తమిళనాడుకు తిరిగి ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు
చిత్తూరు: ఆర్టీసీ ఎట్టకేలకు ఆంధ్రా నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులని ప్రారంభించింది. తమిళనాడు ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీ జరిపిన చర్చలు సఫలం కావడంతో బస్సు సర్వీసులని తిరిగి పునరుద్ధరించింది. శేషాచలం ఎన్కౌంటర్ ఫలితంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గత కొంత కాలంగా ఎక్కువవుతూ వచ్చాయి.
తమిళనాడులో ఏపీ బస్సులపై తరచు దాడులు జరుగుతుండటం, దాంతో ఏపీఎస్ ఆర్టీసీ తన సర్వీసులను నిలిపివేయడం తెలిసిందే. అయితే.. తమిళనాడు బస్సులు మాత్రం యథేచ్ఛగా తిరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట తమిళనాడు బస్సులను ఏపీ గ్రామాల్లోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ అధికారులు కూడా గత కొన్ని రోజులుగా తమిళనాడు ప్రభుత్వంతో చర్చలకు ప్రయత్నించినా సానుకూల స్పందన కరువైంది. గ్రామస్తుల ఆగ్రహం, ఆర్టీసీ అధికారుల విన్నపాల నేపథ్యంలో శనివారం తమిళనాడు ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీ జరిపిన చర్చలు సఫలం కావడంతో తిరుమల వచ్చి వెళ్లే భక్తులకు ఊరట కలిగినట్లయింది. ఆర్టీసీ చాలా రోజుల నుంచి తమిళనాడుకు వెళ్లే సర్వీసులను రద్దుచేసింది. దాంతో సంస్థకు ఇప్పటికే దాదాపు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.