మల్లాపూర్ చౌరస్తాలో కాషాయ వస్త్రధారణలతో బైక్ ర్యాలీ
ఎన్నో ఏళ్లుగా యావత్ ప్రపంచం మహోద్వేగభరితంగా ఎదురు చూస్తున్న అపురూప క్షణాలు రానేవచ్చాయి. మరికొద్ది గంటల్లో అయోధ్యలో కొలువుదీరనున్న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భాగ్యనగర వాసుల చూపంతా అయోధ్య వైపే నిలిపింది. మహా నగరం శ్రీరామ నామస్మరణతో తాదాత్మ్యత పొందనుంది. ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సోమవారం అయోధ్యలో జరగనున్న వేడుకలను దృష్టిలో ఉంచుకొని నగరవాసులు తమ ఇళ్లు, వాకిళ్లను అందంగా అలంకరిస్తున్నారు.ముంగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్‌ల సంక్షేమ సంఘాలు సైతం శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వేడుకలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాయి.
ముస్తాబైన ఆలయాలు..
నగరంలోని అన్ని ఆలయాలను అందంగా అలంకరించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద ప్రత్యేక ప్రదర్శనల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తాడ్‌బండ్, కర్మన్‌ఘాట్, సీతాఫల్‌మండి తదితర ప్రాంతాల్లోని ఆంజనేయస్వామి ఆలయాలు, శ్రీరాముడి మందిరాలను, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, హిమాయత్‌నగర్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణాలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. నగరంలో అడుగడుగునా ఆధ్యాత్మికత, భక్తిభావం ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీధుల్లో, ప్రధాన కూడళ్లలో కాషాయ జెండాలతో తోరణాలు కట్టారు. మరోవైపు శ్రీరాముడి నిలువెత్తు భారీ కటౌట్‌లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. విశ్వహిందూపరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
భారీ స్క్రీన్‌ల ఏర్పాటు..
బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్షణాలను వీక్షించేందుకు నగరంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ‘జై శ్రీరామ్’ అని నినదిస్తూ వేడుకల్లో పాల్గొనేలా ఇంటింటికీ కాషాయ జెండాల పంపిణీ చేపట్టారు. సాయంత్రం ఆలయాలు, కమ్యూనిటీహాళ్లు తదితర ప్రాంతాల్లో భక్తి కార్యక్రమాలను, భజనలను ఏర్పాటు చేయనున్నారు. ఇళ్లను అందంగా అలంకరించుకోవడంతో పాటు సాయంత్రం వేళ 5 ప్రమిదల్లో దీపాలను వెలిగించాలని సూచించారు. అయోధ్యలో వేడుకల సందర్భంగా నగర మార్కెట్‌లో శ్రీరాముడి చిత్రపటాల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఉస్మాన్‌గంజ్, కోఠి, బేగంబజార్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో చిత్రపటాలను విక్రయించే షాపుల వద్ద సందడి నెలకొంది. పూలు, పూజా ద్రవ్యాలకు సైతం డిమాండ్ ఏర్పడింది. వివిధ సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, భారీ ర్యాలీలను సైతం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
అపార్ట్‌మెంట్లలో రాముడి భారీ కటౌట్లు
నివాసిత సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు శ్రీరామ నామాన్ని జపిస్తున్నాయి. అపార్ట్‌మెంట్లలో రాముడి భారీ కటౌట్లు, పూల దండలు, ప్రతిమలు, శ్రీ రామ్ జెండాలు, రంగురంగుల లైట్లతో అలంకరించారు. నల్లగడ్లంలోని అపర్ణా సైబర్ కమ్యూనిటీ, బంజారాహిల్స్ రోడ్ నంబరు–5లోని ట్రెండ్‌సెట్ సుమాంజలి, నానక్‌రాంగూడలోని మై హోమ్ విహంగ, కొండాపూర్‌లోని అపర్ణా టవర్స్‌లో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటి ఉదయం 11 గంటల నుంచి అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఫెడరేషన్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్ సైబరాబాద్ (ఎఫ్‌జీసీసీ)లో అయోధ్యలోని రామలీలా మందిరం నమూనాలను రూపొందిచారు. రథయాత్రలు, అన్నదానం, రామ భజనలు, విష్ణు సహస్రనామాలు వంటి ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. సుందరకాండ పారాయణం, ప్రత్యేక రంగోలీ, దీపోత్సవం వంటి ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment