సాక్షి, హైదరాబాద్: అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందాన ఉంది ఆర్టీసీ వజ్ర ఏసీ బస్సుల పరిస్థితి. పొట్టి బస్సులుగా పిలిచే ఈ వంద బస్సులు కొన్నప్పటి నుంచి ప్రయాణికుల ఆదరణ చూరగొనలేక ఆర్టీసీని తీవ్ర నష్టాల పాల్జేయడం తెలిసిందే. దీంతో విసుగొచ్చి వాటిని వదిలించుకునేందుకు గత ఏడాది వేలం వేసి విక్రయించాలని నిర్ణయించారు. అప్పటి ఎండీ సునీల్‌శర్మ ఆమోదంతో అధికారులు 60 బస్సులను వేలానికి ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు.
ఎలా నడపాలి?
మరో 40 బస్సులు 2 లక్షల కిలోమీటర్ల లోపు మాత్రమే తిరిగాయి. ఇవి మంచి కండిషన్‌లో ఉండటంతో వాటిని వేలంలో అమ్మటం సరికాదని తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీసుకున్న నిర్ణయం అధికారుల్ని అయోమయానికి గురి చేస్తోంది. కొన్నప్పటి నుంచి సమస్యలు వేధిస్తుండటం, ఏ రకంగానూ అనుకూలంగా లేని ఈ బస్సుల్ని ఎలా తిప్పాలోనని భావిస్తున్నారు. ఎండీ సజ్జనార్ ఆదేశం మేరకు వాటిని తిరిగి నగరంలో వినియోగించాలని నిర్ణయించి కొన్ని డిపోలకు అప్పగించారు.
♦ఈ బస్సుల్లో 18 సీట్లే ఉంటాయి. ఇంత చిన్న బస్సులకు ఓ డ్రైవరు, కండక్టర్.. ఇలా రెండు షిఫ్టుల్లో నలుగురిని నియమిస్తే.. వాటితో వచ్చే ఆదాయం కనీసం ఇద్దరి జీతాలకు కూడా సరిపోదు. కేవలం టిమ్ యంత్రం ద్వారా డ్రైవరే టికెట్లు ఇచ్చే పద్ధతికే ఇవి సరిపోతాయి. కానీ సిటీలో కండక్టర్ లేకుండా డ్రైవర్ ఒక్కడితో బస్సు నడపటం సాధ్యం కాదు. దీంతో స్టేజీ క్యారియర్‌గా అది పనికి రాదని తేల్చేశారు.
♦నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు నడపాలని భావించారు. కానీ, ఇంజిన్ వరకు ఈ బస్సు కండిషన్‌లో ఉన్నా.. ఏసీ విషయంలో తయారీనే నాసికరంగా ఉంది. సాధారణంగా ఛాసిస్‌కే ఏసీ బిగించేలా ఉంటుంది. కానీ ఈ బస్సుల్లో ఛాసిస్‌తో సంబంధం లేకుండా అది తయారైన తర్వాత ఏసీని విడిగా ఫ్యాబ్రికేట్ చేశారు. దీంతో చిన్న తేడా వచ్చినా ఏసీ ఆగిపోతోంది. ఇవి ఏసీ బస్సులు అయినందున ఏసీ లేకుండా నడపటం కష్టం. కిటికీలు తెరుచుకునే అవకాశం ఉండనందున గాలి లేక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతారు. దూర ప్రాంతాలకు ఏసీ సమస్యతో తిప్పలేక అది కూడా కుదరదని తేల్చేశారు.
♦ఇక నగరంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అద్దెకివ్వాలని నిర్ణయించి.. పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతినే అవలంబిస్తున్నాయి. అతి తక్కువ మంది సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు దీంతో కంపెనీలు ఆ ప్రతిపాదనకు సానుకూలంగా లేవు. వర్క్ ఫ్రం హోం పద్ధతిని తొలగించే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
♦ఇక మిగిలిన అవకాశం.. పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలు, యాత్రలకు అద్దెకివ్వటం. దీంతో వాటి బుకింగ్ కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల పెళ్లి ఆర్డర్లు కొంత మెరుగ్గానే వస్తున్నాయి. ఇక యాత్రలకు వీలుగా తాత్కాలికంగా ఏసీ సమస్య లేకుండా చేసి అద్దెకిచ్చే యోచనలో ఉన్నారు. వెరసి అడ్డగోలు ధరకు వేలంలో అమ్మలేక.. ఉంచుకుని లాభాలు తెచ్చుకునేలా నడుపుకోలేక వజ్ర బస్సులతో ఆర్టీసీ అధికారులు తంటాలు పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment