
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంకా రూట్ క్లియర్ కాలేదు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. బుధవారం ఆ రెండు ఆర్టీసీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయిలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. గతంలో పేర్కొన్న విషయాలకే ఇరువైపులా కట్టుబడి ఉండటంతో చర్చలు ముందుకు సాగలేదు. ఇప్పటివరకు(లాక్‌డౌన్‌కు పూర్వం) ఆంధ్రప్రదేశ్ భూభాగంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరుగుతున్న 1.61 లక్షల కిలోమీటర్లకు సమంగా ఏపీ ఆర్టీసీ బస్సులు కూడా తెలంగాణ ప్రాంతంలో తిప్పేవిధంగా షెడ్యూళ్లను మార్చుకోవాల్సిందేనని తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో తమ ఎండీతో మాట్లాడి రెండు రోజుల తర్వాత మళ్లీ సమావేశానికి వస్తామని ఏపీ అధికారులు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ కోసం తాజాగా జరిగిన భేటీ నాలుగోది కావటం విశేషం.
ఇంకా ఎంత తగ్గగలరో చెప్పండి..
లాక్‌డౌన్‌కు పూర్వం తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సుల 2.64 లక్షల కిలోమీటర్ల మేర తిరిగేవి. ఇప్పుడు కూడా అంతమేర తాము తిప్పుతామని, కావాలంటే తెలంగాణ ఆ మేరకు తమ సర్వీసుల పరిధిని పెంచుకోవాలని ఏపీ కోరుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు అంగీకరించటం లేదు. ఇప్పటికే తాము తీవ్ర నష్టాల్లో ఉన్నామని, కొత్తగా పరిధి పెంచుకోవటం వల్ల నష్టాలు పెరగటం తప్ప ఉపయోగం ఉండదని వాదిస్తున్నారు. మూడో దఫా చర్చకు వచ్చిన సందర్భంలో, ఏపీ అధికారులు ఓ మెట్టు దిగి 2.64 లక్షల కిలోమీటర్లకు బదులు 2.08 లక్షల కిలోమీటర్లకు తగ్గించుకుంటామని, తెలంగాణ అంతమేరకు పెంచుకుంటే సరిపోతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. దానికి కూడా తెలంగాణ అధికారులు అంగీకరించలేదు.
తాము సూచించినట్టుగా ఏయే మార్గాల్లో ఎంత మేర తగ్గించగలుగుతారో చెప్పాలని, అది తమకు ఆమోదయోగ్యం ఉంటుందో లేదో ఆలోచించి చెబుతామని తెలంగాణ అధికారులు చెప్పారు. ఆ విషయం చెప్పకుండా పాత ప్రతిపాదనతో రావడం వల్ల కాలయాపన తప్ప ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ సూచనలపై తమ ఎండీతో చర్చించి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందని ఏపీ అధికారులు అన్నారు. రెండు రోజుల తర్వాత కొత్త ప్రతిపాదనతో వస్తామంటూ వారు సమావేశం నుంచి వెళ్లిపోయారని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి, ఇంజనీరింగ్ విభాగం ఈడీ వినోద్, సీటీఎం మునిశేఖర్, రంగారెడ్డి, సికింద్రాబాద్ ఆర్‌ఎంలు పాల్గొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ నుంచి ఆపరేషన్స్ విభాగం ఈడీ బ్రహ్మానందరెడ్డి, ఇంజనీరింగ్ విభాగం ఈడీ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment