సాక్షి, అమరావతి బ్యూరో: సంక్రాంతికి ఇంటికెళదామనుకునే వారికి కష్టాలు తప్పని పరిస్థితి తలెత్తింది. జనవరి 7 నుంచి 14 వరకు రైళ్లు, బస్సుల్లో బెర్తులు, సీట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. ప్రధానంగా విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ఈ రూట్‌లో జనవరి 7వ తేదీ నుంచి 14 వరకు రైళ్లలో బెర్తులు దొరకని పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్ చేయించుకుందామంటే చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటోంది. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇప్పటికే ‘రిగ్రెట్’ అని వస్తోంది.
విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా నిత్యం 85 రైళ్లకు పైగా వెళ్తుంటాయి. వీటిలో రోజూ నడిచే రెగ్యులర్ రైళ్లు 27 కాగా, వీక్లీ, బై వీక్లీ రైళ్లు 58 వరకు ఉన్నాయి. సెకండ్ సిట్టింగ్‌తో నడిచే విజయవాడ–విశాఖ (రత్నాచల్), గుంటూరు–విశాఖ (సింహాద్రి), లింగంపల్లి–విశాఖ(జన్మభూమి) రైళ్లలో మాత్రమే ప్రస్తుతానికి కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన అన్ని రైళ్లలో.. అన్ని క్లాసులూ వెయిటింగ్ లిస్టులతోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీరంతా సంక్రాంతికి తమ స్వస్థలాలకు వెళ్లడానికి ముందస్తుగానే రిజర్వేషన్లు చేయించుకోవడంతో రైళ్లలో సీట్లు, బెర్తులు లభ్యం కావడం లేదు.
బస్సులదీ అదే దారి
మరోవైపు బస్సుల్లోనూ విజయవాడ–విశాఖపట్నం రూటుకే అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది. విశాఖపట్నం మీదుగా విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల వైపు వెళ్లే రెగ్యులర్ బస్సుల్లో నూరు శాతం రిజర్వేషన్లు అయిపోయాయి. ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ దూరప్రాంతాలకు రోజూ 463 రెగ్యులర్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో ఇప్పటివరకు సంక్రాంతి సమయంలో (జనవరి 8–14 మధ్య) అధిక శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెగ్యులర్ బస్సుల్లో సీట్లు ఫుల్ అయ్యాక స్పెషల్ సర్వీసులకు రిజర్వేషన్లు తెరుస్తారు.
హైదరాబాద్ వైపు రైళ్లలో ఖాళీలు
కాగా, సంక్రాంతి సీజన్‌లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లలో సీట్లు, బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ రూట్‌లో 36 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తుండగా రోజువారీ 19, వీక్లీ/బైవీక్లీ ట్రైన్లు 17 వరకు నడుస్తున్నాయి. వీటిలో శాతవాహన, గోల్కొండ, జన్మభూమి, ఇంటర్‌సిటీ రైళ్లు సెకండ్ సీటింగ్‌వి కాగా.. మిగిలినవి స్లీపర్ క్లాసులున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లే. ప్రస్తుతం ఈ రైళ్లలో దాదాపు అన్ని క్లాసుల బెర్తులు, సీట్లు పదులు, వందల సంఖ్యలో ఖాళీలున్నాయి.
సంక్రాంతికి 1,266 స్పెషల్ బస్సులు
ఈ సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి 1,266 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. వీటిలో విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360, హైదరాబాద్‌కు 362, చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 120 బస్సులను నడపాలని నిర్ణయించినట్టు రీజనల్ మేనేజర్ ఎంవై దానం ‘సాక్షి’కి చెప్పారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మరిన్ని స్పెషల్ సర్వీసులను నడపనున్నట్టు తెలిపారు. కాగా కోవిడ్ ప్రభావం వల్ల గత సంక్రాంతికి ఈ రీజియన్ నుంచి 1,093 స్పెషల్ బస్సులు నడిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 173 సర్వీసులు ఎక్కువ. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ సంక్రాంతికి స్పెషల్ సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment