మేమెప్పుడూ ప్రజా పక్షమే | BRS MLA KTR in the assembly | Sakshi
Sakshi News home page

మేమెప్పుడూ ప్రజా పక్షమే

Published Thu, Jul 25 2024 4:17 AM | Last Updated on Thu, Jul 25 2024 4:17 AM

BRS MLA KTR in the assembly

రాష్ట్ర విశాల ప్రయోజనాలే బీఆర్‌ఎస్‌కు పరమావధి

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ హక్కులను కాలరాశారు

పదేళ్ల పాటు మేం చెప్పిందే.. ఇప్పుడు కాంగ్రెస్‌ చెబుతోంది

రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ వైఖరి ఇలానే ఉంది

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వంతో కలిసి వస్తాం.. నిలబడతాం

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ హక్కులు కాలరాశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ‘ఒక రాష్ట్రానికి చేయూత అందించి మరో రాష్ట్రానికి చేయి ఇవ్వడం హక్కులను కాలరాయడమే. ఆంధ్రకు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ మనకు ఇవ్వకపోవడమే బాధ కలిగిస్తోంది. అధికారంలో ఉండి పదేళ్లు మేం చెప్పిందే ఇప్పుడు మంత్రి శ్రీధర్‌బాబు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి బీజేపీ వైఖరి ఇలానే ఉంది. మేము ఇచ్చినట్టే కేంద్రం చుట్టూ తిరిగి కాంగ్రెస్‌ నేతలు విజ్ఞాపనలు ఇచ్చారు. అయినా న్యాయం జరగలేదు. 

పదేళ్లు కేంద్రం ఇబ్బంది పెట్టినా మేమెక్కడా ఆగలేదు. దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ రాజీ పడేది లేదు. ప్రభుత్వంతో కలిసి వస్తాం.. నిలబడతాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మేమెప్పుడూ తెలంగాణ ప్రజల పక్షానే ఉంటాం. రాష్ట్ర విశాల ప్రయోజనాలే బీఆర్‌ఎస్‌కు పరమావధి..’ అని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై వివక్ష గురించి బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్‌ఎస్‌ పక్షాన కేటీఆర్‌ మాట్లాడారు.

పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ లేకపోవడమే కారణం
‘కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన చర్చను మేము స్వాగతిస్తున్నాం.. సమర్థిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధిస్తే, ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణ ప్రస్తావనే లేకుండా పోయింది. ఇందుకు పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ లేకపోవడం, గులాబీ జెండా ఎగరకపోవడమే కారణం. 

గణిత శాస్త్రం ప్రకారం 8 + 8 =16 . కానీ ఇప్పుడు 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు కలిపితే గుండు సున్నా వచ్చింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ చూసిన తర్వాత ప్రతి తెలంగాణ బిడ్డకు కలిగిన భావన ఇదే. అయితే ప్రభుత్వం అసెంబ్లీలో దీనిపై చర్చ పెట్టడం వెనుక కారణం వేరే ఉంది. 

మేమెవరితోనూ కలిసేది లేదు.. విలీనమయ్యేది లేదు
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్లిన 21 ట్రిప్పులు, విమాన ఖర్చులు వృథా కావడంతో, పైసా రాకపోవడంతో ప్రజల ముందు మొహం చెల్లక ఈ చర్చ పెట్టారు. చర్చ పెట్టాల్సింది ఇక్కడ కాదు. పార్లమెంటులో ఉన్న 99 మంది కాంగ్రెస్‌ ఎంపీలు కలిసి కొట్లాడాలి. మేము ఎక్కడికీ వెళ్లేది లేదు.ఎవరితోనూ కలిసేది లేదు. విలీనమయ్యేది లేదు. ఇక్కడే ఉంటాం. 

ఆరు గ్యారంటీలు అమలయ్యేదాకా మిమ్మల్ని అడుగుతూనే, కడుగుతూనే ఉంటాం. ఐటీఐఆర్‌ తెస్తారా.. చస్తారా ప్రజలు చూస్తారు. మా జెండా, ఎజెండా తెలంగాణమే. ఈ విషయంలో ఎక్కడకు, ఎలా తీసుకెళ్లినా తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వంతో కలిసి వస్తాం..’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

మాపై ఎదురుదాడి ఎందుకు?
కేటీఆర్‌ మాట్లాడుతున్న సందర్భంలో అధికార కాంగ్రెస్‌ సభ్యులు పలుమార్లు అడ్డు తగిలారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబులు కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేశారు. ఈ దశలో ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ రెండు పార్టీల ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగి సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. 

కేంద్ర బడ్జెట్‌లో ఏం జరిగిందో చెప్పకుండా కేటీఆర్‌ పదేళ్ల చరిత్రను చెబుతున్నారంటూ కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. ఇందుకు స్పందించిన కేటీఆర్‌.. తాము ఎక్కడైనా తప్పు, పొరపాటు చేసి ఉంటే ప్రజలు అందుకు తగిన శిక్ష విధించి ఇక్కడ కూర్చోబెట్టారని, తమపై ఎదురుదాడి ఎందుకని ప్రశ్నించారు.

ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయండి
సీఎంతో సహా మంత్రులంతా పాల్గొనాలి
బీఆర్‌ఎస్‌ తరఫున వెయ్యి మంది వచ్చి మద్దతిస్తాం
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినందున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రిమండలి అంతా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని, దానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కేటీఆర్‌ చెప్పారు. ‘తెలంగాణకు నిధులు వచ్చేంతవరకు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. అందుకు మా పార్టీ తరఫున వెయ్యి మంది వస్తాం. మేం బీజేపీతో ఎలాంటి చీకటి ఒప్పందం చేసుకోలేదు. 

సీఎం రేవంత్‌రెడ్డి మాపై అలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. రామ్‌నాథ్‌ కోవింద్‌ దళితుడని, వెంకయ్య నాయుడు తెలుగువారైనందున వారిద్దరికీ మద్దతు ఇచ్చామే తప్ప బీజేపీకి కాదు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్‌సిన్హాకు రాహుల్‌గాంధీతో కలిసి ఆయనకు మద్దతుగా సంతకం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి.
 
చీకటి స్నేహాలు మాకు తెలియవు: చీకటి స్నేహాలు మాకు తెలియవు. రేవంత్‌రెడ్డికి ఢిల్లీలో బీజేపీ ఎంపీలు పని చేయిస్తారు. ఆయనే బీజేపీతో స్నేహం చేస్తున్నారు. మేం బీజేపీలో విలీనం చేయం. రేవంత్‌రెడ్డిలాగా పరాన్నజీ వులం కాదు.. అధికారం కోసం పార్టీలు మారడానికి. మోదీ పేరు చెప్పడానికే రేవంత్‌రెడ్డి ఎందుకు భయపడు తున్నారు?’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

మీరాకుమార్‌కు మద్దతెందుకు ఇవ్వలేదు: భట్టి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. ‘బీజేపీకి బీఆర్‌ఎస్‌ ప్రతి విషయంలో మద్దతు ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు దళితుడని మద్దతిచ్చా మని అంటున్నారు.. అలాగైతే తెలంగాణ రావడంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి స్పీకర్‌ మీరాకుమార్‌ దళితురాలే. తెలంగాణ బిల్లు పాస్‌ కావడంలో ఆమె కీల కంగా వ్యవహరించారు. అలాంటి మీరాకుమార్‌కు బీఆర్‌ ఎస్‌ ఎందుకు మద్దతివ్వలేదు? బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకుంటే అది మీ ఇష్టం. 

కానీ పక్షంలో బీజేపీతో బీఆర్‌ఎస్‌కు సంబంధం లేదని, తాము అంటకాగడం లేదని బీఆర్‌ఎస్‌ చెప్పాలి. రాజకీయ ప్రయోజ నాలు కాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ప్రజలకు వెల్లడించాలి. సింగరేణి గురించైనా, దేని గురించైనా మరో రూపంలో మాట్లాడేందుకు మేము సిద్ధం..’ అని భట్టి అన్నారు. కాగా కేటీఆర్‌ స్పందిస్తూ, ‘మీరాకుమార్‌ అంటే మాకు గౌరవం ఉంది. ఆమెకు మద్దతిస్తూ తీర్మానం చేస్తే మేం ఆమోదిస్తాం..’ అని చెప్పారు. 

కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేద్దామనుకున్నాం
దిగ్విజయ్‌ సింగ్‌ వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయింది
అప్పుడు రేవంత్‌.. సోనియాను, రాహుల్‌గాంధీని తిట్టే పనిలో ఉన్నారు 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇచ్చినందుకు 2014లో తాము అప్పటి టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేద్దామని అనుకున్నామని, అయితే దిగ్విజయ్‌సింగ్‌ వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌తో విలీనం చర్చలు జరుపుతున్నప్పుడు ఇదే రేవంత్‌రెడ్డి సోనియాను బలిదేవత అని, రాహుల్‌గాంధీని ముద్దపప్పు అని తిట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఏం చేసినా మేం బాజాప్తాగానే చేశాం..’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.  

‘కేసీఆర్‌పై రేవంత్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన పదవుల కోసం పార్టీలు మారారు. మేం పార్టీ కోసం, తెలంగాణ కోసం పదవులు వదులుకున్నాం. మేం పదవులకు ఒకసారి కాదు వందసార్లు రాజీనామా చేశాం..’ అని చెప్పారు. ఎన్నికల సమయంలో ఆరు నెలలు రాజకీయాలు చేద్దామని, మిగతా రోజులు రాష్ట్రాభివృద్ధికి కృషి చేద్దామని సూచించారు. 

అంతకుముందు బీఆర్‌ఎస్‌పై సీఎం చేసిన వ్యాఖ్య లపై స్పందించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేలు కోరగా, స్పీకర్‌ అవకాశం ఇవ్వలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement