ఆర్టీసీలో అన్ని సేవలకూ ఒకే యాప్ | Single app for all services in RTC | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో అన్ని సేవలకూ ఒకే యాప్

Published Sun, Mar 7 2021 5:24 AM | Last Updated on Sun, Mar 7 2021 5:24 AM

Single app for all services in RTC - Sakshi

సాక్షి, అమరావతి: ప్రస్తుతం ఆర్టీసీలో టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలంటే ఓ వెబ్‌సైట్‌ను, బస్సు ఎక్కడుందో తెలుసుకోవడానికి అంటే.. ట్రాకింగ్‌కు మరో వెబ్‌సైట్‌ను, పాస్‌లు పొందడానికి, ఫిర్యాదులు చేయడానికి వేర్వేరు వెబ్‌సైట్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇలా వేర్వేరు వెబ్‌సైట్‌లకు వెళ్లకుండా ఇకపై అన్ని సేవలు ఒకే యాప్‌లో లభ్యం కానున్నాయి. ఇందుకోసం వినూత్నమైన రీతిలో యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌(యూటీఎస్‌) విధానాన్ని ఏపీఎస్‌ ఆర్టీసీ అమల్లోకి తీసుకొస్తోంది. ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెటింగ్‌ విధానంపై రూపొందిన ఈ సరికొత్త ప్రాజెక్టు త్వరలో ఆరంభం కానుంది. డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా ఆర్టీసీలోనూ ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇందుకోసం టెండర్లు పిలిచేందుకు ఆర్థిక అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 24న టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించారు. దీనికి ముందుగా ఈ నెల 8న ప్రీ బిడ్‌ సమావేశానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. టెండర్ల తర్వాత ఆన్‌లైన్‌లోనే రివర్స్‌ టెండర్లను ఆర్టీసీ నిర్వహించనుంది.  

టిక్కెట్‌ బుక్‌ చేసుకోవడం చాలా సులభం.. 
దేశంలో ఏ ఆర్టీసీ అమలు చేయని విధంగా ఏపీఎస్‌ఆర్టీసీ క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా ఆర్టీసీ టికెటింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అడాŠవ్‌న్స్‌ టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకుంటే ఇకపై డైనమిక్‌ క్యూ ఆర్‌ కోడ్‌ ప్రయాణికుడికి అందుతుంది. ఆ క్యూ ఆర్‌ కోడ్‌ను బస్సులో డ్రైవరు వద్ద ఉన్న ఈ–పోస్‌ (ఎల్రక్టానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) మిషన్‌కు చూపిస్తే చాలు.. ఎంచక్కా ప్రయాణించవచ్చు. అంతేకాదు.. యూటీఎస్‌ విధానంలో బస్సు బయలుదేరిన తర్వాత కూడా టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. దూర ప్రాంత సర్వీసైనా.. లేదా స్థానికంగా తిరిగే సర్వీసుల్లోనైనా.. టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు విజయవాడ నుంచి తిరుపతి వెళ్లే దూరప్రాంత సర్వీసుకు ఇప్పుడున్న విధానంలో బస్సు బయలుదేరితే టికెట్‌ బుక్‌ చేసుకోవడానికి కుదరదు. యూటీఎస్‌ విధానం అమల్లోకి వచ్చాక గుంటూరులో ఉండే ప్రయాణికుడు విజయవాడ నుంచి బయల్దేరే తిరుపతి సర్వీస్‌ బస్సుకు ఇంట్లో కూర్చుని సీటు బుక్‌ చేసుకోవచ్చు. బస్సు విజయవాడ నుంచి గుంటూరు వచ్చేలోపు బుక్‌ చేయవచ్చు. రియల్‌ టైం సమాచారం యూటీఎస్‌ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఇదే కాదు.. నాన్‌స్టాప్‌ బస్సుల్లో సైతం అవి బయల్దేరాక కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు విజయవాడ నుంచి ఏలూరు వెళ్లే నాన్‌స్టాప్‌ బస్సుకు రామవరప్పాడులో ఉండి.. సీట్లున్నాయో లేవో తెలుసుకుని బుక్‌ చేయవచ్చు. 

ఆన్‌లైన్‌లో అందుబాటులోకి 20 లక్షల సీట్ల బుకింగ్‌ 
ఆర్టీసీలో రోజూ 60 లక్షల సీట్ల వరకు అందుబాటులో ఉంటాయి. వీటిలో 1.40 లక్షల సీట్లకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ సౌకర్యం ఉంది. ఈ సీట్ల సంఖ్యకు 15 రెట్లు అంటే దాదాపు 20 లక్షల సీట్లకు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసేలా అవకాశం కల్పించనున్నారు. పల్లెవెలుగు బస్సుల నుంచి హై ఎండ్‌ టెక్నాలజీ బస్సులకు ఈ విధానం అమలవుతుంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను కలిపి ఈ ప్రాజెక్టు అమలు చేస్తారు. ఈ ప్రాజెక్టులో క్లౌడ్‌ బేస్డ్‌ టెక్నాలజీ వినియోగించనున్నారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ను ప్రోత్సహించేందుకు యూటీఎస్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 39 శాతం మేరకే ఆన్‌లైన్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ శాతాన్ని ఇంకా పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.    

యూటీఎస్‌ విధానం అంటే...  
రియల్‌ టైంలో బస్సు ఎక్కడుందో.. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. బస్సులో టిమ్‌ మిషన్లకు బదులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ–పోస్‌ మిషన్లలో టికెట్లను జారీ చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏ ఆర్టీసీ బస్సులో ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో.. ప్రధాన కార్యాలయంలో నుంచి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. డ్రైవరు ఈ–పోస్‌ మిషన్‌లో నమోదు చేసే వివరాలు సెంట్రల్‌ సర్వర్‌కు ఎప్పటికప్పుడు వెళతాయి. అక్కడ్నుంచి యాప్‌లో ప్రయాణికుడు తెలుసుకోవచ్చు. ప్రస్తుతమున్న విధానంలో డిపోకు టిమ్‌ మిషన్‌ తీసుకువచ్చాకనే టికెట్ల అమ్మకం వివరాలు తెలుస్తాయి. 

సీఎం సూచనలతో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు అమలు 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతో యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ ప్రాజెక్టును అమలు చేయనున్నాం. అత్యంత పారదర్శకంగా టికెట్‌ విధానం ఉంటుంది. ఆర్టీసీ మొత్తం 47 రకాల పాస్‌లు జారీ చేస్తుంది. వికలాంగులు, విద్యార్థులు, ఎన్జీవోలకు.. ఇలా అన్ని కేటగిరీల వారికి పాస్‌లు అందిస్తున్నాం. పాస్‌లు పొందాలన్నా.. టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకోవాలన్నా.. ఫిర్యాదులు చేయాలన్నా.. వేర్వేరు వెబ్‌సైట్లకు వెళ్లకుండా ఒకే యాప్‌ త్వరలో అందుబాటులోకి వస్తుంది. డిజిటల్‌ పేమెంట్లు ప్రోత్సహించే విధంగా రాబోయే కాలంలో మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి.     
– ఆర్పీ ఠాకూర్, ఆర్టీసీ ఎండీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement