ఆర్.. రాదు టీ.. తెలియదు సీ.. చెప్పలేం
కడప అర్బన్, న్యూస్‌లైన్: సురక్షితంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణమే శ్రేయస్కరం అంటూ ఆర్టీసీ అధికారులు ప్రకటనలు గుప్పిస్తుంటారు. కానీ, ఆచరణలోకొచ్చేసరికి ఆర్టీసీ తీరు అధ్వానంగా ఉంది. ఎప్పుడు ఏ బస్సు బయలుదేరుతుందో.. ఎప్పుడు ఏ బస్సు ఆగిపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సరై సమాధానం చెప్పే నాథుడు కూడా కరువయ్యాడు. దీంతో ప్రయాణికులకు అవ స్థలు తప్పడ ం లేదు. ఏపీఎస్ ఆర్టీసీ కడప రీజియన్ పరిధిలో ఎనిమిది డిపోలు ఉన్నాయి. రీజినల్ వ్యాప్తంగా దాదాపు 895 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి.
జిల్లాలో దాదాపు 40 వేల మంది ఆర్టీసీ సేవలను పొందుతున్నారు. తద్వారా 60 నుంచి 70 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. అయితే మరో వైపు ప్రైవేటు బస్సులు ఆర్టీసీ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రధాన పట్టణాల నుంచి పలు నగరాలకు ప్రైవేటు బస్సులు ఆర్టీసీకి పోటీగా నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీపై ప్రజలకు పూర్తిస్థాయి విశ్వాసం పెంపొందించి మరింత మెరుగైన సేవలందించాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉంది. కానీ అధికారుల తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.
ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఆర్టీసీలో టిక్కెట్ రిజర్వు చేసుకుంటే తీరా బస్సు బయలుదేరాల్సిన సమయంలో ఆ బస్సును రద్దు చేసి ప్రయాణిలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత నెల 29 నుంచి ఈనెల7వ తేదీ వరకు దాదాపు 10 సర్వీసులను రద్దు చేశారంటే ఆర్టీసీ అధికారుల అంకితభావం ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది. బస్సు సర్వీసుల రద్దుతో ఆర్టీసీకి వేలాది రూపాయల నష్టంతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత వారం రోజులుగా కడప ఆర్టీసీ డిపో నుంచి రద్దయిన సర్వీసు వివరాలు ఇలా ఉన్నాయి.
గతనెల 30వ తేదీన కడప-బెంగళూరు ఇంద్ర సర్వీసు రాత్రి 11.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కానీ, అప్పటికప్పుడు రద్దు చేయడంతో 40 మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. అంతేగాక ఆర్టీసీకి రూ. 15 వేల నష్టం వాటిల్లింది.
ఈనెల 5వ తేదీ ఒకేరోజు నాలుగు సర్వీసులు రద్దయ్యాయి. కడప-హైదరాబాద్( కూకట్‌పల్లి) రాత్రి 9.00 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అప్పటికప్పుడు రద్దు చేశారు. ప్రయాణికులు లబోదిబోమన్నారు. అదేరోజు 7.00 గంటలకు బయలుదేరాల్సిన కడప-హైదరాబాద్ డీలక్స్ బస్సు 8.00 గంటలకు బయలుదేరుతుందని తెలిపిన అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు. అదేరోజు కడప-బెంగళూరు సూపర్‌లగ్జరీ బస్సును కూడా అలాగే రద్దు చేశారు.
ఈనెల 1వ తేదీన కడప-బెంగళూరు సర్వీసు రాత్రి 11 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అర్ధరాత్రి వరకు స్టాండులోకి రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేశారు.
విజయవాడకు ఇటీవల రెండవ ఇంద్ర బస్సును ప్రారంభించారు. ఆ బస్సు రాత్రి 10.15 గంటలకు బయలుదేరాల్సి ఉండగా ఆ బస్సును కూడా ఈనెల 2వ తేదీ రద్దు చేశారు. ఈనెల 7వ తేదీ రాత్రి విజయవాడకు సర్వీసులు అధికంగా వేయాలని భావిం చిన ఆర్టీసీ అధికారులు 7 గంటలకు హైదరాబాదుకు వెళ్లాల్సిన డీలక్స్ బస్సును విజయవాడకు మళ్లించారు. ఎట్టకేలకు ఆ సర్వీసును రద్దు చేశారు.
అలాగే రాయచోటి నుంచి విజయవాడకు స్పెషల్ సర్వీసు కోసం రూ. 540 ఛార్జిగా వసూలు చేస్తే . కడప నుంచి విజయవాడకు రూ. 564 వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీకి మచ్చ తెచ్చిన సంఘటన లు..
ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు బ్రీత్ ఎనలైజర్ ద్వారా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు కడప రీజియన్‌లో 40 మంది డ్రైవర్లు, ఇతర సిబ్బంది బ్రీత్ ఎనలైజర్‌కు పట్టుబడటంతో తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.
ఓ మహిళా కండక్టర్‌పై కాంట్రాక్టు డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. మహిళా ఉద్యోగి పట్ల ఓ కండక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడడంతో ఆ సంఘటన పోలీసుస్టేషన్ వరకు చేరుకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిన్నచౌకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టిమ్ యంత్రాలు పనిచేయనప్పుడు ప్రత్యామ్నాయంగా మనీ రిసిప్ట్ బుక్స్ (ఎంఆర్ బుక్స్) ద్వారా ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసి, ఆ డబ్బులను సంబంధిత డిపోలో జమ చేయాల్సి ఉంది. కొంతమంది ఉద్యోగులు హస్తలాఘవం ప్రదర్శించడంతో దాదాపు రూ. 10 లక్షలు విలువజేసే ఎంఆర్ బుక్స్ లెక్కలు గల్లంతయ్యాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు.
టిక్కెట్లకు సంబంధించిన ట్రే బాక్సులు గల్లంతవుతున్నాయి. వాటిని ఎవరు తీసుకుంటున్నారు? ఈ వ్యవహారంలో ఉద్యోగుల హస్తం ఏ మేరకు ఉందనేది తేలాల్సి ఉంది.
ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం వివరణ
కడప రీజినల్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ప్రభాకర్‌రెడ్డిని బస్సు సర్వీసుల రద్దు వ్యవహారంపై ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, ఇంద్ర సర్వీసును ఏసీ పనిచేయకపోతే ఒకసారి రద్దు చేశామన్నారు. ప్రయాణికుల డబ్బు వెనక్కి ఇచ్చామన్నారు. సర్వీసు సమయానికి 12 గంటల ముందుగా ప్రయాణికులకు సమాచారం ఇస్తామన్నారు. ఈనెల 7వ తేదీ ఐదు గంటలకు హైదరాబాదుకు బయలుదేరాల్సిన డీలక్స్ బస్సును రిజర్వేషన్ తక్కువగా ఉండడంతో విజయవాడ వైపు మళ్లించామన్నారు. సర్వీసు రద్దు వ్యవహారం తమ దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.