బండి సంజయ్‌తో మాట్లాడుతున్న ఆటో డ్రైవర్లు
అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం
ఇల్లు గడిచే పరిస్థితి లేదు
బండి సంజయ్‌కి ఆటో డ్రైవర్ల మొర
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బండి హామీ
కరీంనగర్ టౌన్: ‘సార్ మూడు నెలలుగా గిరాకీల్లేవు. ఫైనాన్స్ తెచ్చి ఆటో నడుపుతున్నాం. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. గిరాకీ అంతంత మాత్రమే వస్తోంది. బడి పిల్లలను తీసుకెళ్తుండటంతో వాళ్లిచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తోంది. ఎండాకాలం సెలవులొస్తున్నాయి. ఇక ఆ గిరాకీ కూడా ఉండదు. అప్పుల బాధ దేవుడెరుగు.. ఎట్లా బతకాలో అర్థం అయిత లేదు’అంటూ కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎదుట కరీంనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్లు మొర పెట్టుకున్నారు. బండి సంజయ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్లను కలిశారు.
వారితో కలసి చాయ్ తాగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇన్సూరెన్స్ చెల్లించే పరిస్థితి లేదన్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. రాబోయే రెండు నెలలపాటు స్కూళ్లు కూడా ఉండవని, ఇల్లు గడవడం కష్టమయ్యే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బండి మాట్లాడుతూ.. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదే అయినా ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తానని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment