
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి రాకపోకలు సాగించడానికి ఔటర్ రింగ్ రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రవేశ పెట్టింది. ఈ రూట్‌లో రెండు బస్సు సర్వీసులు తిరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలకు కొంత వరకు ఇబ్బందులు తప్పాయి. పదేళ్ల క్రితం ఔటర్ రింగు రోడ్డు అందుబాటులోకి రాగా.. ఇప్పటి వరకు ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించలేదు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి రూట్‌లో రోజూ వేల సంఖ్యలో జనం వివిధ అవసరాల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా ఔటర్ రింగు రోడ్డు మీద వెళ్లే క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తుంది.
శంషాబాద్ నుంచి మెహిదీపట్నం, నానల్‌నగర్ మీదుగా గచ్చిబౌలికి చేరుకునేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఈ మార్గంలో బస్సు సర్వీసులు నడుస్తుండడంతో ప్రయాణికులకు దూర భారం తగ్గిపోయింది. కేవలం గంటలోపు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ రూట్‌లోని గ్రామాలు, వివిధ ప్రాంతాల వారు సైతం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల వారు శంషాబాద్, గచ్చిబౌలి చేరుకోవడానికి పోలీస్ అకాడమీ వద్ద బస్సుల్లో ఎక్కుతున్నారు. ఇటు షాద్‌నగర్ వైపు నుంచి వచ్చే వారు శంషాబాద్ వద్ద బస్సుల్లో ఎక్కి నేరుగా గచ్చిబౌలి చేరుకుంటున్నారు. ప్రతి అరగంటకు ఈ రూట్లో బస్సు సర్వీసు నడుస్తుండడంతో ప్రయాణికులకు వెసులుబాటు కలిగింది. అయితే ఈ బస్సు శంషాబాద్ నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్, పోలీస్ అకాడమీ, నార్సింగి, నానక్‌రామ్‌గూడ మీదుగా ఔటర్ సర్వీసు మార్గంలో గచ్చిబౌలికి రాకపోకలు సాగిస్తుంది. దీంతో ఈ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వారు ఈ బస్సు సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment