సాక్షి, ముంబై: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెస్సార్టీసీ) నష్టాలు వస్తున్న రూట్లలో బస్సు సేవలు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పెరిగిన డీజిల్, విడిభాగాల ధరలు, ఉద్యోగుల జీతాల పెంపు, బకాయిలు చెల్లింపు కారణంగా సంస్థపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. ఫలితంగా భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. చాలా మార్గాల్లో కలెక్షన్లు లేక బస్సులన్నీ ఖాళీగా తిరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. దీంతో సంస్థను గట్టెక్కించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
అందులో భాగంగా ఆదాయం లేని రూట్లలో విడతల వారీగా బస్సు సేవలు రద్దు చేయడం, రాత్రి వేళల్లో ట్రిప్పులు వేసే బస్సుల చార్జీలు కొంతమేర తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో సంస్థ పరిస్థితి కొంత మెరుగుపడవచ్చని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తున్న విషయం తెలిసిందే. 2012లో రూ.292 కోట్లు నష్టాలను చవిచూసింది. 2013లో ఈ నష్టం రూ.428 కోట్లకు చేరుకుంది. ఇది ఏటా పెరుగుతూనే ఉంది. ప్రైవేటు వాహనాల పోటీని ఎదుర్కొనేందుకు ఎమ్మెస్సార్టీసీ చేసిన అనేక ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ వాహనాల కారణంగా ఆర్టీసీకి ప్రయాణికులు దొరకడమే కష్టతరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల కారణంగా 23 వేల ట్రిప్పులకు అసలు ఆదాయమే రావడం లేదు. వీటి కారణంగా ఈ ఏడు ఆర్టీసీకి రూ.330 కోట్ల నష్టం వాటి ల్లింది. సంస్థ నష్టాల బాటలో కూరుకుపోవడానికి ప్రైవేటు వాహనాలే ప్రధాన కారణమని తేలింది. ఈ నేపథ్యంలో రాబడి తక్కువగా నమోదవుతున్న రూట్లలో మెల్లమెల్లగా బస్సులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీ బస్సు కిలోమీటరు దూరం ప్రయాణానికి రూ.25 చొప్పున ఖర్చవుతుంది. అయితే అనేక రూట్లలో కిలోమీటరుకు రూ.తొమ్మిది మాత్రమే ఆదాయం వస్తోంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా బస్సులు నడపాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారి ఒకరు అన్నారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఐదు గంటల మధ్య తిరిగే లగ్జరీ, సెమీ-లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల చార్జీలు ఈ నెల 15 నుంచి కొంతమేర తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతీ స్టేజీకి రూ.6.95 వసూలు చేస్తున్నారు. దీన్ని రూపాయి వరకు తగ్గించనున్నారు. ఇలా ప్రతీ ఆరు కిలోమీటర్లకు రూపాయి చొప్పున చార్జీలు తగ్గనున్నాయి. అయితే ఈ నెల 15, ఆ తరువాత తేదీల ప్రయాణానికి ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగ్గింపు చార్జీల మొత్తాలను ప్రయాణ సమయంలో కండక్టరే బస్సులో చెల్లిస్తాడని అధికారులు వెల్లడించారు.
నష్టాల తగ్గింపుపై దృష్టి
Published Sat, Jan 11 2014 11:26 PM | Last Updated on Mon, Oct 8 2018 6:08 PM
Advertisement
Advertisement