సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ మొండిపట్టు వీడింది. వజ్ర మినీ బస్సులను బస్టాండ్లలోకి అనుమతించాలని నిర్ణయించింది. ఇంతకాలం ముఖ్యమంత్రి ఆదేశం పేరుతో వాటిని బస్టాండ్లకు అనుమతించకుండా కాలనీల మీదుగా నేరుగా గమ్యస్థానం వెళ్లేలా ప్రణాళిక అమలు చేశారు. కానీ, ప్రయాణికులు లేక ఖాళీగా అవి ఉరుకులు పరుగులు పెడుతూ భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. దీంతో వాటిని కూడా సాధారణ బస్సుల్లాగా బస్టాండ్ల మీదుగా తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ప్రయోగాత్మకంగా తొలుత హైదరాబాద్–నిజామాబాద్ మధ్య తిరుగుతున్న వజ్ర బస్సుల్లో, మెహిదీపట్నం, హైదరాబాద్–2 డిపో పరిధిలో ఉన్న బస్సులను సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్, అటు నిజామాబాద్ బస్టాండ్లలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం మొదలుపెట్టిన నాలుగు రోజుల్లోనే వాటి ఆక్యుపెన్సీరేషియో పెరిగింది. వాస్తవాన్ని గుర్తించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పుడు మిగతా బస్సులను కూడా బస్టాండ్లలోకి అనుమతించాలని భావిస్తున్నారు.
సీఎం వద్దన్నారని...
సాధారణ ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు బస్టాండ్లకు వెళ్లి ఎక్కటం పరిపాటి. ఆ శ్రమ లేకుండా బస్సులే కాలనీలకు వస్తే సమీపంలోనే వాటిల్లో ఎక్కేందుకు అవకాశం ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ మేరకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను గత సంవత్సరం ఆదేశించారు. దీంతో వజ్ర ఏసీ మినీ బస్సులను ఆర్టీసీ ఐదు నెలల క్రితం ప్రారంభించింది. ఇందులో కండక్టర్ ఉండరు, డ్రైవర్ టిమ్ యంత్రం ద్వారా టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. ప్రయాణికులు నేరుగా యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని నిర్ధారిత ప్రాంతంలో ఎక్కాల్సి ఉంటుంది. నగదురహిత లావాదేవీని ప్రోత్సహించినట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆర్టీసీ దీనికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్– నిజామాబాద్ మధ్య వీటిని ప్రారంభించింది.
కానీ యాప్‌పై అవగాహన తక్కువ మందికి ఉండటంతో తొలిరోజు నుంచి ఇవి ఖాళీగా పరుగుపెట్టడం మొదలైంది. నెల తర్వాత రెండు చోట్ల ప్రైవేటు ఏజెన్సీలు టికెట్ ఇచ్చేలా నిబంధన మార్చారు. తర్వాత డ్రైవరే టికెట్ ఇచ్చే వెసులుబాటు తెచ్చారు. మరో నెల తర్వాత ప్రధాన బస్టాండ్ల సమీపంలో ఆగేవిధంగా నిబంధన మార్చారు. ఎంత చేసినా ఆక్యుపెన్సీ రేషియో 35 శాతాన్ని మించలేదు. నిబంధన మారిస్తే ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురవ్వాల్సిఉంటుందన్న భయంతో అధికారులు నష్టాన్ని భరిస్తూ వచ్చారు. కానీ, పరిస్థితి చేజారిపోతుండటంతో నిర్ణయం మార్చుకున్నారు. మెహిదీపట్నం, హైదరాబాద్–2 డిపో పరిధిలోని బస్సులు 4 రోజులుగా జూబ్లీబస్టాండ్, నిజామాబాద్ బస్టాండ్లలోకి వెళ్తున్నాయి. దీంతో ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి చేరుకుంది. వీటి టికెట్ ధరలు తగ్గిస్తే ఇవి కూడా సాధారణ బస్సుల్లాగా కిక్కిరిసి తిరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్ మార్గంలో తిరుగుతున్న బస్సులను కూడా బస్టాండ్లకు అనుమతిస్తే ఆక్యుపెన్సీ శాతం 60 శాతానికి చేరుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలో అధికారులు ఆ నిర్ణయం కూడా తీసుకుంటారని తెలుస్తోంది.
బస్టాండ్లలోకి ‘వజ్ర’ బస్సులు
Published Sun, Nov 12 2017 3:23 AM | Last Updated on Sun, Nov 12 2017 3:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment