ఐటీ కారిడార్‌లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే? | TSRTC AC Minibus Services in Hyderabad IT Corridors: Route, Timings Details | Sakshi
Sakshi News home page

Hyderabad: ఐటీ కారిడార్‌లలో వజ్ర పరుగులు.. రూట్‌, టైమింగ్స్‌ ఇవే

Published Mon, Mar 21 2022 1:57 PM | Last Updated on Mon, Mar 21 2022 6:19 PM

TSRTC AC Minibus Services in Hyderabad IT Corridors: Route, Timings Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వజ్ర ఏసీ బస్సులు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. గతంలో హైదరాబాద్‌ నుంచి వరంగల్, నిజామాబాద్‌ తదితర దూర ప్రాంతాలకు నడిచిన ఈ బస్సులను నగరంలో నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్యాబ్‌లకు ఎక్కువగా డిమాండ్‌ ఉండే హైటెక్‌ సిటీ, ఐటీ కారిడార్‌లలో వీటిని నడుపుతున్నారు. ఐటీ దిగ్గజ సంస్థల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఆయా సంస్థల నుంచి సమీపంలోని మెట్రో స్టేషన్‌లకు, ప్రధాన ప్రాంతాలకు చేరుకొనేలా ఇవి అందుబాటులో ఉంటాయి.
  
సుమారు 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు.. 
► సాధారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు సుమారు 1,500 బస్సులు ఐటీ పారిశ్రామిక ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 5 లక్షల మందికిపైగా ప్రయాణికులు నగరంలోని  పలు ప్రాంతాల నుంచి ఐటీ  కారిడార్‌లకు ప్రయాణం చేస్తారు. కోవిడ్‌ కారణంగా ఐటీ సంస్థలను మూసివేసి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ ప్రకటించడంతో ఈ మార్గంలో ప్రజా రవాణా కూడా స్తంభించింది. (క్లిక్: జూన్‌లో కరోనా కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం)

► కొంతకాలంగా కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఐటీ సంస్థల కార్యకలాపాలను పునరుద్ధరించారు. రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో క్యాబ్‌లు, ఆటోలు తదితర ప్రైవేట్‌ వాహనాల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ ప్రస్తుతం వజ్ర మినీ ఏసీ బస్సులను ఈ మార్గంలో నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.  

ప్రయాణికులకు అనుగుణంగా..
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మెట్రో, ఇతర మార్గాల్లో జేఎన్‌టీయూకు చేరుకొనే ప్రయాణికులు అక్కడి నుంచి వేవ్‌రాక్‌ వరకు వెళ్లేందుకు అనుగుణంగా వజ్ర బస్సులు ఉంటాయి. సైబర్‌టవర్స్, మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, డీఎల్‌ఎఫ్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ, అమెజాన్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని పలు ప్రాంతాలకు తక్కువ చార్జీలతో ప్రయాణం చేయవచ్చు. (క్లిక్: ఇకపై ఆ లైసెన్సుల జారీ కఠినతరం)

బస్సుల వేళలు.. 
జేఎన్‌టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు.. 
ఉదయం 8, 8.30, 9.50, 10.20, సాయంత్రం 4.25, 4.55, 6.15, 6.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయి.  

వేవ్‌రాక్‌ నుంచి జేఎన్‌టీయూ వరకు... 
ఉదయం 8.50, 9.20, సాయంత్రం 3.35, 4.05, 5.25, 5.55 గంటలకు బస్సులు బయలుదేరుతాయి.  

చార్జీలు
జేఎన్‌టీయూ నుంచి మైండ్‌స్పేస్‌కు రూ.20, జేఎన్‌టీయూ నుంచి వేవ్‌రాక్‌కు రూ.40, మైండ్‌స్పేస్‌ నుంచి వేవ్‌రాక్‌కు రూ.20. 

వీకెండ్‌లో సమతామూర్తి వద్దకు  సిటీబస్సులు 
ఓ నెటిజన్‌ విజ్ఞప్తికి స్పందించిన ఆర్టీసీ ఎండీ 

ముచ్చింతల్‌లోని కొలువైన సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్‌ సిటీ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌  అధికారులను ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని, క్యాబ్‌లో వెళ్లేందుకు రూ.1000 వరకు ఖర్చవుతుందని ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సజ్జనార్‌ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు’ అంటూ అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement