నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : పొదుపు పేరుతో ఆర్టీసీ అధికారులు అమలులోకి తెస్తున్న సంస్కరణలు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చేలా ఉన్నాయి. డ్రైవర్లకే కండక్టర్ విధులు అప్పగిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది డ్రైవర్ల ఏకాగ్రతపై తీవ్రప్రభావం చూపి ప్రమాదాలకు దారితీస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఓ చేత్తో బస్సు స్టీరింగ్ మరో చేత్తో టికెట్ ఇష్యూయింగ్ మెషిన్(టిమ్)తో విధులు సాగిస్తున్న డ్రైవర్లను చూసి బస్సులు ఎక్కేందుకు ప్రయాణికులు జంకుతున్నారు.
ఆర్టీసీ నెల్లూరు రీజియన్ పరిధిలో 862 బస్సులు ఉన్నాయి. వీటిలో సుమారు 100 బస్సులను టిమ్‌తో డ్రైవర్‌కు అప్పగిస్తున్నారు. ఒకే వ్యక్తి రెండు విధులు నిర్వర్తించడం డ్రైవర్‌కు భారంగా మారడంతో పాటు ఆ ప్రభావం ప్రయాణికులపైనా పడుతోంది. బస్సు ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు ఆందోళనగా గడపాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నగదు తీసుకోవడం, టికెట్లు ఇవ్వడం, చిల్లర చెల్లించే పనులతో డ్రైవర్ బస్సును పలుచోట్ల ఆపేస్తుండటంతో ప్రయాణ సమయంలోనూ ఆలస్యమవుతోంది.
ఏకధాటిగా ఒకే డ్రైవర్‌తో..
దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో టిమ్ విధానం అమలు చేయడంతో పాటు సింగిల్ డ్రైవర్‌ను పంపుతుండటంతో ప్రయాణికులు హడలిపోతున్నారు. నెల్లూరు నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరిన బస్సు ఉదయం 5 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. 8 గంటల పాటు ఒకే డ్రైవర్ ఏకధాటిగా బస్సును నడపడంతో పాటు టికెట్లు కొట్టాల్సిన పరిస్థితి. రానూపోనూ 9 గంటలు పట్టే చెన్నై బస్సుల్లోనూ ఇదే పరిస్థితి. నెల్లూరు-విజయవాడ, నెల్లూరు- తిరుమల బస్సుల్లోనూ టిమ్‌తో ఒకే డ్రైవర్‌ను పంపుతున్నారు. ఆయన ఏమాత్రం రెప్పవాల్చినా బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టే. దూరప్రాంత బస్సుల్లో ఇద్దరు డ్రైవ ర్లను తప్పనిసరిగా
నియమించాలనే నిబంధనను ఆర్టీసీ అధికారులు పక్కన పెట్టేశారు.
ఏకాగ్రతపై ప్రభావం
బస్సు డ్రైవర్ ఏకాగ్రతతో విధులు నిర్వర్తిస్తేనే ప్రయాణికులను గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చవచ్చు. ఆయన ఏకాగ్రత ఏమాత్రం దెబ్బతిన్నా అది ప్రయాణికుల
భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే టిమ్ విధానం డ్రైవర్‌పై శారీరక, మానసిక ఒత్తిడి పెంచుతోంది. టికెట్ జారీ, నగదు వసూలు, స్టేజీల వివరాలు, అధిక నగదు ఇలా ఏ చిన్న పొరపాటు దొర్లినా స్క్వాడ్ అధికారుల వేధింపులు, కేసులకు గురికావాల్సిందే. ఈ క్రమంలో డ్రైవర్ ఏకాగ్రత కోల్పోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని నెల్లూరు రీజియన్ పరిధిలోని డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల నాలుగు రోజుల పాటు గూడూరు డిపో కార్మికులు విధులను బహిష్కరించి బస్సులను అడ్డుకున్నారు. చివరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు.
భద్రతకు ప్రాధాన్యమివ్వాలి ఎస్‌కే మహబు, రీజనల్ అధ్యక్షుడు, ఈయూ
సింగిల్ డ్రైవర్‌కే కండక్టర్ విధులు అప్పగించడం ప్రయాణికుల భద్రతపై ప్రభావం చూపుతుంది. డ్రైవర్ ఏకాగ్రతకు భంగం కలిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీపై నమ్మకంతో బస్సు ఎక్కిన ప్రతి ప్రయాణికునికి సురక్షితమైన ప్రయాణం అందించాల్సిన బాధ్యత సంస్థ, సిబ్బందిపై ఉంది.
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి
- డీబీ శామ్యూల్, రీజనల్ కార్యదర్శి, ఈయూ
సంస్థ నష్టాల్లో ఉంటే ఇతర మార్గాల్లో లాభాన్వేషణ చేయాలి. ప్రత్యామ్నాయ మార్గాల్లో పొదుపు పాటించాలి. సింగిల్ డ్రైవర్‌తో కండక్టర్ విధులు కూడా చేయించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడకూడదు.
స్టీరింగ్.. టిమ్.. ఓ డ్రైవర్
Published Fri, Jan 3 2014 3:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement