
సాక్షి, హైదరాబాద్: బస్సు సకాలంలో రాకపోవడంతో ఓ ప్రయాణికుడు ఎస్‌ఎంఎస్ ద్వారా రవాణా మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్టీసీ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. కరీంనగర్‌కు చెందిన శంకరయ్య, అతని కుమారుడు అరవింద్‌లు అహ్మదాబాద్ నుంచి ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఎయిర్‌పోర్టు నుంచి కరీంనగర్ వెళ్లాల్సిన బస్సులో ఆన్‌లైన్ ద్వారా వీరు టికెట్ బుక్ చేసుకున్నారు. ఉదయం పదిన్నరకు రావాల్సిన బస్సు కనిపించకపోవటంతో వారు ఎయిర్‌పోర్టులో ఉన్న ఆర్టీసీ కౌంటర్ వద్దకు వెళ్లారు.
ఆ సమయంలో కౌంటర్‌లో సిబ్బంది కూడా లేకపోవటంతో ఎస్‌ఎంఎస్ ద్వారా రవాణా శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే బస్సును ఏర్పాటు చేశారు. అయితే బస్సు సకాలంలో ఎందుకు రాలేదని, సిబ్బంది కౌంటర్‌లో ఎందుకు లేరని ప్రశ్నించిన మంత్రి ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.