సాక్షి, హైదరాబాద్: ప్రతి సంవత్సరం కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ ఒక ప్రహసనంగా మారింది. ఏటేటా బడ్జెట్‌లు వస్తూనే ఉన్నాయి. కానీ హైదరాబాద్ ప్లాట్‌ఫాంపైన ఆగడం లేదు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ పడడం లేదు. లక్షలాది మంది భక్తులు, యాత్రికులు సందర్శించుకొనే పుణ్యక్షేత్రాలకు రైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆబాల గోపాలాన్ని అలరించే అయోధ్య బాలరాముడు కొలువైన అయోధ్యకు చేరుకొనేందుకు హైదరాబాద్ నుంచి ఒక్క రైలు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే షిరిడీ, వారణాసి తదితర ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకున్నా అరకొర రైళ్లు వెక్కిరిస్తున్నాయి. సుమారు 10 సంవత్సరాలుగా కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు.
అయోధ్యకు ప్రత్యేక రైళ్లా...
అయోధ్యకు వెళ్లేందుకు రెగ్యులర్ రైళ్లు లేవు. ప్రయాణికులు దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వారణాసి లేదా, దానాపూర్ వరకు చేరుకొని అక్కడి నుంచి మరో ట్రైన్‌లో కానీ, రోడ్డు మార్గంలో కానీ అయోధ్యకు వెళ్లవలసి ఉంటుంది. అలాగే జంటనగరాల మీదుగా వెళ్లే రైళ్లలో గోరఖ్‌పూర్, లక్నో నగరాలకు చేరుకొని అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లాలి. ఇంటిల్లిపాది కలిసి వెళ్లాలంటే ఇది ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణం. పైగా ఆర్ధికంగా కూడా భారమే. ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రయాణికులు ప్రతి రోజు రాకపోకలు సాగించే విధంగా సికింద్రాబాద్–అయోధ్య మధ్య కొత్తగా రైళ్లను ప్రవేశపెట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వరకు ఒకే ఒక్క రెగ్యులర్ రైలు నడుస్తోంది. ఈ ట్రైన్‌లో యూపీ, బీహార్, తదితర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వలస కార్మికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారణాసి వరకు భక్తులు కూడా వెళ్తారు. కానీ ప్రయాణికుల డిమాండ్ కారణంగా రిజర్వేషన్ లభించడం కష్టం. అయోధ్యకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న ట్రైన్ కూడా ఇదొక్కటే. బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసినప్పటి నుంచి ఈ ట్రైన్‌కు ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు ప్రస్తుతం రైల్వేశాఖ నియోజకవర్గాల వారీగా ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లలో వెళ్లాలంటే ఆధ్యాత్మిక సంస్థల్లో నమోదు చేసుకొన్న వాళ్లకు మాత్రమే అవకాశం లభిస్తుంది.పైగా ఫిబ్రవరి నెలాఖరు వరకే ఈ రైళ్లు పరిమితం.ఆ తరువాత అయోధ్య టూర్‌కు ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలే శరణ్యం. ఈ పర్యాటక ప్యాకేజీలు వారం నుంచి 10 రోజుల వరకు ఉంటాయి.ఇది ఆర్ధికంగా భారమే కాకుండా కేవలం అయోధ్య వరకే వెళ్లి రావాలనుకొనేవాళ్లకు సాధ్యం కాదు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ తరహాలో అయోధ్య ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
వారణాసికి ఉన్నది ఒక్కటే...
కోట్లాదిమంది భక్తులు సందర్శించే మరో అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి0. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి దేశవ్యాప్తంగా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. వారణాసికి వెళ్లాలన్నా ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు వెళ్లే రైలే దిక్కు. ఈ రైల్లో ప్రతి రోజు 180 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంటుంది.
షిరిడీకి ఉన్నది ఒక్కటే...
లక్షలాది మంది భక్తులు సందర్శించే షిరిడీకి సైతం రైళ్ల కొరత వెంటాడుతోంది. అజంతా ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉంది. కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా సాయినగర్ వరకు మరో రైలు రాకపోకలు సాగిస్తుంది. కానీ ఈ ట్రైన్ కాకినాడలోనే 100 శాతం ఆక్యుపెన్సీతో బయలుదేరుతుంది. హైదరాబాద్‌లో హాల్టింగ్ సదుపాయం ఉన్నా రిజర్వేషన్‌లు లభించవు. దీంతో నగరవాసులు ఒక్క అజంతాపైన ఆధారపడవలసి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment