మెదక్ జిల్లా కొండపాక శివారులో మంగళవారం ఆర్టీసీ 'ఇంద్ర' బస్సులో ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ఆ బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై బస్సు నుంచి బయటకు దూకి పరుగులు తీశారు. అంతలోనే బస్సు వెనక భాగం నుంచి మంటలు ఆకస్మాత్తుగా ఎగసిపడ్డాయి.దాంతో డ్రైవర్ ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు.అధికారుల ఫిర్యాదుతో అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బస్సులో ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.
పోలీసులు కూడ ఘటన స్థలానికి చేరుకుని అగ్ని ప్రమాదానికి గల కారణాలపై డ్రైవర్ను ప్రశ్నిస్తున్నారు. బస్సు కండిషన్ సరిగా లేదని చెప్పిన ఆర్టీసీ అధికారులు బస్సును హైదరాబాద్కు ట్రిప్ వేశారని డ్రైవర్ పోలీసులకు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇంద్ర బస్సులో మంటలు అంటుకుని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.అగ్ని ప్రమాదానికి గురైన బస్సు కరీంనగర్ డిపోకు చెందిన బస్సు అని పోలీసులు తెలిపారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానానికి తరలించేందుకు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
'ఇంద్ర' బస్సులో మంటలు: ప్రయాణికులు సురక్షితం
Published Tue, Apr 1 2014 11:13 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement