అధికారుల నిర్లక్ష్యం.. ప్రాణాలతో చెలగాటం
కానగూడూరు (దువ్వూరు): జాతీయ రహదారి నిర్వహణ అధికారుల నిర్లక్ష్యం పలువురు ప్రయాణికుల పాలిట శాపంగా పరిణమించింది. గురువారం ఉదయం దువ్వూరు మండల పరిధిలోని కానగూడూరు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై కడప నుంచి చాగలమర్రి వరకు ఎలాంటి సైడ్ బారికేడ్లు లేవు. అలాగే సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, బస్ షెల్టర్ సైడ్ వాల్ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
తిరుపతి నుంచి కర్నూలుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడేందుకు జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. కర్నూలు డిపోకు చెందిన ఏపీ 21 జెడ్ 0474 నంబర్‌గల సూపర్ డీలక్స్ బస్సు రాత్రి 1 గంటకు తిరుపతి నుంచి బయల్దేరింది. కానగూడూరు వద్ద ఉదయం 6.10 గంటలకు బస్సు అదుపుతప్పి జాతీయ రహదారిపై నుంచి కింద ఉన్న అప్రోచ్ రోడ్డుపై బోల్తాపడింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని 108 వాహనంలో చాగలమర్రిలోని కేరళ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంలో జీవిత ఖైదీ ఎరుకల పెద్దసుంకన్నను కర్నూలుకు తీసుకెళుతున్న ఏఆర్‌హెచ్‌సీ ఉప్పర వెంకటేశ్వర్లు, ఏఆర్‌పీసీలు సి.దాసు, వై.శోభన్‌బాబు, విష్ణువర్దన్‌రెడ్డి, వల్లూరుకు చెందిన కానిస్టేబుల్ కె. ఆనంద్‌లు గాయపడ్డారు.
అలాగే బస్సులోఉన్న ప్రయాణికులు విష్ణుకుమార్‌రెడ్డి, నాగశెట్టి ప్రియ, చిలుమూరు బాలిరెడ్డి, ఎ.నాగార్జునరెడ్డి, జి.ఆనంద్‌రెడ్డి, షేక్ ఇమాంబి, కల్లు పవన్, నాగేంద్రబాబు, టంగుటూరు వెంకటేశ్వర్లు కూడా గాయపడిన వారిలో ఉన్నారు. విష్ణుకుమార్‌రెడ్డి, నాగశెట్టి ప్రియ, పెద్దసుంకన్నలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్టీఓ అబ్దుల్ రవూఫ్, ఎంవీఐ వాసుదేవరెడ్డి, సీఐ హనుమంతనాయక్, ఎస్‌ఐ విద్యాసాగర్ పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.