్చింది. జిల్లాపరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జిల్లాపరిషత్ సభా మందిరంలో దుశ్శాసన పర్వానికి తెరలేపింది. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ సాక్షాత్తు కలెక్టర్ శ్రీకాంత్ ముందున్న మైక్‌ను విసిరి పారేసి ఆయన్ను దుర్భాషలాడారు. అయినా సరే కలెక్టర్ నోరుమెదప లేదు. ‘నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు’ అన్నట్టు పోలీసులు చోద్యం చూస్తుండిపోయారు. ఈ ఘటన రాష్ట్ర స్థాయిలో జిల్లా పరువు తీసింది. అధికార పార్టీ దౌర్జన్యాలను చూసి జనం అసహ్యించుకుంటున్నా టీడీపీ నేతలు మాత్రం అక్రమాలను ఆపలేదు. వైఎస్సార్సీపీ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నానికి దిగారు. అయినా సరే మెజార్టీ సభ్యులతో జిల్లాపరిషత్ చైర్మన్ గిరిని దక్కించుకుంటామని వైఎస్సార్సీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అందరి సహకాంతో విజయం ఖాయమంటున్నారు. ఎన్నికల కమిషన్, హైకోర్టు జోక్యంతో అధికార పార్టీ ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది. గతంలో మాదిరి అధికారం అడ్డుపెట్టి ఎన్నికను అడ్డుకోవడం వీలుకాక పోవ చ్చని వారు భావిస్తున్నారని సమాచారం. ఈ సారైనా పోలీసులు ఎన్నికల కమిషన్,హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికను సజావుగా నిర్వహిస్తారా లేక మళ్లీ అధికార పార్టీ నేతలకు తొత్తులగా వ్యవహ రిస్తారా అన్నది ఆదివారం తేలుతుంది. -
ఆర్.. రాదు టీ.. తెలియదు సీ.. చెప్పలేం
కడప అర్బన్, న్యూస్‌లైన్: సురక్షితంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణమే శ్రేయస్కరం అంటూ ఆర్టీసీ అధికారులు ప్రకటనలు గుప్పిస్తుంటారు. కానీ, ఆచరణలోకొచ్చేసరికి ఆర్టీసీ తీరు అధ్వానంగా ఉంది. ఎప్పుడు ఏ బస్సు బయలుదేరుతుందో.. ఎప్పుడు ఏ బస్సు ఆగిపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సరై సమాధానం చెప్పే నాథుడు కూడా కరువయ్యాడు. దీంతో ప్రయాణికులకు అవ స్థలు తప్పడ ం లేదు. ఏపీఎస్ ఆర్టీసీ కడప రీజియన్ పరిధిలో ఎనిమిది డిపోలు ఉన్నాయి. రీజినల్ వ్యాప్తంగా దాదాపు 895 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. జిల్లాలో దాదాపు 40 వేల మంది ఆర్టీసీ సేవలను పొందుతున్నారు. తద్వారా 60 నుంచి 70 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. అయితే మరో వైపు ప్రైవేటు బస్సులు ఆర్టీసీ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రధాన పట్టణాల నుంచి పలు నగరాలకు ప్రైవేటు బస్సులు ఆర్టీసీకి పోటీగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీపై ప్రజలకు పూర్తిస్థాయి విశ్వాసం పెంపొందించి మరింత మెరుగైన సేవలందించాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉంది. కానీ అధికారుల తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆర్టీసీలో టిక్కెట్ రిజర్వు చేసుకుంటే తీరా బస్సు బయలుదేరాల్సిన సమయంలో ఆ బస్సును రద్దు చేసి ప్రయాణిలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత నెల 29 నుంచి ఈనెల7వ తేదీ వరకు దాదాపు 10 సర్వీసులను రద్దు చేశారంటే ఆర్టీసీ అధికారుల అంకితభావం ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది. బస్సు సర్వీసుల రద్దుతో ఆర్టీసీకి వేలాది రూపాయల నష్టంతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత వారం రోజులుగా కడప ఆర్టీసీ డిపో నుంచి రద్దయిన సర్వీసు వివరాలు ఇలా ఉన్నాయి. గతనెల 30వ తేదీన కడప-బెంగళూరు ఇంద్ర సర్వీసు రాత్రి 11.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కానీ, అప్పటికప్పుడు రద్దు చేయడంతో 40 మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. అంతేగాక ఆర్టీసీకి రూ. 15 వేల నష్టం వాటిల్లింది. ఈనెల 5వ తేదీ ఒకేరోజు నాలుగు సర్వీసులు రద్దయ్యాయి. కడప-హైదరాబాద్( కూకట్పల్లి) రాత్రి 9.00 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అప్పటికప్పుడు రద్దు చేశారు. ప్రయాణికులు లబోదిబోమన్నారు. అదేరోజు 7.00 గంటలకు బయలుదేరాల్సిన కడప-హైదరాబాద్ డీలక్స్ బస్సు 8.00 గంటలకు బయలుదేరుతుందని తెలిపిన అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు. అదేరోజు కడప-బెంగళూరు సూపర్‌లగ్జరీ బస్సును కూడా అలాగే రద్దు చేశారు. ఈనెల 1వ తేదీన కడప-బెంగళూరు సర్వీసు రాత్రి 11 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అర్ధరాత్రి వరకు స్టాండులోకి రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేశారు. విజయవాడకు ఇటీవల రెండవ ఇంద్ర బస్సును ప్రారంభించారు. ఆ బస్సు రాత్రి 10.15 గంటలకు బయలుదేరాల్సి ఉండగా ఆ బస్సును కూడా ఈనెల 2వ తేదీ రద్దు చేశారు. ఈనెల 7వ తేదీ రాత్రి విజయవాడకు సర్వీసులు అధికంగా వేయాలని భావిం చిన ఆర్టీసీ అధికారులు 7 గంటలకు హైదరాబాదుకు వెళ్లాల్సిన డీలక్స్ బస్సును విజయవాడకు మళ్లించారు. ఎట్టకేలకు ఆ సర్వీసును రద్దు చేశారు. అలాగే రాయచోటి నుంచి విజయవాడకు స్పెషల్ సర్వీసు కోసం రూ. 540 ఛార్జిగా వసూలు చేస్తే . కడప నుంచి విజయవాడకు రూ. 564 వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీకి మచ్చ తెచ్చిన సంఘటన లు.. ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు బ్రీత్ ఎనలైజర్ ద్వారా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు కడప రీజియన్‌లో 40 మంది డ్రైవర్లు, ఇతర సిబ్బంది బ్రీత్ ఎనలైజర్‌కు పట్టుబడటంతో తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. ఓ మహిళా కండక్టర్‌పై కాంట్రాక్టు డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. మహిళా ఉద్యోగి పట్ల ఓ కండక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆ సంఘటన పోలీసుస్టేషన్ వరకు చేరుకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిన్నచౌకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిమ్ యంత్రాలు పనిచేయనప్పుడు ప్రత్యామ్నాయంగా మనీ రిసిప్ట్ బుక్స్ (ఎంఆర్ బుక్స్) ద్వారా ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి, ఆ డబ్బులను సంబంధిత డిపోలో జమ చేయాల్సి ఉంది. కొంతమంది ఉద్యోగులు హస్తలాఘవం ప్రదర్శించడంతో దాదాపు రూ. 10 లక్షలు విలువజేసే ఎంఆర్ బుక్స్ లెక్కలు గల్లంతయ్యాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. టిక్కెట్లకు సంబంధించిన ట్రే బాక్సులు గల్లంతవుతున్నాయి. వాటిని ఎవరు తీసుకుంటున్నారు? ఈ వ్యవహారంలో ఉద్యోగుల హస్తం ఏ మేరకు ఉందనేది తేలాల్సి ఉంది. ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం వివరణ కడప రీజినల్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ప్రభాకర్‌రెడ్డిని బస్సు సర్వీసుల రద్దు వ్యవహారంపై ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, ఇంద్ర సర్వీసును ఏసీ పనిచేయకపోతే ఒకసారి రద్దు చేశామన్నారు. ప్రయాణికుల డబ్బు వెనక్కి ఇచ్చామన్నారు. సర్వీసు సమయానికి 12 గంటల ముందుగా ప్రయాణికులకు సమాచారం ఇస్తామన్నారు. ఈనెల 7వ తేదీ ఐదు గంటలకు హైదరాబాదుకు బయలుదేరాల్సిన డీలక్స్ బస్సును రిజర్వేషన్ తక్కువగా ఉండడంతో విజయవాడ వైపు మళ్లించామన్నారు. సర్వీసు రద్దు వ్యవహారం తమ దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్టీసీ నిలువు దోపిడీ
‘‘అవసరాన్ని అవకాశంగా మార్చుకోవడంలో ఆర్టీసీకి తెలిసినంతగా ఎవరికీ తెలియనట్లుంది... పరీక్ష రాసే అభ్యర్థులది అవసరం... ఆర్టీసీ వారిది అవకాశం..ఇంకేముంది ఆర్డినరీ (పల్లెవెలుగు) బస్సుల్లోనూ ఎక్స్‌ప్రెస్ చార్జీ ముక్కుపిండి వసూలు చేశారు. ఆ బస్సుల్లో ఎక్కిన పాపానికి సాధారణ ప్రయాణికుల జేబులకూ చిల్లు తప్పలేదు. మంచితరుణం మించిన దొరకదన్నట్లుగా స్క్రాబ్‌తో మూలనపడేయాల్సిన బస్సులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి అందినంత పిండుకున్నారు’’ నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష రాసే అభ్యర్థుల కోసం ఆదివారం రోజువారీ బస్సులేకాకుండా అదనంగా బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు ప్రకటిస్తే...అందరూ అబ్బో ప్రయాణికులమీద ఎంతప్రేమో అనుకున్నారు. కానీ తీరా బస్సెక్కాక తెలిసింది ప్రత్యేక బస్సుల పరమార్థం. గ్రామరెవెన్యూ సిబ్బంది పరీక్షకు జిల్లావ్యాప్తంగా దాదాపు 77వేల మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో అనేకమందికి వారి ప్రాంతంలో కాకుండా ఆ మూలన ఉన్నవారికి ఈ మూలన, ఇక్కడి వారికి అక్కడ అన్నట్లుగా పరీక్షా కేంద్రాలను కేటాయించడం ఆర్టీసీకి కలిసొచ్చింది. పల్లెవెలుగు బస్సులకే ఎక్స్‌ప్రెస్ బోర్డులు తగిలించి ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేశారు. రోడ్డెక్కే అర్హతలేని, స్క్రాబ్‌గా వర్క్‌షాప్‌కు వెళ్లాల్సిన బస్సులకూ పనిచెప్పారు. ఎక్స్‌ప్రెస్‌లుగా నిర్ణీత కిలోమీటర్లు ప్రయాణించిన బస్సులకు రంగులుమార్చి ఆర్డీనరిగా తిప్పుతున్నారు. వాటిని కూడ అదనపు బస్సులుగా నడిపి ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేశారు. అనేక డొక్కు బస్సులు, రణ, గొణధ్వనులతో బస్సెక్కిన వారి సహనాన్ని పరీక్షిస్తూ ‘భారం’గా కదిలాయి. పరీక్ష రాసే అభ్యర్థులతో పాటు వారి సహాయకులుగా వెంట వచ్చిన వారికి, ఇతర ప్రయాణికులకూ ఈ అదనపు వడ్డింపు తప్పలేదు. వేగంలోగానీ, సౌకర్యంలో గానీ, స్టేజీవద్ద నిలపడంలో గానీ తేడా లేకపోయినా ఎక్స్ప్రెస్చార్జీలను వసూలు చేశారు. జిల్లాకొచ్చిన సిటీబస్సులు.. రాజధానిలో తిరిగే సిటీబస్సులు ఆదివారం జిల్లాలో తిరిగాయి. కోచింగ్‌ల కోసం వెళ్లిన వారు, హైదరాబాద్‌లో ఉన్నవారి కోసం భువనగిరికి 6, సూర్యాపేటకు 4, నల్లగొండకు 3 సిటీబస్సులు నడిపారు. 124 అదనపు ట్రిప్పులు ఆర్టీసీ వారు జిల్లాలో రోజూ నడిపే ట్రిప్పులకు అదనంగా ఆదివారం వీఆర్వో, వీఆర్ఏ అభ్యర్థుల కోసం 124 ట్రిప్పులు నడిపారు. దేవరకొండ డిపోలో 13, నల్లగొండ-25, నార్కట్‌పల్లి-9, యాదగిరిగుట్ట-18, కోదాడ-15, మిర్యాలగూడ-24, సూర్యాపేట-20 ట్రిప్పులను అదనంగా నడిపారు. ఇంతకుముందు డెరైక్టు బస్సులు లేని యాదగిరిగుట్ట-సూర్యాపేట, యాదగిరిగుట్ట-కోదాడ ల మధ్యకూడా బస్సులను నడిపారు. నల్లగొండ రీజియన్‌లో రోజూవారీ సగటు ఆదాయం రూ.68లక్షలుంటుంది. కానీ సంక్రాంతి పండగ తర్వాత రూ.62 నుంచి రూ.63 లక్షలకు మించడం లేదు. కానీ ఆదివారం నాడు రూ.75లక్షల దాకా ఆదాయం రావచ్చునని భాస్తున్నారు. ప్రైవేటు వాహనాలకూ గిరాకీ... సమాయనుకూలంగా బస్సులకోసం వేచిచూడటం ఇష్టంలేనివారు, ఎలాగూ బస్సుల్లో ఎక్కడ చార్జీలు వసూలు చేస్తున్నారనే కారణంతోనూ పలువురు అభ్యర్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. పది, పదిహేను మంది కలిసి సుమో, ట్రాక్స్, తుపాన్ లాంటి వాహనాలను అద్దెకు తీసుకోని నేరుగా పరీక్షా కేంద్రాల వరకు చేరుకున్నారు. దాంతో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. కిటకిట లాడిన బస్స్టేషన్లు, హోటళ్లు... ఆర్టీసీ బస్స్టేషన్లు, హోటళ్లు కిటకిటలాడాయి. ప్రధా న పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యతలెత్తింది. భోజనం, టీ, టిఫిన్ హోటళ్లు, బేకరీలు జనంతో నిండిపోయాయి. నాన్‌స్టాప్ ఫేర్ వసూలు చేశాం : బి.రవీందర్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అదనపు బస్సులు నడిపినపుడు ప్రయాణికులు ఒకవైపే వెళ్తారు. తిరుగు ప్రయాణంలో పెద్దగా ఉండరు. అందుకని చార్జీని ఒకటిన్నర రెట్లు వసూలు చేస్తాం. కానీ అభ్యర్థుల కోసం సాధారణ చార్జీలే వసూలు చేయమన్నాం. నాన్‌స్టాప్‌గా వెళ్తున్నపుడు ఎక్స్‌ప్రెస్ చార్జీ వసూలు చేసి ఉంటారు. సూర్యాపేట నుంచి నల్లగొండకు వెళ్లే బస్సుల్లో ఇచ్చిన టికెట్ ఇది. ఏపి28జడ్ 2469 నంబర్‌గల ఈ ఆర్డీనరీ (పల్లెవెలుగు) బస్సుకు ఎక్స్‌ప్రెస్ చార్జీతో పాటు, టోల్గేట్ చార్జీ, ఎక్స్‌ప్రెస్, సెస్సుకూడా (మొత్తం రూ.49) వసూలు చేశారు. సాధారణంగా ఆర్డినరీ బస్సుకు రూ.33తో పాటు టోల్‌చార్జ్ రూ.4, సెస్సు రూపాయి మొత్తం రూ.38 వసూలు చేస్తారు. కానీ బోర్డు మార్చి ఎక్స్‌ప్రెస్ చార్జ్ వసూలు చేశారు. ఈ బస్సు ఎక్స్‌ప్రెస్‌గా నిర్ణీత కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం పల్లెవెలుగుగా మార్చడం కొసమెరుపు. -
స్టీరింగ్.. టిమ్.. ఓ డ్రైవర్
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : పొదుపు పేరుతో ఆర్టీసీ అధికారులు అమలులోకి తెస్తున్న సంస్కరణలు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చేలా ఉన్నాయి. డ్రైవర్లకే కండక్టర్ విధులు అప్పగిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది డ్రైవర్ల ఏకాగ్రతపై తీవ్రప్రభావం చూపి ప్రమాదాలకు దారితీస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఓ చేత్తో బస్సు స్టీరింగ్ మరో చేత్తో టికెట్ ఇష్యూయింగ్ మెషిన్(టిమ్)తో విధులు సాగిస్తున్న డ్రైవర్లను చూసి బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. ఆర్టీసీ నెల్లూరు రీజియన్ పరిధిలో 862 బస్సులు ఉన్నాయి. వీటిలో సుమారు 100 బస్సులను టిమ్‌తో డ్రైవర్‌కు అప్పగిస్తున్నారు. ఒకే వ్యక్తి రెండు విధులు నిర్వర్తించడం డ్రైవర్‌కు భారంగా మారడంతో పాటు ఆ ప్రభావం ప్రయాణికులపైనా పడుతోంది. బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ఆందోళనగా గడపాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నగదు తీసుకోవడం, టికెట్లు ఇవ్వడం, చిల్లర చెల్లించే పనులతో డ్రైవర్ బస్సును పలుచోట్ల ఆపేస్తుండటంతో ప్రయాణ సమయంలోనూ ఆలస్యమవుతోంది. ఏకధాటిగా ఒకే డ్రైవర్‌తో.. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో టిమ్ విధానం అమలు చేయడంతో పాటు సింగిల్ డ్రైవర్‌ను పంపుతుండటంతో ప్రయాణికులు హడలిపోతున్నారు. నెల్లూరు నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరిన బస్సు ఉదయం 5 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. 8 గంటల పాటు ఒకే డ్రైవర్ ఏకధాటిగా బస్సును నడపడంతో పాటు టికెట్లు కొట్టాల్సిన పరిస్థితి. రానూపోనూ 9 గంటలు పట్టే చెన్నై బస్సుల్లోనూ ఇదే పరిస్థితి. నెల్లూరు-విజయవాడ, నెల్లూరు- తిరుమల బస్సుల్లోనూ టిమ్‌తో ఒకే డ్రైవర్‌ను పంపుతున్నారు. ఆయన ఏమాత్రం రెప్పవాల్చినా బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టే. దూరప్రాంత బస్సుల్లో ఇద్దరు డ్రైవ ర్లను తప్పనిసరిగా నియమించాలనే నిబంధనను ఆర్టీసీ అధికారులు పక్కన పెట్టేశారు. ఏకాగ్రతపై ప్రభావం బస్సు డ్రైవర్ ఏకాగ్రతతో విధులు నిర్వర్తిస్తేనే ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చవచ్చు. ఆయన ఏకాగ్రత ఏమాత్రం దెబ్బతిన్నా అది ప్రయాణికుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే టిమ్ విధానం డ్రైవర్‌పై శారీరక, మానసిక ఒత్తిడి పెంచుతోంది. టికెట్ జారీ, నగదు వసూలు, స్టేజీల వివరాలు, అధిక నగదు ఇలా ఏ చిన్న పొరపాటు దొర్లినా స్క్వాడ్ అధికారుల వేధింపులు, కేసులకు గురికావాల్సిందే. ఈ క్రమంలో డ్రైవర్ ఏకాగ్రత కోల్పోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని నెల్లూరు రీజియన్ పరిధిలోని డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల నాలుగు రోజుల పాటు గూడూరు డిపో కార్మికులు విధులను బహిష్కరించి బస్సులను అడ్డుకున్నారు. చివరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. భద్రతకు ప్రాధాన్యమివ్వాలి ఎస్కే మహబు, రీజనల్ అధ్యక్షుడు, ఈయూ సింగిల్ డ్రైవర్‌కే కండక్టర్ విధులు అప్పగించడం ప్రయాణికుల భద్రతపై ప్రభావం చూపుతుంది. డ్రైవర్ ఏకాగ్రతకు భంగం కలిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీపై నమ్మకంతో బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికునికి సురక్షితమైన ప్రయాణం అందించాల్సిన బాధ్యత సంస్థ, సిబ్బందిపై ఉంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి - డీబీ శామ్యూల్, రీజనల్ కార్యదర్శి, ఈయూ సంస్థ నష్టాల్లో ఉంటే ఇతర మార్గాల్లో లాభాన్వేషణ చేయాలి. ప్రత్యామ్నాయ మార్గాల్లో పొదుపు పాటించాలి. సింగిల్ డ్రైవర్‌తో కండక్టర్ విధులు కూడా చేయించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడకూడదు.