ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లింది.. ఆటోడ్రైవర్లు  | Two brothers are the main accused of RTC bus robbery case | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లింది.. ఆటోడ్రైవర్లు 

Published Sun, Apr 28 2019 2:24 AM | Last Updated on Sun, Apr 28 2019 2:24 AM

Two brothers are the main accused of RTC bus robbery case - Sakshi

బస్సు చోరీ వివరాలను మీడియాకు తెలుపుతున్న ఎం.రమేశ్‌. చిత్రంలో అంజనీకుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: గౌలిగూడ బస్టాండ్‌ నుంచి కుషాయిగూడకు చెందిన ఆర్టీసీ బస్సును ఎత్తుకుపోయింది అన్నదమ్ములైన ఆటోడ్రైవర్లుగా తేలింది. గతంలో పలు చోరీలు చేసిన ఈ ద్వయం తన సమీప బంధువు ఇచ్చిన ‘సలహా’తో ఈ బస్సు దొంగతనం చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించామని, 8మందిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శనివారం తెలిపారు. చోరీకి సంబంధించి ఆర్టీసీ అధికారుల నుంచి తమకు ఫిర్యాదు ఆలస్యంగా అందిందని చెప్పారు. తూర్పు మండల సంయుక్త పోలీసు కమిషనర్‌ ఎం.రమేశ్‌తో కలసి తన కార్యాలయంలో మీడియాకు ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.  

తీరు మార్చుకోమంటే పంథా మార్చుకుని... 
నగరంలోని చిలకలగూడకు చెందిన అన్నదమ్ములు సయ్యద్‌ అబేద్, సయ్యద్‌ జహీద్‌ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్లు. ఇలా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందక చోరీల బాటపట్టారు. అబేద్‌ ఒంటరిగా 2015 నుంచి 2018 వరకు గోపాలపురం, పంజగుట్ట, నల్లకుంట, ఎల్బీనగర్, మీర్‌చౌక్, మలక్‌పేటల్లో 9 చోరీలు చేశాడు. గత ఏడాది జహీద్‌ కూడా ఇతడికి తోడయ్యాడు. దీంతో ఇద్దరూ కలసి మలక్‌పేట, ఎల్బీనగర్, హయత్‌నగర్, మారేడ్‌పల్లి, మీర్‌పేట్, ఉప్పల్‌లో 7 నేరాలు చేశారు. ఇలా పదేపదే నేరాలు చేస్తూ జైలుకు వెళ్తున్న వీరిపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉండే సమీప బంధువు మహ్మద్‌ నవీద్‌ స్క్రాప్‌ వ్యాపారం చేస్తుంటారని, అక్కడకు వెళ్లి ఆయనతో కలసి పని చేసుకుని బతకాలని సూచించింది. దీంతో వారం  క్రితం వీరు నాందేడ్‌ వెళ్లి అతడిని కలిశారు. వాస్తవానికి ఓ మరమ్మతుల దుకాణంలో చేరాలని భావించారు. నవీద్‌ ఓ సందర్భంలో ఏవైనా పాత భారీ వాహనాలు ఉంటే తీసుకురావాలని, తాను ఖరీదు చేస్తానని వీరికి చెప్పాడు. దీనికి ఇద్దరూ అంగీకరించి రూ.లక్షకు ఒప్పందం చేసుకుని రూ.60 వేలు అడ్వాన్స్‌ తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి లారీ లేదా బస్సు చోరీ చేయాలని భావించారు. నవీద్‌కు నాందేడ్‌లో నేరచరిత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి.  

భారీ వాహనాలు నడపడంలో అబేద్‌ దిట్ట... 
దుబాయ్‌లో ఉండి వచ్చిన అబేద్‌ భారీ వాహనాలను వేగంగా నడపడంలో దిట్ట. బుధవారం నగరానికి చేరుకున్న వీరు భారీ వాహనం చోరీకి అనువైన ప్రాంతం కోసం వెతికారు. వీరు ఆటోడ్రైవర్లుగా గౌలిగూడ బస్టాండ్‌ పరిసరాల్లో ఎక్కువగా సంచరించారు. రాత్రివేళ అక్కడ బస్సులు ఆపి ఉంచడాన్ని వీరు గమనించారు. దీంతో నేరుగా అక్కడకు వెళ్లిన వీరు కుషాయిగూడ డిపోకు చెందిన 3డీ రూట్‌ బస్సును సెల్ఫ్‌స్టార్ట్‌తో స్టార్ట్‌ చేశారు. బస్సును ఎంట్రీ గేటు నుంచి రాత్రి 12 గంటలకు తీసుకుని బయటకు వచ్చారు. అక్కడ నుంచి తూప్రాన్, నిర్మల్, బోకరోల మీదుగా నాందేడ్‌ వెళ్లారు. బస్సు 2009 మోడల్‌ది కావడం, 480 కి.మీ. ఆపకుండా వేగంగా నడపడంతో నాందేడ్‌కు 35 కి.మీ. దూరంలో యాక్సిల్‌ రాడ్‌ విరిగిపోయింది. దీంతో ఓ క్రేన్‌ మాట్లాడుకుని నాందేడ్‌కు 10 కి.మీ. దూరంలోని తాత్కాలిక షెడ్‌కు చేరుకున్నారు.  

గ్యాస్‌ కట్టర్‌తో తుక్కుగా...
బస్సు చోరీకి సంబంధించి ఆర్టీసీ అధికారుల నుంచి పోలీసులకు ఫిర్యాదు ఆలస్యంగా అందింది. గురువారం ఉద యం 5.30 గంటలకు డ్రైవర్‌ జె.వెంకటేశం బస్సు చోరీ అయినట్లు గుర్తించారు. విష యం పోలీసులకు చేరే వరకు ఉదయం 10 గంటలైంది. అప్పటికే అబేద్, జహీ బస్సును తాత్కాలిక షెడ్‌కు తరలించేశారు. అక్కడ నవీద్, అతడి భాగస్వామి ఫారూఖ్‌ వద్ద పని చేసే గ్యాస్‌ కటింగ్‌ వర్కర్లు మహ్మద్‌ జుబేర్, మహ్మద్‌ ఒమర్, సయ్యద్‌ సల్మాన్, మహ్మద్‌ షఫీఖ్, మహ్మద్‌ కలీం సిద్ధంగా ఉన్నారు. గ్యాస్‌ కట్టర్లతో ఇంజన్, చాసిస్‌ మినహా మొత్తం తుక్కుగా మార్చేశారు. అఫ్జల్‌గంజ్‌ ఏసీపీ దేవేందర్‌ నేతృత్వంలోని బృందం సీసీ కెమెరాల ఫీడ్‌తో పాటు వివిధ మార్గాల్లో అన్వేషిస్తూ బస్సును తుక్కుగా మారుస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న ఫారూఖ్‌ మినహా 8 మందిని పట్టుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకోవడం మరికాస్త ఆలస్యమైనా బస్సు పూర్తిగా అదృశ్యమైపోయేదే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబేద్‌పై గతంలో మలక్‌పేట పోలీసులు పీడీ యాక్ట్‌ సైతం ప్రయోగించారు. ఈ బస్సు చోరీ నేపథ్యంలో గౌలిగూడ బస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ లోపాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని చక్కదిద్దడం కోసం సుల్తాన్‌బజార్‌ శాంతిభద్రతల విభాగం ఏసీపీ, ట్రాఫిక్‌ ఏసీపీ, సీఎస్‌డబ్ల్యూ అధికారులు, ఇంటెలిజెన్స్‌ విభాగం వారితో కూడిన బృందం శనివారం ఆ ప్రాంతంలో సెక్యూరిటి ఆడిట్‌ నిర్వహించింది. దీనిపై త్వరలో ఓ నివేదిక రూపొందించనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement