Train travelers
-
Sankranthi: రైళ్లు, బస్సులు ఫుల్..
సాక్షి, అమరావతి బ్యూరో: సంక్రాంతికి ఇంటికెళదామనుకునే వారికి కష్టాలు తప్పని పరిస్థితి తలెత్తింది. జనవరి 7 నుంచి 14 వరకు రైళ్లు, బస్సుల్లో బెర్తులు, సీట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. ప్రధానంగా విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ఈ రూట్లో జనవరి 7వ తేదీ నుంచి 14 వరకు రైళ్లలో బెర్తులు దొరకని పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్ చేయించుకుందామంటే చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటోంది. కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లలో ఇప్పటికే ‘రిగ్రెట్’ అని వస్తోంది. విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా నిత్యం 85 రైళ్లకు పైగా వెళ్తుంటాయి. వీటిలో రోజూ నడిచే రెగ్యులర్ రైళ్లు 27 కాగా, వీక్లీ, బై వీక్లీ రైళ్లు 58 వరకు ఉన్నాయి. సెకండ్ సిట్టింగ్తో నడిచే విజయవాడ–విశాఖ (రత్నాచల్), గుంటూరు–విశాఖ (సింహాద్రి), లింగంపల్లి–విశాఖ(జన్మభూమి) రైళ్లలో మాత్రమే ప్రస్తుతానికి కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన అన్ని రైళ్లలో.. అన్ని క్లాసులూ వెయిటింగ్ లిస్టులతోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీరంతా సంక్రాంతికి తమ స్వస్థలాలకు వెళ్లడానికి ముందస్తుగానే రిజర్వేషన్లు చేయించుకోవడంతో రైళ్లలో సీట్లు, బెర్తులు లభ్యం కావడం లేదు. బస్సులదీ అదే దారి మరోవైపు బస్సుల్లోనూ విజయవాడ–విశాఖపట్నం రూటుకే అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది. విశాఖపట్నం మీదుగా విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల వైపు వెళ్లే రెగ్యులర్ బస్సుల్లో నూరు శాతం రిజర్వేషన్లు అయిపోయాయి. ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ దూరప్రాంతాలకు రోజూ 463 రెగ్యులర్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో ఇప్పటివరకు సంక్రాంతి సమయంలో (జనవరి 8–14 మధ్య) అధిక శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెగ్యులర్ బస్సుల్లో సీట్లు ఫుల్ అయ్యాక స్పెషల్ సర్వీసులకు రిజర్వేషన్లు తెరుస్తారు. హైదరాబాద్ వైపు రైళ్లలో ఖాళీలు కాగా, సంక్రాంతి సీజన్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లలో సీట్లు, బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ రూట్లో 36 ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తుండగా రోజువారీ 19, వీక్లీ/బైవీక్లీ ట్రైన్లు 17 వరకు నడుస్తున్నాయి. వీటిలో శాతవాహన, గోల్కొండ, జన్మభూమి, ఇంటర్సిటీ రైళ్లు సెకండ్ సీటింగ్వి కాగా.. మిగిలినవి స్లీపర్ క్లాసులున్న ఎక్స్ప్రెస్ రైళ్లే. ప్రస్తుతం ఈ రైళ్లలో దాదాపు అన్ని క్లాసుల బెర్తులు, సీట్లు పదులు, వందల సంఖ్యలో ఖాళీలున్నాయి. సంక్రాంతికి 1,266 స్పెషల్ బస్సులు ఈ సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి 1,266 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. వీటిలో విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360, హైదరాబాద్కు 362, చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 120 బస్సులను నడపాలని నిర్ణయించినట్టు రీజనల్ మేనేజర్ ఎంవై దానం ‘సాక్షి’కి చెప్పారు. ప్రయాణికుల డిమాండ్ను బట్టి మరిన్ని స్పెషల్ సర్వీసులను నడపనున్నట్టు తెలిపారు. కాగా కోవిడ్ ప్రభావం వల్ల గత సంక్రాంతికి ఈ రీజియన్ నుంచి 1,093 స్పెషల్ బస్సులు నడిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 173 సర్వీసులు ఎక్కువ. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ సంక్రాంతికి స్పెషల్ సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. -
రైళ్లలో ధ్రువీకరణకు లాయర్ ఐడీ కార్డులు
న్యూఢిల్లీ: రైలు ప్రయాణాల్లో గుర్తింపు ధ్రువీకరణ పత్రం(ఐడెంటిటీ ప్రూఫ్)గా న్యాయవాదులు తమకు ఆయా బార్ కౌన్సిల్స్ జారీ చేసే ఐడెంటిటీ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు 11 రకాల ధ్రువీకరణ పత్రాలను రైల్వే శాఖ గుర్తిస్తోంది. వాటిలో ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, విద్యార్థులకు వారి పాఠశాలలు, కళాశాలలు జారీ చేసే గుర్తింపు కార్డ్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు కార్డులు మొదలైనవి ఉన్నాయి. కేరళ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల కారణంగా బార్ కౌన్సిల్స్ జారీ చేసే ఐడీ కార్డులను ధ్రువీకరణ పత్రాలుగా ఉపయోగించుకునేందుకు అవకాశమిస్తున్నామని రైల్వే బోర్డు సోమవారం ప్రకటించింది. -
ఉపవాసం చేసే వారికోసం ప్రత్యేక ఆహారం
న్యూఢిల్లీ: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఆచరిస్తున్న రైలు ప్రయాణికుల కోసం ‘వ్రత్ కా ఖానా’ పేరిట కొత్త మెనూ సిద్ధంచేసినట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పోరేషన్(ఐఆర్సీటీసీ) తెలిపింది. సాత్వికాహారం అయిన సగ్గుబియ్యం, సైంధవ లవణం, కూరగాయాలతో తయారుచేసిన ఆహారపదార్ధాలను రైల్వే మెనూలో అక్టోబర్ 10 నుంచి 18వ తేదీవరకు రైళ్లలో అందిస్తామని ఐఆర్సీటీసీ వెల్లడించింది. రైళ్లో భోజనం కోసం ఉపవాస దీక్షలో ఉన్న వారు ఇబ్బందిపడకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు అని తెలిపింది. సగ్గుబియ్యం కిచిడి, లస్సీ, తాలి, ఫ్రూట్ చాట్స్లనూ అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. జర్నీ మొదలవడానికి రెండు గంటలముందుగా పీఎన్ఆర్ నంబర్ సాయంతో కొత్త మెనూలోని ఆయా ఆహారపదార్ధాలను ఠీఠీఠీ.్ఛఛ్చ్టి్ఛటజీnజ.జీటఛ్టిఛి.ఛిౌ.జీn ద్వారా ఆర్డర్ చేయొచ్చని తెలిపింది. -
92 పైసలకే రూ.10 లక్షల బీమా
రైలు ప్రయాణికులకు కొత్త పథకం 31 నుంచి అమలు న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు కేవలం 92 పైసల ప్రీమియంతో రూ.10 లక్షల బీమా అందించే కొత్త పథకాన్ని రైల్వేశాఖ ఆగస్టు 31 నుంచి ప్రారంభించనుంది. సీట్లు ఖరారైన, ఆర్ఏసీ, నిరీక్షణ జాబితాలో ఉన్న అన్ని టికెట్లకూ, అన్ని తరగతుల ప్రయాణికులకు ఈ సౌకర్యం కల్పిస్తారు. అయితే దీనిని ఉపయోగించుకునేందుకు టికెట్లను ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కేటరింగ్ కార్పొరేషన్) వెబ్సైట్ ద్వారా తీసుకోవాలి. చనిపోయిన లేదా పూర్తిగా వికలాంగులుగా మారిన వారికి రూ.10 లక్షలు, పాక్షి క అంగవైకల్యం పొందిన వారికి రూ.7.5 లక్షలు, ఆసుపత్రి పాలైన వారికి రూ.2 లక్షలు, చనిపోయిన వారి మృతదేహాలను సొంత ప్రాంతాలకు తరలించడానికి రూ.10 వేలను ఈ బీమా పథకం కింద ఇస్తారు. రైలు ప్రమాదానికి గురైనా, ఉగ్రవాదులు దాడి చేసినా, బందిపోట్లు దోచుకెళ్లినా, అల్లర్లు, తుపాకీ కాల్పులు, మంటల్లో చిక్కుకోవడం వంటి ఘటనలకు బీమా వర్తిస్తుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల భాగస్వామ్యంతో ఐఆర్సీటీసీ ఈ సదుపాయం కల్పిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు, విదేశీయులకు, సబర్బన్ రైలు ప్రయాణికులకు బీమా పథకం వర్తించదు. టికెట్ రద్దు చేసుకుంటే ప్రీమియంను తిరిగి చెల్లించరు.