ఆర్టీసీకి మాయరోగం! | 15percent of Bus services has stopped state wide | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి మాయరోగం!

Published Fri, Jul 15 2016 3:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

ఆర్టీసీకి మాయరోగం!

ఆర్టీసీకి మాయరోగం!

- నాలుగున్నర వేల మంది కార్మికులకు అనారోగ్యమట
- ఆ పేరుతో మూకుమ్మడి సెలవులు
- 19న కార్మిక సంఘం ఎన్నికలుండటంతో ప్రచారంలో కార్మికులు.. సెలవు కోసం ‘అనారోగ్యం’ పేరుతో డ్రామా
- జబ్బు పడ్డట్టు ఆర్టీసీ ఆసుపత్రి నుంచే సర్టిఫికెట్లు
- అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్టిఫికెట్లు ఇప్పిస్తున్న కార్మిక సంఘాల నేతలు.. చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
- రాష్ట్రవ్యాప్తంగా 15% వరకు నిలిచిపోయిన బస్సు సర్వీసులు
- ఇబ్బందుల్లో ప్రయాణికులు.. ఆదాయం కోల్పోతున్న ఆర్టీసీ

 
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి ఒక్కసారిగా జబ్బు చేసింది! ఎంతగా అంటే కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగున్నర వేల మంది కార్మికులు ‘సిక్’ అయ్యేంత!! తాము అనారోగ్యంతో బాధపడుతున్నందున విధులకు హాజరు కాలేమంటూ వారంతా డిపో మేనేజర్లకు లేఖలు పంపారు. వారు నిజంగానే అనారోగ్యానికి గురయ్యారంటూ హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఆసుపత్రి, జిల్లాల్లో దానికి అనుబంధంగా ఉన్న డిస్పెన్సరీలు సర్టిఫై చేసేశాయ్. దీంతో డిపోల్లో ఒక్కసారిగా డ్రైవర్లు, కండక్టర్లకు కొరత వచ్చి పడింది.
 
 ఉన్న సిబ్బందితో డబుల్ డ్యూటీలు చేయించినా సరిపోక దాదాపు 15%బస్సులు డిపోల్లేనే ఉండిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాక ఆర్టీసీకి ఆదాయం కూడా పడిపోయింది. ఇంతకూ అంతమంది కార్మికులు ఒక్కసారిగా ఎందుకు జబ్బు పడ్డారో తెలుసా? ఈ నెల 19న  ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలున్నాయి. వాటికి ప్రచారం చేయటం కోసం అన్ని యూనియన్ల నేతలు వారితో సెలవు పెట్టించారు. అదీ ఆర్టీసీకి పట్టుకున్న ‘మాయరోగం’ కథ!
 అనారోగ్యం లేకుండానే సర్టిఫికెట్లెలా?
 
 తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి ఆర్టీసీలో కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంఘాలు ప్రచారంలో మునిగిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో సంయుక్తంగా గుర్తింపు పొందిన టీఎంయూ, ఈయూలు ఈసారి విడిగా పోటీచేస్తుండగా, చీలికతో రెండు వర్గాలుగా ఉన్న ఎన్‌ఎంయూ ఒక్కటిగా మారిపోయింది.
 
 గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మిక సంక్షేమ నిధులను ఆర్టీసీ వాడుకుని కార్మికులకు బకాయిపడింది. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావటంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.  గతంలో ఎన్‌ఎంయూ కీలక నేతగా ఎదిగిన మహమూద్ అవినీతి ఆరోపణలతో అరెస్టయ్యారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఎటుమొగ్గుతారో తెలియని గందరగోళం నెలకొంది. దీంతో సంఘాలు ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. ఇందుకు కార్మికుల అవసరం కావటంతో ఆయా సంఘాలు తమకు అనుకూలంగా ఉన్నవారిని గుర్తించి సెలవులు పెట్టించి ప్రచారంలోకి దింపాయి. దీంతో అనారోగ్యానికి గురయ్యామంటూ లీవులు పెట్టారు. సంస్థ కార్మికులు అనారోగ్యానికి గురైతే ఆర్టీసీ ఆసుపత్రి వైద్యులు నిర్ధారిస్తూ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. యూనియన్ నేతలు ఆర్టీసీ ఆసుపత్రి, జిల్లాల్లో దానికి అనుబంధంగా ఉండే కేం ద్రాలపై ఒత్తిడి తెచ్చి కార్మికులకు సిక్ సర్టిఫికెట్లు జారీ చేయిస్తున్నా రు. నాలుగైదు రోజుల్లో ఏకంగా 4500 మంది ఇలా ప్రచారం బాటపట్టారు.
 
 ఆగిపోయిన బస్సులు
 సాధారణంగా ప్రతి డిపోలో సిబ్బంది సెలవులు, ఇతర కారణాలతో నిత్యం ఐదారు బస్సులు నిలిచిపోతుంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఒక్కో డిపోలో రోజూ 15 నుంచి 20 వరకు బస్సులు నిలిచిపోవాల్సి వస్తోంది. నగరంలోని ఓ డిపోలో గురువారం సాయంత్రానికి వంద మంది కార్మికులు సెలవులో వెళ్లిపోయారు. దీంతో గురువారం 30 మంది కార్మికులతో డబుల్ డ్యూటీ చేయించినా 15 బస్సులు ఆగిపోవాల్సి వచ్చింది. మిగతా డిపోల్లో కూడా కాస్త అటూఇటూగా ఇదే పరిస్థితి నెలకొంది. అటు గ్రామాల్లో కూడా కొన్ని ఊళ్లకు బస్సులు నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సెలవు పెట్టే వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఇది ఆదాయంపైనా ప్రభావం చూపుతోంది.
 
 చోద్యం చూస్తున్న యాజమాన్యం
 ఇలా ఎన్నికల వేళ ప్రచారం కోసం సెలవులు పెట్టడం కొత్తకాదు. గతంలో ఎన్నికల సమయంలో ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలా మూకుమ్మడి సెలవులు రాకుండా చూసేవారు. ముందుగానే తార్నాక ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేసేవారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కొందరు కార్మికులకు సర్టిఫికెట్లు ఇవ్వటానికి నిరాకరిస్తే ఓ యూనియన్ నేత బస్‌భవన్‌కు వెళ్లి ఉన్నతాధికారి ఒకరితో ఆసుపత్రికి ఫోన్ చేయించి మరీ సర్టిఫికెట్లు ఇప్పించాడని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement