అక్రమ రూటు! | Root illegal! | Sakshi
Sakshi News home page

అక్రమ రూటు!

Published Thu, Dec 4 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

Root illegal!

నంద్యాల : తిరుపతి ఆర్టీసీ అధికారులు పట్టీపట్టన ట్లు వ్యవహరించడం.. ఎర్రచందనం స్మగ్లర్ల ఉచ్చులో చిక్కి, కూలీలను తరలిస్తున్న డ్రైవర్లకు బాగా కలిసొచ్చింది. నంద్యాల, ఆళ్లగడ్డ డిపోల బస్సులు ప్రతిరోజూ రాత్రి ఏడు గంటల సమయంలో చెన్నై నుంచి బయల్దేరుతాయి. మార్గమధ్యలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుృతి బస్టాండ్‌కు చేరుకోవాలి. అయితే తిరుపతి బస్టాండ్‌లోకి వెళ్లకుండా ఈ బస్సుృ డ్రైవర్లు రేణిగుంట మీదుగా నేరుగా రాజంపేటకు వెళ్తున్నారు. ఏడాది కాలం నుంచి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లోకి చెన్నై నుంచి రావాల్సిన నంద్యాల, ఆళ్లగడ్డ బస్సులు రాకపోయినా.. చార్టులో డ్రైవర్లు సంతకాలు చేయకపోయినా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌టీఐలు పట్టించుకోలేదు. ఎందుకు రావడంలేదో కనీసం ఆరా కూడా తీయలేదు.
 
  దీంతో డ్రైవర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఆర్టీసీ నిబంధనల మేరకు చెన్నై నుంచి నంద్యాలకు వచ్చే మార్గంలో తిరుపతి బస్టాండ్‌లోని చార్టులో వారు సంతకం చేయాల్సి ఉంది. అయితే ృక్క రోజు కూడా చార్టులో సంతకం చేయకపోవడంతో ఆర్టీసీ అధికారులకు అనుమానం రాకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేగాక ఈ బస్సులకు తిరుపతిలో గాని, చెన్నైలో గాని రిజర్వేషన్ సౌకర్యం కూడా లేదు. ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. వారే బస్సులో టిమ్ టికెట్లను ఇస్తారు.
 
  ఇది ఒక రకంగా డ్రైవర్లకు ఉపయోగపడిందని ఆర్టీసీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బుధవారం తిరుపతి రీజనల్ మేనేజర్ సంబంధిత రికార్డులను తెప్పించుకొని డ్రైవర్లు సంతకాలు చేస్తున్నారా.. లేదా అనే విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే. ఈ అప్రమత్తత ముందుగా ఉంటే డ్రైవర్ల అక్రమాలకు ముకుతాడు పడేది. కానీ బాధ్యులైన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వారి అక్రమాలు యథేచ్ఛగా కొనసాగాయి.
 
 ఉచ్చులో మరి కొంత మంది డ్రైవర్లు?
 ఎర్రచందనం స్మగ్లర్లకు సహకారం అందించి పట్టుబడిన వారు తక్కువేనని.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకే కాక ఇతర డిపోలకు చెందిన డ్రైవర్లకు కూడా సంబంధాలు ఉన్నట్లు వారు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పట్టుబడిన నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన డ్రైవర్లను రెండు రోజుల నుంచి విచారిస్తున్నారు. ఈ విచారణలో చెన్నైకి వెళ్లే ఇతర డిపోలకు చెందిన డ్రైవర్లు కూడా కూలీలకు సహకారం ఇస్తూ వచ్చారని వివరించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి రావడానికి కీలక పాత్ర పోషించిన నంద్యాల డిపోకు చెందిన సయ్యద్ అక్బర్‌హుసేన్ ద్వారా సీమ జిల్లాలకు చెందిన బస్సుల డ్రైవర్లు కూడా సహకారం అందించారని వివరించినట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ నిన్న పట్టుబడిన డ్రైవర్ల సంఖ్య స్వల్పమేనని వీరి బాటలోనే మరికొన్ని డిపోలకు చెందిన డ్రైవర్లు ఉన్నారని వారి కోసం విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. వీరిలో అప్పుడే కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది.
 
 నల్లమల బస్సు సర్వీసులపై నిఘా..
 ఎర్రచందనం స్మగ్లర్లతో కడప, చిత్తూరు, చెన్నై ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధాలు ఉన్నాయని తేలడంతో నల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లే ఆర్టీసీ బస్సులపై కూడా పోలీసులు, అటవీ శాఖ అధికారులు నిఘాను పెంచారు. మంగళవారం కడప ఎస్పీ నవీన్‌గులాటి ఆధ్వర్యంలో విచారణ జరిపి రాజంపేట, కుక్కలదొడ్డి, తదితర ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం వచ్చే కూలీలకు నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు సహకారం ఇస్తున్న విషయం రూడీ కావడంతో నల్లమలకు బస్సులు నడుపుతున్న ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన బస్సులపై బుధవారం నుంచి నిఘాను పెంచారు.
 
 మరోసారి డొల్లతనం బయట పడకుండా...
 ఏడాది కాలం నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన 11 మంది డ్రైవర్లు చెన్నై సర్వీసులకు వెళ్తూ అక్రమాలకు పాల్పడుతున్నా అటు స్క్వాడ్‌లు కాని, ఇటు వారి రికార్డులను పరిశీలించే అధికారులు కాని పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శాఖాపరమైన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధమైన 11 మంది డ్రైవర్లతో పాటు వారి టికెట్ల రికార్డులను స్టేజీలను పరిశీలించే అధికారులపై కూడా చర్యలు తీసుకొనే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.   
 
 రాజంపేట కోర్టులో హాజరు..
 కడపలో పట్టుబడిన 11 మంది ఆర్టీసీ డ్రైవర్లను బుధవారం రాజంపేట జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరచగా వారికి ఈనెల 16వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వారిని వెంటనే రాజంపేట సబ్‌జైలుకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement