సభలో తీవ్ర ఉద్రిక్తత... గందరగోళం
‘ఫార్ములా–ఈ’రేసుపై ఏసీబీ కేసు మీద చర్చకు బీఆర్‌ఎస్ పట్టు
అంగీకరించని స్పీకర్.. భూ భారతి బిల్లుపై చర్చిద్దామని స్పష్టీకరణ
బీఆర్‌ఎస్ సభ్యులు, మార్షల్స్‌కు మధ్య తోపులాట
సభ వాయిదా పడి తిరిగి ప్రారంభమైనా కొనసాగిన ఆందోళన
స్పీకర్ పట్టించుకోక పోవడం, అధికార పక్షం స్పందించకపోవడంతో సభ నుంచి నిష్క్రమణ
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘ఫార్ములా–ఈ’రేసుపై ఏసీబీ కేసు మీద చర్చకు బీఆర్‌ఎస్ పట్టుబట్టడం, స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసనకు దిగడం, స్పీకర్ పోడియంను ముట్టడించే క్రమంలో వారికి మార్షల్స్‌కు మధ్య తోపులాట జరగడం, కాంగ్రెస్ సభ్యులు కూడా ఢీ అంటే ఢీ అన్నట్టు సిద్ధమవటంతో కొద్దిసేపు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమయ్యాక కూడా బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు.
తొలుత ఏసీబీ కేసుపై చర్చించాల్సిందే: హరీశ్‌రావు
శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే భూ భారతి బిల్లు పై చర్చను ప్రారంభించేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సిద్ధమయ్యారు. అయితే బీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు జోక్యం చేసుకుని ముందుగా ఫార్ములా–ఈ రేస్ విషయంలో ఏసీబీ కేసుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వెంటనే చర్చించలేని పక్షంలో ఎప్పుడు చర్చకు అనుమతిస్తారో ప్రకటించాలని కోరారు. ముందైతే భూ భారతి బిల్లుపై చర్చను కొనసాగిద్దామని, ఆ తర్వాత ఈ ఫార్ములా రేస్ అంశంపై చూద్దామని స్పీకర్ పేర్కొనగా.. హరీశ్‌రావు అభ్యంతరం చెప్పారు.
ఆ సభ్యుడికి అవకాశం ఇవ్వాలి కదా..
‘కేటీఆర్‌పై పెట్టింది అక్రమ కేసు కాకుంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ సభలో ఈ–కార్ రేసింగ్ అంశంపై చర్చించాలని కోరుతున్నా. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఓ సభ్యుడిపై అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా.. ఆయనకు చెప్పుకునే అవకాశం ఇస్తే ఆ కేసులో ఆయనది తప్పా, ఒప్పా అన్న విషయంలో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల గురించి, లగచర్ల అంశం గురించి ప్రశి్నస్తున్నాడు గనుకనే కేటీఆర్‌ను వేధించే క్రమంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టారు..’అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
భూ భారతి రాష్ట్రానికి సంబంధించిన అంశం: స్పీకర్
స్పీకర్ స్పందిస్తూ..‘శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సభలో లేరు. ఆయన వచ్చిన తర్వాత మీ వినతిపై నిర్ణయం తీసుకుంటాం. ముందైతే భూ భారతి మీద చర్చను కొనసాగిద్దాం..’అని అన్నారు. అయినా హరీశ్‌రావు, ఇతర బీఆర్‌ఎస్ సభ్యులు ముందు వరసలోకి వచ్చి ఫార్ములా–ఈ రేసుపై చర్చకు పట్టుబట్టారు. దీంతో ‘భూ భారతి రాష్ట్రానికి సంబంధించిన అంశం. మీరు అడుగుతోంది ఓ సభ్యుడికి సంబంధించింది.
ముందు భూ భారతిపై చర్చ జరుపుదాం..’అని స్పీకర్ మరోసారి కోరారు. కానీ బీఆర్‌ఎస్ సభ్యులు పట్టువీడలేదు. కాంగ్రెస్ సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి లేచి, ఈ–కార్ రేసింగ్‌పై విచారణకు గవర్నర్ అనుమతిచ్చాక, ఏసీబీ కేసు పెట్టిన తర్వాత శాసనసభలో దానిపై చర్చించే అంశమే ఉత్పన్నం కాదని, ప్రజల్లో ఓ అయోమయాన్ని సృష్టించేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. అనంతరం భూ భారతి బిల్లుపై స్పీకర్ చర్చ ప్రారంభించారు.
స్పీకర్‌పైకి ప్లకార్డు ముక్కలు, కాగితాలు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చను ప్రారంభిస్తూ.. భూ భారతి చట్టం తేవాలనుకోవటానికి గల కారణాలను వివరించటం ప్రారంభించారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లోకి వచ్చి, ఈ–కార్ రేస్‌పై పెట్టిన కేసు కక్షపూరితమైందని పేర్కొనే ప్లకార్డులు పట్టుకుని నినాదాలివ్వటం ప్రా రంభించారు. తర్వాత స్పీకర్ పోడియం దగ్గర గుమిగూడారు. మార్షల్స్‌ను తోసుకుంటూ పోడియంను ముట్టడించారు.
ఈ క్రమంలో మార్షల్స్‌కు, బీఆర్‌ఎస్ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. ఇంతలో మరికొందరు మార్షల్స్ అక్కడికి చేరుకుని బీఆర్‌ఎస్ సభ్యులను పోడియంకు దూరంగా నెట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్ సభ్యుడు కౌశిక్‌రెడ్డి తన చేతిలోనే ప్లకార్డును ముక్కలు చేసి స్పీకర్‌పైకి విసిరారు. మరికొందరు సభ్యులు, అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన కాగితాలను పోడియం పైకి విసిరారు. బీఆర్‌ఎస్ సభ్యుడొకరు మంత్రి పొంగులేటి వైపు దూసుకు రావడంతో కొందరు కాంగ్రెస్ సభ్యులు ఆయనకు రక్షణగా నిలబడ్డారు.
బీఆర్‌ఎస్ సభ్యులపైకి కాగితాలు
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సభ్యులు కొందరు ముందు వరసలోకి వచ్చి కాగితాలను బీఆర్‌ఎస్ సభ్యులపైకి విసిరారు. పరిస్థితి చేయిదాటేలా ఉండటంతో స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. స్పీకర్ చాంబర్‌లో దీనిపై కాంగ్రెస్ సభ్యులు ఆయనతో చర్చించారు. 35 నిమిషాల తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా.. మంత్రి పొంగులేటి ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఆయన మాట్లాడుతున్నంత సేపు బీఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లో నినాదాలిస్తూ నిరసన తెలుపుతూనే ఉన్నారు.
చర్చకు సహకరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరినా బీఆర్‌ఎస్ సభ్యులు పట్టువీడలేదు. చర్చలో భాగంగా బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చిన స్పీకర్, ఆ పార్టీ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డిని మాట్లాడాల్సిందిగా సూచించినా.. ఆయన నిరసనలోనే ఉండి మాట్లాడ్డానికి రాలేదు. దీంతో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. అయినా బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. దీంతో చాంబర్‌కు వస్తే మాట్లాడదామని వారికి చెప్పిన స్పీకర్ సభను వాయిదా వేశారు.
మధ్యాహ్నం తర్వాతా కొనసాగిన ఆందోళన
మధ్యాహ్నం తర్వాత సభ ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ముందుకు దూసుకువస్తుండడంతో మహిళా మార్షల్స్‌ను వారికి అడ్డుగా నిలబెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ గందరగోళంలోనే మహేశ్వర్‌రెడ్డి భూభారతి బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. అప్పుడు కూడా బీఆర్‌ఎస్ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు.
మహేశ్వర్‌రెడ్డి, ఆ తర్వాత మంత్రి పొంగులేటి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌లు మాట్లాడుతున్నంత సేపు నినాదాలు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు నిరసన కొనసాగించినా స్పీకర్ పట్టించుకోక పోవడం, అధికార పక్షం స్పందించకపోవడం, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక వ్యక్తి కోసం తాపత్రయపడుతున్నారంటూ వ్యాఖ్యానించడంతో సభ నుంచి ని్రష్కమించారు. ఆ సమయంలో మాట్లాడుతున్న అక్బరుద్దీన్..‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయి వెళ్లిపోతున్నారు.’అని వ్యాఖ్యానించారు.
మండలిలో వాయిదాల పర్వం
శాసనమండలిలో శుక్రవారం వాయిదాల పర్వం కొనసాగింది. శుక్రవారం ఉదయం మండలి ప్రారంభం కాగానే ఫార్ములా ఈ–రేస్ విషయంలో ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మధుసుదనాచారి, సత్యవతి రాథోడ్, కవిత, వాణీదేవి తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ ముందుకు సాగనీయకుండా అడ్డుకున్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎదుటకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో చైర్మన్ స్వల్ప విరామం ఇస్తూ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభం కాగా.. బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ భోజన విరామం కోసం వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పుడు కూడా అదే వాతావరణం నెలకొనడంతో శనివారం ఉదయానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment