
సాక్షి, అమరావతి: స్వగ్రామాల్లో కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకున్నవారంతా మళ్లీ ‘నగర’బాట పట్టారు. వీరందరితో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు 2,057 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక సర్వీసులు తిప్పుతోంది. ఇప్పటికే ఈ ప్రాంతాలకు ఆర్టీసీ రెగ్యులర్‌గా 3 వేల సర్వీసులు నడుపుతోంది. ఇప్పుడు 2,057 సర్వీసులు అదనంగా చేరాయి.
హైదరాబాద్‌కు అత్యధిక సర్వీసులు..
ఆర్టీసీ ఈనెల 19 వరకు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు అత్యధికంగా 954 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఆ తర్వాత బెంగళూరుకు 409, చెన్నైకి 131 ప్రత్యేక సర్వీసులు కేటాయించింది. ఆదివారం(17వ తేదీ) ఒక్క రోజే ఏకంగా 359 సర్వీసులు అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తిప్పనున్నారు. ఇక బెంగళూరుకు 142, చెన్నైకి 51 సర్వీసులు నడుపుతున్నారు.
ప్రైవేటు ట్రావెల్స్‌పై 816 కేసులు నమోదు..
ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ కట్టడి చేయడంతో ఈ ఏడాది ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలంతా తమ సొంతూళ్లలో పండుగ జరుపుకోగలిగారు. ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుందామని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ప్రైవేటు ట్రావెల్స్‌కు రవాణా శాఖ అధికారులు మళ్లీ హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే పర్మిట్ రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. పండుగ నేపథ్యంలో ఇప్పటికే అధిక టికెట్ రేట్లు వసూలు చేసిన ప్రైవేట్ ట్రావెల్స్‌పై అధికారులు 816 కేసులు నమోదు చేశారు.