red beacon lights
-
వాహనాలపై ఎరుపు, నీలం లైట్లు ఎవరు వాడాలో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: అద్దాలపై పరిమితికి మించిన రంగుతో కూడిన ఫిల్మ్ వేసుకుని సంచరిస్తున్న వాహనాలే కాదు... టాప్‌పై ఎరుపు, నీలి రంగు లైట్లు (బుగ్గలు), సైరన్లు (Syren) పెట్టుకుని సంచరిస్తున్న వాహనాలకు కొదవే లేదు. వీటి వినియోగం కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు... భద్రత పరంగానే పెను సవాలే. అయినా మూడు కమిషనరేట్లకు చెందిన ట్రాఫిక్ విభాగం (Traffic) అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తొలుత తేలికపాటి వాహనాలైన కార్లు తదితరాల టాపులపై ఈ బుగ్గలు పెట్టుకోవడానికి ఎవరు అనర్హులనే దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికైనా దూసుకెళ్లే అవకాశం... సాధారణంగా ఈ తరహా లైట్లు, సైరన్‌తో వచ్చే వాహనాలను చూసి సామాన్యులే కాదు పోలీసులు కూడా అప్రమత్తం అవుతారు. సాధారణ వాహనచోదకులు దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తే... వాటిని ఆపడానికి విధుల్లో ఉన్న పోలీసులు సైతం సాధారణంగా ప్రయత్నించరు. ఆయా వాహనాల్లో ప్రముఖులు ఉంటారనే భావనే దీనికి ప్రధాన కారణం. దీనిని ఆసరాగా చేసుకునే కొందరు అనర్హులు, ఆకతాయిలు తమ వాహనాలపై ఈ తరహా లైట్లు పెట్టుకుని సంచరిస్తుంటారు. 2001లో ఢిల్లీలోని పార్లమెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు ఇలాంటి లైట్లు ఉన్న వాహనాలనే వాడారు. ఈ తరహా లైట్లు, సైరన్లు ఉన్న కారణంగానే భద్రతా సిబ్బంది కూడా ఆ వాహనాలను పార్లమెంట్ ఆవరణలోకి రాకుండా అడ్డుకోలేదు. వినియోగిస్తున్న వారిలో 90 శాతం అనర్హులే... ఈ తరహా లైట్లు, సైరన్లు వినియోగిస్తున్న వారిలో 90 శాతం అనర్హులే ఉంటున్నారు. సెంట్రల్ మోటారు వెహికిల్ రూల్స్–1989 ప్రకారం కేవలం 43 మంది వీవీఐపీలు మాత్రమే వీటిని వినియోగించాలి. అయితే అసెంబ్లీ, సెక్రటేరియేట్‌తో పాటు కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు తమ వాహనాలపై ఎరుపు, నీలం లైట్లు (Blue Lights) ఏర్పాటు చేసుకుంటున్నారు. పలువురు వీఐపీలు సైతం ఈ లైట్లు, సైరన్లను అక్రమంగా వినియోగిస్తున్నారు. స్పెషల్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులకు కూడా తమ కార్లపై ఈ తరహా లైట్లు పెట్టుకునే అవకాశం లేదు. అయినప్పటికీ వివిధ హోదాలకు చెందిన వాళ్లు వీటిని వినియోగిస్తున్నారు. అధికారుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఈ లైట్లు, సైరన్ కలిగి ఉండటం హోదాగా భావించే వాళ్లు అనేక మంది ఉంటున్నారు. ఎవరు వినియోగించాలంటే... ఫ్లాషర్తో కూడిన రెడ్‌లైట్:రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధాని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్‌సభ స్పీకర్, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ప్లానింగ్ కమిషనర్ ఉపాధ్యక్షుడు, మాజీ ప్రధానులు, ఉభయసభల ప్రతిపక్ష నేతలు, సుప్రీం కోర్టు జడ్జిలు (వీరు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఈ లైట్‌తో తిరగవచ్చు.)ఫ్లాషర్ లేని రెడ్‌లైట్: చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కాగ్, ఉభయసభల ఉపాధ్యక్షులు, కేంద్ర సహాయ మంత్రులు, ప్లానింగ్ కమిషన్ సభ్యులు, అటార్నీ జనరల్, క్యాబినెట్ సెక్రెటరీ, త్రివిధ దళాల అధిపతులు, కేంద్ర డిప్యూటీ మంత్రులు, క్యాట్ చైర్మన్, మైనార్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల అధ్యక్షులు, యూపీఎస్సీ చైర్మన్ (వీరు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఈ లైట్‌తో తిరగవచ్చు.)చదవండి: కుంభమేళాలో ప్రత్యేక అట్రాక్షన్‌గా అయోధ్యరాముని రెప్లికా కేవలం రెడ్‌లైట్: రాష్ట్ర గవర్నర్, గవర్నర్ ఎస్కార్ట్ వాహనాలు, సీఎస్, డీజీపీ, సీజే ఆఫ్ తెలంగాణ, హైకోర్టు జడ్జిలు, లోకాయుక్త, టీజీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్, క్యాట్ వైస్ చైర్మన్.బ్లూ లైట్... ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అసెంబ్లీ స్పీకర్– డిప్యూటీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, ఉపాధ్యక్షుడు వాహనంలో సదరు ప్రముఖులు ఉన్నప్పుడు మాత్రమే లైట్ వినియోగించాలని, లేని పక్షంలో దానిపై నల్ల కవర్ తప్పనిసరిగా వేయాలి. -
బుగ్గ కార్ల బెడద!
సంపాదకీయం ప్రజాస్వామ్యం రాను రాను దేవతా వస్త్రంగా మారుతోంది. అది ఉన్నదని చాలా మంది చెబుతున్నా, అలాగని మనకు మనం సర్దిచెప్పుకుంటున్నా ఆ విశ్వాసాన్ని కాలరాసేలా నిత్యం ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నగరంలో రోడ్డెక్కే సామాన్యులకు తరచుగా తారసపడే బుగ్గకార్లు ఆ బాపతే. అధికారాన్ని ప్రదర్శించేందుకు, దర్పాన్ని వెలగబెట్టేందుకు ఇన్నాళ్లూ ‘అత్యంత ప్రముఖుల’కు, పలుకుబడిగల ప్రైవేటు వ్యక్తులకు అక్కరకొస్తున్న ఈ బుగ్గ కార్లను ఎవరుబడితేవారు వినియోగించడానికి ఇకపై వీల్లేదని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు మాత్రమే వీటిని ఉపయోగించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. ప్రజా రవాణా వ్యవస్థ దారుణ వైఫల్యం కారణంగా అసలే మన నగరాలన్నీ వాహనాలతో నిండి కీకారణ్యాలుగా మారాయి. ఈ కీకారణ్యాన్ని మరింత అధ్వాన్నం చేసేలా ఎర్రబుగ్గ కార్లు పరుగులెడుతుంటాయి. ఇలాంటి కార్లు వెదజల్లే కాంతులవల్ల పాదచారులకూ, వాహనదారులకూ మానసిక రుగ్మతలు ఏర్పడతాయని వైద్య నిపుణులు చెబుతారు. వాహనాల నెత్తిన ఎర్ర దీపమో, నీలి దీపమో కనబడేసరికి పోలీసులు ఆపడానికైనా, తనిఖీ చేయడానికైనా జంకుతారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా జరిమానా వేయడానికి సందేహిస్తారు. సరిగ్గా ఈ కారణాలతోనే ఎవరికి వారు తమ కార్లపై లైట్లు వెలిగిస్తున్నారు. చుట్టూ ఉన్నవారు తమ వైభోగాన్ని గమనించి ఆశ్చర్యపోవాలని, తాము సాధించిన ఉన్నతిని కీర్తించాలని ఇలాంటివారు కోరుకుంటున్నారు. బుగ్గకార్ల మోజు వలసపాలకులనుంచి మనకొచ్చిన జాడ్యం. సామాన్య ప్రజలకు తాము భిన్నమైనవారమనీ, చాలా ఉన్నతులమనీ చెప్పడానికి వారు ఈ కార్లను ఉపయోగించేవారు. ఈ మోజు ఇప్పుడు విదేశాల్లో దాదాపు ఎక్కడా కనబడదు. అక్కడ ఎమర్జెన్సీ సర్వీసులైన అంబులెన్స్‌లకూ, అగ్నిమాపక దళానికి మాత్రమే ఇలాంటి లైట్లను ఉపయోగిస్తారు. శాంతిభద్రతల నిర్వహణలో ఉండే పోలీసులకూ, సైనిక దళాల అధికారులకూ ఇలాంటి కార్ల వాడకానికి అనుమతి ఉంటుంది. కానీ, ఇక్కడంతా అరాచకం. ఎన్నడో 2002లో ఇలాంటి కార్ల వాడకంపై కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. అటుతర్వాత 2005లో దాన్ని సవరించింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ జారీచేసిన ఆ నోటిఫికేషన్లలోనూ జాబితా పెద్దగానే ఉంది. రాష్ట్రపతి మొదలుకొని కేంద్ర ఉప మంత్రుల వరకూ... ప్రణాళికా సంఘం సభ్యులు, కేబినెట్ కార్యదర్శి, త్రివిధ దళాధిపతులు, లెఫ్టినెంట్ జనరల్ లేదా తత్సమాన హోదా ఉన్నవారు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, యూపీఎస్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్ చైర్మన్లు ఇలాంటి కార్లను వినియోగించ వచ్చునని ఆ జాబితాలో పేర్కొన్నారు. ఈ కార్లలో ప్రముఖులు వెళ్లని సందర్భాల్లో లైటు కనబడకుండా నల్ల కవర్‌తో కప్పి ఉంచాలని కూడా సూచించారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యులనుకున్న వారితో అక్కడి ప్రభుత్వాలు జాబితాలు విడుదల చేయొచ్చని కూడా తెలిపారు. కనుక చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత జాబితాలను విడుదలచేశాయి. క్రమేపీ ఈ జాబితాలతో సంబంధంలేకుండా చాలా మంది యధేచ్ఛగా బుగ్గకార్లను వినియోగిస్తున్నారు. అలాంటి కార్లలో వెళ్లేవారికి ఆ అర్హత లేదని తెలిసినా పోలీసులు ‘ఎందుకొచ్చిన గొడవలెమ్మ’ని చూసీచూడనట్టు ఊరుకుంటున్నారు. తమ ముందు గత ఫిబ్రవరిలో విచారణకొచ్చిన వ్యాజ్యం సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలిసారి ఈ బుగ్గకార్లపై వ్యాఖ్యానించారు. ‘వీటి తొలగింపు మానుంచే ప్రారంభం కావాలి... ముందుగా మా వాహనాలకు ఎర్రబుగ్గలను తొలగించండి’ అంటూ న్యాయమూర్తులు అధికారులకు సూచించారు. అటు తర్వాత ఏప్రిల్ నెలలో తదుపరి విచారణ జరిగిన సమయానికి కూడా మార్పేమీ లేదని గ్రహించి, నిబంధనలకు విరుద్ధంగా ఎర్రబుగ్గ కార్లను వినియోగించేవారికి భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. కొందరు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి కార్లలో తిరుగుతున్నారని అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పినప్పుడు వారిపైనా చర్యలు తీసుకోండని ఆదేశించారు. ఇదే వ్యాజ్యం ఆగస్టులో మరోసారి తమ ముందుకొచ్చినప్పుడు కూడా మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చూశారు. ఇంకో నాలుగు వారాల గడువునివ్వాలని కోరితే నిరాకరించారు. వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయినా ఫలితం లేకపోయిందని గ్రహించి తాజా ఆదేశాలిచ్చారు. ఇక మూడు నెలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎర్రబుగ్గ కార్లు వాడే అర్హత ఉన్నవారి జాబితాలను రూపొందించాల్సి ఉంటుంది. తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఎన్నదగినవి. బుగ్గ కార్ల వినియోగం రాచరికాన్ని గుర్తుతెచ్చేదిగా ఉన్నదని, గణతంత్ర వ్యవస్థకు ఇది తగదని వారన్నారు. అలా అంటూనే అర్హుల జాబితాను తగ్గించడం తప్ప వారు దాన్ని పూర్తిగా రద్దుచేయలేకపోయారు. అత్యంత ప్రముఖులకు నిత్యమూ కట్టుదిట్టమైన భద్రత ఎటూ ఉంటుంది. అందుకోసం పెద్ద కాన్వాయ్ ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి బుగ్గకారు వాడటంవల్ల వారికి అదనంగా వచ్చే భద్రతేమీ ఉండదు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో, అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి ఆ పదవుల నిర్వహణలో బుగ్గకార్లు అదనంగా తోడ్పడేది ఏమీ ఉండదు. అలాంటప్పుడు వాటి అవసరమేమిటన్న సందేహం ఎవరికైనా వస్తుంది. నిరాడంబరమైన జీవనం, నిండైన ఆలోచనలే జనహృదయాలను సూటిగా తాకుతాయి. అలాంటి నేతలపై గౌరవ మర్యాదలను పెంచుతాయి. బుగ్గకార్లతో వాటిని సాధించాలని చూడటం వృథా ప్రయాసే. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశానుసారం జాబితాలను రూపొందించే టపుడు పాలకులు దీన్ని దృష్టిలో పెట్టుకోవడం ఉత్తమం.