
సాక్షి, అమరావతి: లాభాపేక్షతో నిర్వహిస్తున్న ప్రైవేటు ఈ కామర్స్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే ఆర్టీసీ నాన్ ఏసీ టికెట్లపై ఏపీఎస్‌ఆర్టీసీ 5 శాతం జీఎస్టీ విధించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు గురువారం ఆర్టీసీ అధికారులు ఈ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టల్స్‌లో టికెట్లు కొనుగోలు చేసేవారు జనవరి 1వ తేదీ నుంచి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి సేవా దృక్పథంతో నిర్వహించే ఆర్టీసీ పోర్టల్, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు, నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు జీఎస్టీ ఉండదని ఆర్టీసీ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.