సాక్షి, హైదరాబాద్: అత్యుత్తమ ప్రతిభగల ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశానికి పరిమితి ఎత్తివేయబోతున్నారు. ఇందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని రాష్ట్రాల ఉన్నతవిద్యా మండళ్లకు పంపింది. వచ్చే ఏడాది (2024) నుంచి దీన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది.
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సుల విషయంలోనూ ఈ విధానాన్ని అనుసరించాలని ప్రతిపాదించింది. ఇటీవల విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లోనూ ఏఐసీటీఈ దీన్ని ప్రస్తావించింది. ముసాయిదా ప్రతిని సమీక్షించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. యూనివర్సిటీల వీసీలు, మండలి ఉన్నతాధికారులు ఈ అంశంపై చర్చించేందుకు సమావేశమవుతున్నారు.
రాష్ట్రంలో పది కాలేజీలకు అవకాశం..
రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా అటానమస్ కాలేజీలను కలుపుకొని 100 కాలేజీలకు ‘న్యాక్’అక్రెడిటేషన్ ఉంది. వాటిల్లో అత్యుత్తమ ప్రమాణాలు కనబరిచే కాలేజీల జాబితాను గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం ఎక్స్‌పర్ట్ విజిటింగ్ కమిటీ (ఈవీసీ)ని మండలి నియమించాల్సి ఉంటుంది. ఇందులో ఏఐసీటీఈ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీల సభ్యులు ఉంటారు.
విద్యార్థుల హాజరు శాతం, ఏటా కౌన్సెలింగ్‌లో ఏ కాలేజీకి ఎందరు దరఖాస్తు చేస్తున్నారు? ఏయే కోర్సులను డిమాండ్ చేస్తున్నారు? ఆయా కోర్సుల్లో చేరేవారి పురోగతి ఎలా ఉంది? కాలేజీలో చేరిన విద్యార్థుల మార్కుల వివరాలను పరిశీలించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఉపాధి పొందిన తీరు, లభించిన వార్షిక వేతనం వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది.
ఇలా రాష్ట్రంలో అన్ని అర్హతలు ఉన్న కాలేజీలు 10 వరకూ ఉంటాయని మండలి వర్గాలు చెబుతున్నాయి. అయితే కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ పెరిగాక సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గాయి. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అనే విషయమై ఏఐసీటీఈ స్పష్టత ఇవ్వలేదు. కాలేజీల్లో ఉండే మౌలికవసతులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పినా, దానిపైనా స్పష్టత ఇవ్వలేదని అధికారులు అంటున్నారు.
సీట్లు పెరిగేనా?
ప్రస్తుతం ప్రతి కాలేజీలోని ఒక్కో బ్రాంచిలో గరిష్టంగా 4 సెక్షన్లనే అనుమతిస్తున్నారు. ఒక్కో సెక్షన్‌లో 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు ఉంటున్నాయి. అయితే నాలుగు సెక్షన్లు ఉన్న కాలేజీలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాటిల్లోనూ ఎక్కువగా సీఎస్‌ఈ, కొత్తగా వచి్చన కంప్యూటర్ కోర్సులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిమితి ఎత్తేసినా కొత్తగా సీట్లు పెరుగుతాయా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. కొత్త విధానం వల్ల యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు తీసుకోవాల్సిన అవసరం ఉండదని అధికారులు అంటున్నారు.
విస్తృత చర్చ చేపడతాం..
ఏఐసీటీఈ ముసా యిదా ప్రతిపై త్వరలో ఉన్నతస్థాయి చర్చ చేపడతాం. ఏఐసీటీఈ ప్రతిపాదనలు రాష్ట్రంలో అమలు చేయగలమా లేదా? అనేది పరిశీలించాల్సి ఉంది. వీసీలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నాక దీనిపై ఏఐసీటీఈకి అభిప్రాయం తెలియజేస్తాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment