కొత్తపల్లి అరెస్ట్‌తో ఉద్రిక్తత | RTC refuses buses for Maha Dharna, Kothapalli protests | Sakshi
Sakshi News home page

కొత్తపల్లి అరెస్ట్‌తో ఉద్రిక్తత

Published Fri, Dec 5 2014 1:11 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

కొత్తపల్లి అరెస్ట్‌తో ఉద్రిక్తత - Sakshi

కొత్తపల్లి అరెస్ట్‌తో ఉద్రిక్తత

 నరసాపురం అర్బన్ :ఆర్టీసీ అధికారుల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును గురువారం పోలీసులు అరెస్టు చేయడంతో నరసాపురంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ విషయంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు మహాధర్నాలను నిర్వహించాలని నిర్ణరుుంచిన విషయం విదితమే. ఏలూరులో జరుగనున్న రైతు మహాధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం పన్నాగాలు పన్నింది. ఈ విషయం గురువారం నరసాపురంలో చోటు చేసుకున్న ఘటనతో రుజువైంది. మొదట మహాధర్నాకు, రైతులకు బస్సులు అద్దెకిస్తామని అంగీకరించిన స్థానిక ఆర్టీసీ అధికారులు చివరి నిమిషంలో అడ్డం తిరిగారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 రైతులకు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. ఇదేమి అన్యాయమని ఆర్టీసీ అధికారులను నిలదీసింది. ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగే రైతు మహాధర్నాకు బస్సులు కేటాయించాలని, ఆర్టీసీ నిబంధనల మేరకు ఒక్కో బస్సుకు ఎంత చార్జీ అవుతుందో, అంత మొత్తాన్ని వెంటనే చెల్లిస్తామని స్థానిక రైతు సంఘాల ప్రతినిధులు వారం రోజుల క్రితమే నరసాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన మొదట అంగీకరించారు. గురువారం బస్సుల అద్దె నిమిత్తం సొమ్ము చెల్లించేందుకు రైతు సంఘాల ప్రతినిధులు వెళ్లగా తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించలేదని బస్సులు ఇవ్వలేమని పేర్కొన్నారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 నాలుగు గంటలపాటు కొత్తపల్లి ఆందోళన
 విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆర్టీసీ డిపోకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. రైతు మహాధర్నాకు బస్సులు అద్దెకిస్తామని తనకు కూడా చెప్పారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బస్సులు అద్దెకిచ్చేవరకు కదిలేది లేదని పార్టీ  నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్టాండ్‌లో ఆందోళన చేపట్టారు. డిపో మేనేజర్ క్యాంపులో ఉండడంతో అసిస్టెంట్ డిపో మేనేజర్ ప్రసాద్‌బాబు కొత్తపల్లి, ఇతర నాయకులతో మాట్లాడారు. అయితే బస్సులు ఇచ్చే వరకు కదిలేది లేదని వైఎస్సార్ సీపీ నాయకులు తెగేసి చెప్పారు.
 
 తమ సొంతానికి బస్సులు అడగడంలేదని అలాగని అధికార పార్టీ మాదిరిగా ఏ చార్జీ చెల్లించకుండా బస్సులు తీసుకెళతామని చెప్పడం లేదని కొత్తపల్లి అన్నారు. నిబంధనల మేరకు తగిన మొత్తాన్ని చెల్లిస్తే ఎవరికైనా బస్సులు అద్దెకిచ్చే సంప్రదాయం ఆర్టీసీలో ఉందని కేవలం వైఎస్సార్ సీపీ మహాధర్నా విషయంలో మాత్రమే ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బస్టాండ్‌లో కొత్తపల్లి ఆందోళన మొదలైంది. బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నరసాపురం, పాలకొల్లు సీఐలు సిబ్బందితో కలిసి బస్టాండ్‌కు చేరుకున్నారు. కొత్తపల్లిని ఆందోళన విరమించమని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. చట్ట ప్రకారం తాము బస్సులు అద్దెకడుగుతున్నామని తమ విజ్ఞప్తిని అంగీకరిస్తేనే ఆందోళన విరమిస్తామని పోలీసులతో వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు.
 
 భారీగా రైతులు, కార్యకర్తలు రాక
 కొత్తపల్లి సుబ్బారాయుడు బస్టాండ్‌లో ఆందోళన చేస్తున్న విషయం నియోజకవర్గం నలుమూలలా వ్యాపించడంతో నరసాపురం, మొగల్తూరు మండలాల నుంచి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా రైతులు కూడా పట్టణానికి చేరుకున్నారు. కొత్తపల్లికి బాసటగా నిలిచి ఆందోళన కొనసాగించారు. చివరికి ఆర్టీసీ అధికారులు.. తమ సంస్థ ఎండీ నుంచి బస్సులు కేటాయించవద్దని ఆదేశాలు అందాయని తామేమీ చేయలేమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇన్‌చార్జి డీఎం సాయిచరణ్‌తేజ్ వెల్లడించారు. అయితే అదే విషయాన్ని తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కొత్తపల్లి పట్టుపట్టారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కార్యక్రమాలకు బస్సులు అద్దెకి వెళ్లాయని, మొన్న జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆర్టీసీ బస్సులు తరలించారు కదా అని ప్రశ్నించారు. చివరకు బస్సులు కేటాయించలేమని వైఎస్సార్ సీపీ నాయకులు ఇచ్చిన వినతి పత్రాన్ని ఆర్టీసీ అధికారులు తిరస్కరిస్తూ సంతకం పెట్టి ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆందోళన విరమించారు.
 
 పోలీసులు హైడ్రామా, బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
 కొత్తపల్లి ఆందోళన విరమించి బయటకు వస్తుండడంతో ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని.. సహకరించాలని కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇతర నాయకులతో చెప్పడంతో వారు అవాక్కయ్యారు. ఆందోళన విరమించే సమయంలో అరెస్ట్ అంటూ డ్రామాలాడతారా అంటూ  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొత్తపల్లిని అరెస్ట్ చేస్తే వేలాది మందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చివరకు సహకరించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని అంగీకరించి కొత్తపల్లి బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్‌కు నడచుకుంటూ వెళ్లారు. కొత్తపల్లి అరెస్ట్ అయి వెళుతుండడంతో దారి పొడవునా స్థానిక వ్యాపారులు, ప్రజలు ఆయనకు సంఘీభావం తెలిపి వెంట నడిచారు.
 
 దీంతో పోలీస్ స్టేషన్ వద్ద భారీ జనసందోహం కనిపించింది. చివరకు  స్టేషన్ బెయిల్‌పై కొత్తపల్లిని విడుదల చేశారు. కొత్తపల్లి సుబ్బారాయుడితో పాటు పార్టీ నాయకులు పాలంకిప్రసాద్,  మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినాథ్ ప్రసాద్ షేక్ బులిమస్తాన్, మావూరి సత్యనారాయణ,  జిలా ్లలీగల్ సెల్ కన్వీనర్ కామన బుజ్జి, పార్టీ పట్టణ, మండల కన్వీనర్‌లు నల్లిమిల్లి జోసఫ్, దొంగ గోపి, మొగల్తూరు మండల కన్వీనర్ కర్రి ఏసు, కౌన్సిలర్లు వన్నెంరెడ్డి శ్రీనివాస్, గోరు సత్యనారాయణ, నల్ల కృష్ణంరాజు, పప్పులరామారావు, చెన్నా రమేష్, గుగ్గిలపు మురళి  తదితరులు 21 మందిపై  కేసు నమోదు చేసినట్టు నరసాపురం సీఐ భాస్కరరావు చెప్పారు.
 
 బ్రిటిష్ పాలనే నయం : కొత్తపల్లి
 చంద్రబాబు పాలన బ్రిటిష్ పాలనకంటే దారుణంగా తయారైందని కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. అరెస్ట్ అయి విడుదలైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో కష్టాలను ఎదుర్కొంటున్న రైతులు స్వచ్ఛందంగా మహాధర్నాకు తరలిరావాలని చూస్తున్నారన్నారు. ధర్నా విజయవంతం అయితే పరువు పోతుందని భావించిన ప్రభుత్వం ఇలాంటి చిల్లర వ్యవహారాలను చేస్తోందన్నారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు చాలా అనుభవం ఉందన్నారు. చట్టప్రకారం డబ్బులు చెల్లిస్తామంటే బస్సులు ఇవ్వబోమని ఆర్టీసీ నిరాకరించడం ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ శాఖల పనితీరు అధ్వానంగా తయారైందన్నారు. ముందుగా మేమడిగినప్పుడే బస్సులు ఇవ్వలేమని చెపితే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే వారమని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement