92 పైసలకే రూ.10 లక్షల బీమా
రైలు ప్రయాణికులకు కొత్త పథకం 31 నుంచి అమలు
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు కేవలం 92 పైసల ప్రీమియంతో రూ.10 లక్షల బీమా అందించే కొత్త పథకాన్ని రైల్వేశాఖ ఆగస్టు 31 నుంచి ప్రారంభించనుంది. సీట్లు ఖరారైన, ఆర్‌ఏసీ, నిరీక్షణ జాబితాలో ఉన్న అన్ని టికెట్లకూ, అన్ని తరగతుల ప్రయాణికులకు ఈ సౌకర్యం కల్పిస్తారు. అయితే దీనిని ఉపయోగించుకునేందుకు టికెట్లను ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే టూరిజం అండ్ కేటరింగ్ కార్పొరేషన్) వెబ్‌సైట్ ద్వారా తీసుకోవాలి. చనిపోయిన లేదా పూర్తిగా వికలాంగులుగా మారిన వారికి రూ.10 లక్షలు, పాక్షి క అంగవైకల్యం పొందిన వారికి రూ.7.5 లక్షలు, ఆసుపత్రి పాలైన వారికి రూ.2 లక్షలు, చనిపోయిన వారి మృతదేహాలను సొంత ప్రాంతాలకు తరలించడానికి రూ.10 వేలను ఈ బీమా పథకం కింద ఇస్తారు.
రైలు ప్రమాదానికి గురైనా, ఉగ్రవాదులు దాడి చేసినా, బందిపోట్లు దోచుకెళ్లినా, అల్లర్లు, తుపాకీ కాల్పులు, మంటల్లో చిక్కుకోవడం వంటి ఘటనలకు బీమా వర్తిస్తుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల భాగస్వామ్యంతో ఐఆర్‌సీటీసీ ఈ సదుపాయం కల్పిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు, విదేశీయులకు, సబర్బన్ రైలు ప్రయాణికులకు బీమా పథకం వర్తించదు. టికెట్ రద్దు చేసుకుంటే ప్రీమియంను తిరిగి చెల్లించరు.