సాక్షి, హైదరాబాద్ : త్వరలో భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగుపెట్టే అవకాశం ఉంది. గత నెల ఓ వ్యక్తి ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ సూచనతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సర్వే చేసిన అధికారులు డబుల్ డెక్కర్ బస్సులను నడిపించగలిగే 5 మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. ఈ మార్గాల్లో తొలుత పది డబుల్ డెక్కర్ బస్సులు నడపాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరు వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
దూరప్రాంతాలకు నడిపేలా..
ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు మార్గాలను నిర్మించడంతో డబుల్ డెక్కర్ బస్సులు ఆయా మార్గాల్లో తిరగటం సాధ్యం కాదు. ఇవి అడ్డురాని మార్గాల్లో మాత్రమే తిప్పాల్సి ఉంటుంది. ఇందుకు వాటితో ఇబ్బంది లేని మార్గాలను గుర్తించారు. నగరంలో 2004 వరకు డబుల్ డెక్కర్ బస్సులు తిప్పారు. వాటిని రద్దు చేసే సమయానికి మెహిదీపట్నం–సికింద్రాబాద్, మెహిదీపట్నం–చార్మినార్, సికింద్రాబాద్–చార్మినార్, సికింద్రాబాద్–జూపార్కు మార్గాల్లో నడిపారు.
మళ్లీ పటాన్‌చెరుకు సర్వీసులు..
నగరం నుంచి పటాన్‌చెరు వరకు మళ్లీ నడపాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, కోఠి నుంచి ప్రస్తుతం పటాన్‌చెరుకు సాధారణ బస్సులు మంచి ఆక్యుపెన్సీ రేషియోతో తిరుగుతున్నాయి. ఆ మార్గానికి మంచి డిమాండ్ ఉండటంతో ఆయా మార్గాల్లో వీటిని తిప్పితే బాగుంటుందన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే మేడ్చల్ రూట్‌లో ఉండే సుచిత్ర, కొంపల్లి వరకు మంచి రద్దీతో బస్సులు తిరుగుతున్నాయి. ఆ మార్గంలో కూడా తిప్పితే బాగుంటుందని యోచిస్తున్నారు. పాత బస్తీ నుంచి మెహిదీపట్నం, అక్కడి నుంచే జీడిమెట్ల వైపు కూడా సర్వీసులు తిప్పితే బాగుంటుందని భావిస్తున్నారు. దుర్గం చెరువు వద్దకు కూడా ఓ సర్వీసు ఉండేలా చూడా లని భావిస్తున్నారు. త్వరలో మంత్రి పువ్వాడ, ఎండీ సునీల్‌శర్మలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే కొత్త బస్సుల తయారీకి ఆర్డర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదివరకు నడిచిన డిజైన్‌లోనే కొత్త బస్సులు కూడా రూపొందించాలని నిర్ణయించారు.
త్వరలో సిటీలో డబుల్ డెక్కర్ సర్వీసులు
Published Thu, Dec 3 2020 9:01 AM | Last Updated on Thu, Dec 3 2020 9:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment