సమగ్ర సర్వే నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: సమగ్ర సర్వే నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ప్రకటించటం, సర్వే సిబ్బంది వచ్చేసరికి కుటుంబ సభ్యులు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో బస్సులు నడపాల్సిన అవసరం లేదని ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో మంగళవారం ప్రజల అవసరాల కోసం ఎక్కడా బస్సులు నడపటం లేదని ప్రకటించింది. కేవలం సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్ల వెసులుబాటు కోసం ఉదయం, రాత్రి వేళల్లో పరిమితంగా మాత్రమే బస్సులు తిప్పనున్నారు. వాటిలో సాధారణ ప్రయాణికులను కూడా అనుమతిస్తారు. అయినప్పటికీ వీలైనంతవరకు ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆర్టీసీ అధికారులు సూచించారు.
అత్యవసరమైతే తప్ప బస్సులు నడపాల్సిన అవసరం లేదని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. సర్వే రోజున బస్సులు నడుస్తాయని తాను ప్రకటించినట్టుగా కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త అవాస్తవమని స్పష్టంచేశారు. కాగా, హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు, రాత్రి ఏడు గంటల నుంచి 11 గంటల వరకు సిటీ బస్సులు తిరుగుతాయి. ఉదయం, రాత్రి వేళ నాలుగు గంటల చొప్పున బస్సులు తిప్పాలని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు కోరడంతో ఆర్టీసీ ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఎన్యూమరేటర్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా పలు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా బస్సులు బుక్ చేసుకున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్‌కు 100, ఖమ్మంకు 120, రంగారెడ్డికి 120, నిజామాబాద్‌కు 350, కరీంనగర్ జిల్లాకు 250 చొప్పున బస్సులను కేటాయించారు.
ప్రత్యేక రైళ్లేవీ?
సాధారణంగా ఒకేసారి భారీ సంఖ్యలో ప్రజలు ఊళ్లబాట పడితే ప్రత్యేక రైళ్లు నడపటం కద్దు. కానీ సమగ్ర సర్వే సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఒక్క ప్రత్యేక రైలు కూడా నడపలేదు. ‘‘ఒక ప్రాంతానికి కాకుండా ప్రజలు వారివారి సొంతూళ్లకు పయనమయ్యారు. అలాంటప్పుడు ఏ ప్రాంతానికని అదనపు రైళ్లు నడుపుతాం. ఇలాంటప్పుడు బస్సులే సౌకర్యంగా ఉంటాయి. పైగా ఈ సర్వే కోసం ప్రజలు ఎక్కువగా బస్సులపైనే ఆధారపడ్డారు. రైళ్లను ఎంచుకున్నవారు తక్కువ. సికింద్రాబాద్ నుంచి నిత్యం 58 వేల మంది అన్‌రిజర్వుడు బోగీల్లో ప్రయాణిస్తుంటారు. ఆదివారం ఈ సంఖ్య 64 వేలు మాత్రమే. అంటే ప్రయాణికుల సంఖ్య పెరిగింది కేవలం 10 శాతం మాత్రమే. వీటిని దృష్టిలో ఉంచుకునే ప్రత్యేక రైళ్లు నడపలేదు’’ అని ఓ రైల్వే సీనియర్ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. కానీ ఈ లెక్కలెలా ఉన్నా ఆది, సోమవారాల్లో సికింద్రాబాద్ స్టేషన్ కిటకిటలాడింది. హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లకు ప్రత్యేక రైళ్లను నడపాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.