బుధవారం ఆటో నడుపుతూ అసెంబ్లీకి బయల్దేరిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.చిత్రంలో శంభీపూర్ రాజు, మాగంటి గోపీనాథ్,సుదీర్‌రెడ్డి తదితరులు
ఖాకీ చొక్కాలు ధరించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
‘అదానీ వ్యవహారంలో’ సీఎం వ్యాఖ్యలపై మెరుపు నిరసన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై రోజుకో రూపంలో నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం ఖాకీ చొక్కాలతో అసెంబ్లీకి వచ్చారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు ఉదయం 9.30కు చేరుకున్న నేతలు ఖాకీ చొక్కాలు ధరించి ఆటోల్లో అసెంబ్లీకి బయలుదేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బండారి లక్ష్మారెడ్డి స్వయంగా ఆటోలు నడిపారు.
మార్గంమధ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన వాహనాన్ని ఆపి నిరసన తీరు బాగుంది అంటూ వీడియో తీసుకున్నారు. కాగా బీఆర్‌ఎస్ జెండాలతో కూడిన ఆటోలతో పలువురు ఆటో కార్మికులు కేటీఆర్ నడుపుతున్న ఆటోను అనుసరిస్తూ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ప్రవేశ ద్వారం వద్ద ఆటోలను పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ సభకు వచ్చారు. అంతకుముందు ఆదర్శనగర్ క్వార్టర్స్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలేమయ్యాయి?
‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి జాబితాను గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వానికి ఇచ్చినా స్పందించడం లేదు. కాంగ్రెస్ ఇచి్చన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ కార్మిక విభాగం నేతలు ఆటో డ్రైవర్ల సమస్యలతో కూడిన జాబితాను కేటీఆర్‌కు అందజేశారు. ఇలావుండగా ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచి్చంది.
అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి
కాంగ్రెస్ చలో రాజ్‌భవన్ సందర్భంగా బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నిరసనకు దిగింది. సభ విరామ సమయంలో హరీశ్‌రావు నేతృత్వంలో లాబీలోని బీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అదానీ, రేవంత్‌రెడ్డి కలిసి ఉన్న ఫొటోలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ, అదానీ..సీఎం భాయ్..భాయ్’అంటూ నినదించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకుని, అదానీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
సభా హక్కుల ఉల్లంఘనపై చర్చకు అనుమతించండి
శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా.. మూసీ సుందరీకరణ అంశంపై సీఎం రేవంత్ తరఫున మంత్రి శ్రీధర్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం ఆరోపించింది. ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. మూసీ డీపీఆర్, ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం అంశంలో మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంది. శాసనమండలి నియమావళి 168 (ఏ) కింద సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుపై తామిచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి వినతిపత్రం సమరి్పంచింది.
Comments
Please login to add a commentAdd a comment