సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో 15 ఏళ్లు పైబడిన బస్సులు కేవలం 19 మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా అర్బన్ ప్రాంతాల్లో 12, గ్రామీణ ప్రాంతాల్లో 9 మాత్రమే తిరుగుతున్నాయి. ఆర్టీసీలో కాల వ్యవధితో సంబంధం లేకుండా కి.మీ. ప్రాతిపదికగా బస్సుల్ని మార్చేస్తున్నారు. వీటి స్థానంలో ఏటా వెయ్యి కొత్త బస్సుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. అతి పెద్ద రవాణా వ్యవస్థ అయిన ఏపీఎస్ ఆర్టీసీలో మెరుగైన స్క్రాపేజీ పాలసీని అమలు చేస్తున్నారు. ఇటీవలే కేంద్రం బడ్జెట్‌లో.. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను కచ్చితంగా తుక్కుగా మార్చేయాలని కేంద్రం పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ గత రెండు రోజుల కిందట సంస్థలో బస్సుల పరిస్థితిపై సమీక్షించింది. కేంద్రం ప్రకటించిన స్క్రాపేజీ పాలసీతో ఏపీఎస్ ఆర్టీసీపై ప్రభావం ఉండదని సంస్థ అధికారులు నిర్ణయానికొచ్చారు. ఆర్టీసీలో కేవలం 19 బస్సులే 15 ఏళ్లు పైబడి ఉన్నట్టు గుర్తించారు. ఆర్టీసీ గతం నుంచి స్క్రాపేజీకి సంబంధించి విధాన పరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. ఆర్టీసీ అధికారులు డిపోల్లో వినియోగించే వ్యక్తిగత, ఇతర వాహనాల విషయంలోనూ కాల వ్యవధితో సంబంధం లేకుండా కి.మీ. పూర్తయితే వాటిని స్క్రాప్ కింద తీసేసి అద్దెకు వాహనాలు తీసుకుని నడుపుతున్నారు.
ఆ బస్సులు ఇతర అవసరాలకు..
ఆర్టీసీలో ఓ బస్సు 12 లక్షల కి.మీ. తిరిగితే ఆ బస్సును ప్రజా రవాణాకు అసలు వినియోగించడం లేదు. గూడ్స్ వాహనంగానో, లేకుంటే ఆ బస్సును టాయిలెట్‌గా మార్చి వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీలో బస్సులు నిత్యం 41.73 లక్షల కి.మీ. తిరుగుతున్నాయి. ఆర్టీసీలో అధిక శాతం బస్సులు పది నుంచి పన్నెండేళ్ల కాల వ్యవధిలోనే 12 లక్షల కి.మీ. పూర్తి చేసుకుంటున్నాయి. 12 లక్షల కి.మీ. దాటితే ఆ బస్సును స్క్రాప్ కింద మార్చేస్తున్నారు. అంతేకాకుండా ఏటా ఆర్టీసీ కొత్త బస్సుల్ని సంస్థలో ప్రవేశపెట్టి పాత బస్సుల్ని మారుస్తోంది. ఏపీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తున్న స్క్రాపేజీ విధానం కేంద్రం ప్రకటించిన పాలసీ కంటే సమర్థంగా ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఆర్టీసీలో మెరుగైన స్క్రాపేజీ పాలసీ!
Published Tue, Feb 9 2021 5:42 AM | Last Updated on Tue, Feb 9 2021 5:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment