Indra Bus
-
గాడిన పడుతున్న ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా గత ఏడాది భారీగా ఆదాయాన్ని కోల్పోయిన ఏపీఎస్ ఆర్టీసీ ఈ ఏడాది ఆరంభం నుంచి రాబడి క్రమంగా పెరుగుతుండటంతో గాడిన పడుతోంది. గతేడాది మార్చి 22 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు రూ.2,603 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. ఈ ఏడాది ఆరంభం నుంచి పుంజుకోవడంతో రోజువారీ సగటు ఆదాయం రూ.12 కోట్లకు చేరింది. గత ఏడాది జనవరిలో 69 శాతం ఆక్యుపెన్సీతో రూ.420 కోట్ల ఆదాయం లభించగా.. ఈ ఏడాది జనవరిలో 64 శాతం ఆక్యుపెన్సీతో రూ.360 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ నెలలో 12వ తేదీ వరకు లభించిన ఆదాయం రూ.145 కోట్లకు చేరింది. మార్చి నాటికి టికెట్ రెవెన్యూ రూ.400 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దూరప్రాంత సర్వీసులపై ప్రత్యేక దృష్టి దూర ప్రాంత సర్వీసులను మరింతగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. తెలంగాణతో అంతర్ రాష్ట్ర సర్వీసుల ఒప్పంద సమయంలో.. కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే తెలంగాణకు నడిపే 1,60,999 కిలోమీటర్ల మేర సర్వీసులను 2,08,856 కిలోమీటర్లకు పెంచుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు ఆ దిశగా దృష్టి సారించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి వచ్చే సర్వీసులకు డిమాండ్ పెరిగింది. ఎక్కువమంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తుండటంతో స్పెషల్ సర్వీసులను నడుపుతున్నారు. శుక్రవారం ఏపీలోని అన్ని ప్రాంతాలకు హైదరాబాద్ నుంచి 81 స్పెషల్ సర్వీసులు తిప్పారు. మరోవైపు తిరుపతికి కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ ప్రవేశపెట్టిన తిరుమల శీఘ్రదర్శనం టికెట్ ఆఫర్‌కు మంచి స్పందన వస్తోంది. రోజుకు సగటున 20 వేల మంది తిరుపతి వెళ్లేందుకు ఆర్టీసీ టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. దూరప్రాంత సర్వీసుల్లో 10 శాతం రాయితీ విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకు వెళ్లే డాల్ఫిన్, అమరావతి, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో ప్రయాణించే వారు 48 గంటల ముందే టికెట్లను రిజర్వేషన్ చేయించుకుంటే టికెట్ ధరలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. అయితే బస్సులో నాలుగైదు సీట్లకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుంది. డాల్ఫిన్ బస్సులో 58 సీట్ల కెపాసిటీ ఉంటే ఐదుగురికి.. అమరావతి బస్సులోలో 49 సీట్ల కెపాసిటీకి గాను ఐదుగురికి, ఇంద్రలో 40 సీట్లుంటే నలుగురికి, సూపర్ లగ్జరీలో 35 సీట్లకు గాను నలుగురికి, అల్ట్రా డీలక్స్‌లో 39 సీట్లకు గాను నలుగురు, ఎక్స్‌ప్రెస్ బస్సులో 49 సీట్లకు ఐదుగురికి రాయితీ అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మార్చి నెలాఖరు వరకు అమల్లో ఉంటుంది. ఇందుకు అనుగుణంగా ఆర్టీసీ ఐటీ అధికారులు సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. -
అందుబాటులోకి 21 సంజీవని బస్సులు
సాక్షి, విజయవాడ: ఇంద్ర బస్సులను సంజీవని బస్సులుగా మార్చామని, వీటి ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. వీటిని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 21 సంజీవని వాహనాలు ఏర్పాటు చేశామని, వాటిని అన్ని జిల్లాలకు పంపిస్తామని తెలిపారు. రానున్న 10 రోజుల్లో మరో 30 వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. తమిళనాడులో కేసులు ఎక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రానికి బస్సులు నడపలేకపోతున్నామన్నారు. (ఏపీఎస్ఆర్టీసీ చూపు.. కార్గో వైపు !) "టీఎస్ఆర్టీసీలో ఆపరేషన్స్ విభాగంలో కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు బుధవారం హైదరాబాద్‌లో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. సంచార రైతు బజారు కోసం ఆర్టీసీ బస్సులను తయారు చేశాం. కరోనా సమయంలోనూ ఆర్టీసీ సిబ్బంది సేవలందిస్తున్నారు. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. లాక్డౌన్ కారణంగా ఆర్టీసీకి రూ.4,200 కోట్ల నష్టం వచ్చింది, అయినా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామ"ని మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. (ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు లేనట్లే!) -
ఏపీఎస్ఆర్టీసీ మరో నిర్ణయం
సాక్షి, అమరావతి బ్యూరో: లాక్డౌన్ నేపథ్యంలో ఏసీ బస్సు సర్వీసులకు విరామం ఇచ్చిన ఆర్టీసీ ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఇంద్ర ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని ఏసీ బస్సులను విశాఖ సహా తిరుపతి, కడప, కర్నూలు ప్రాంతాలకు నడపాలని నిర్ణయించింది. మరోవైపు లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో బస్సు సర్వీసులను రోజురోజుకు పెంచుతోంది. కృష్ణా రీజియన్ నుంచి రెండు మూడు రోజుల క్రితం వరకు దాదాపు 200 బస్సులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడపగా సోమవారం నాటికి వీటి సంఖ్యను 308కి పెంచింది. వీటిలో పల్లె వెలుగు బస్సులకు ఆదరణ లేకపోయినా దూర ప్రాంత బస్సులకు మాత్రం డిమాండ్ బాగుంది. వీటిలో డిమాండ్ ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, రాజమండ్రి రూట్లకు ఎక్కువ బస్సులు నడుపుతోంది. (అప్పటివరకు స్కూల్స్ తెరవద్దు) ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు.. ఆర్టీసీ బస్సు సర్వీసులకు అనుమతిచ్చాక ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకు బస్సులు తిరిగాయి. తాజాగా ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు బస్సులను నడుపుతున్నారు. పల్లెవెలుగు బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. ఇప్పటికే సగం సీట్లను కుదించినా వీటిలోనూ సగం మంది కూడా ప్రయాణించడం లేదు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ పల్లెవెలుగు బస్సులు మరింత నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పల్లెవెలుగు సర్వీసులను నడుపుతున్నారు. మరీ ఆదరణ లేని రూట్లలో మాత్రమే సర్వీసులను రద్దు చేస్తున్నారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, దానికనుగుణంగా బస్సుల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ కృష్ణా రీజియన్ ఆర్ఎం నాగేంద్రప్రసాద్ ‘సాక్షి’తో చెప్పారు. కాగా, తొలుత గ్రౌండ్ బుకింగ్ విధానంలో టిక్కెట్లు తీసుకోవడానికి వీలు కల్పించారు. (13% మద్యం దుకాణాల మూసివేత) -
త్వరలో కొత్త ‘రాజధాని’ బస్సులు
రోడ్లపైకి 95 కొత్త వాహనాలు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ త్వరలో కొత్త ‘రాజధాని’బస్సులను రోడ్లపైకి తెస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 61 రాజధాని (పూర్వపు పేరు ఇంద్ర) బస్సులు తిరుగుతున్నాయి. ఇవన్నీ పాతబడిపోవటంతో వాటి స్థానంలో కొత్తగా 95 బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాటిని సమకూర్చుకునే ప్రక్రియ దాదాపుగా పూర్తి అవుతున్నందున త్వరలో వాటిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. సూపర్ లగ్జరీ కంటే టికెట్ ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ సౌకర్యాల పరంగా మెరుగ్గా ఉండటంతో రాజధాని బస్సులకు మంచి డిమాండ్ ఉంది. మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు నడపాలని సీఎం కూడా ఆదేశించటంతో వాటి సంఖ్య పెంచాలని అధికారులు నిర్ణయించారు. డిమాండ్ ఉన్న దూరపు ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో బస్సులు నడపాలని నిర్ణయించారు. సూపర్ లగ్జరీలుగా పాత బస్సులు... పాత రాజధాని బస్సులను సూపర్‌లగ్జరీ బస్సులుగా మార్చాలని నిర్ణయించారు. వాటికి కొత్త బాడీ అమర్చి కొత్త రూపుతో రోడ్లపైకి తేనున్నారు. -
'ఇంద్ర' బస్సులో మంటలు: ప్రయాణికులు సురక్షితం
మెదక్ జిల్లా కొండపాక శివారులో మంగళవారం ఆర్టీసీ 'ఇంద్ర' బస్సులో ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ఆ బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై బస్సు నుంచి బయటకు దూకి పరుగులు తీశారు. అంతలోనే బస్సు వెనక భాగం నుంచి మంటలు ఆకస్మాత్తుగా ఎగసిపడ్డాయి.దాంతో డ్రైవర్ ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు.అధికారుల ఫిర్యాదుతో అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బస్సులో ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. పోలీసులు కూడ ఘటన స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాదానికి గల కారణాలపై డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు. బస్సు కండిషన్ సరిగా లేదని చెప్పిన ఆర్టీసీ అధికారులు బస్సును హైదరాబాద్‌కు ట్రిప్ వేశారని డ్రైవర్ పోలీసులకు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంద్ర బస్సులో మంటలు అంటుకుని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.అగ్ని ప్రమాదానికి గురైన బస్సు కరీంనగర్ డిపోకు చెందిన బస్సు అని పోలీసులు తెలిపారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానానికి తరలించేందుకు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.