బుగ్గ కార్ల బెడద! | red beacon lights problem! | Sakshi
Sakshi News home page

బుగ్గ కార్ల బెడద!

Published Wed, Dec 11 2013 11:43 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

red beacon lights problem!

సంపాదకీయం
 
ప్రజాస్వామ్యం రాను రాను దేవతా వస్త్రంగా మారుతోంది. అది ఉన్నదని చాలా మంది చెబుతున్నా, అలాగని మనకు మనం సర్దిచెప్పుకుంటున్నా ఆ విశ్వాసాన్ని కాలరాసేలా నిత్యం ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నగరంలో రోడ్డెక్కే సామాన్యులకు తరచుగా తారసపడే బుగ్గకార్లు ఆ బాపతే. అధికారాన్ని ప్రదర్శించేందుకు, దర్పాన్ని వెలగబెట్టేందుకు ఇన్నాళ్లూ ‘అత్యంత ప్రముఖుల’కు, పలుకుబడిగల ప్రైవేటు వ్యక్తులకు అక్కరకొస్తున్న ఈ బుగ్గ కార్లను ఎవరుబడితేవారు వినియోగించడానికి ఇకపై వీల్లేదని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు మాత్రమే వీటిని ఉపయోగించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. ప్రజా రవాణా వ్యవస్థ దారుణ వైఫల్యం కారణంగా అసలే మన నగరాలన్నీ వాహనాలతో నిండి కీకారణ్యాలుగా మారాయి.
 
 

ఈ కీకారణ్యాన్ని మరింత అధ్వాన్నం చేసేలా ఎర్రబుగ్గ కార్లు పరుగులెడుతుంటాయి. ఇలాంటి కార్లు వెదజల్లే కాంతులవల్ల పాదచారులకూ, వాహనదారులకూ మానసిక రుగ్మతలు ఏర్పడతాయని వైద్య నిపుణులు చెబుతారు. వాహనాల నెత్తిన ఎర్ర దీపమో, నీలి దీపమో కనబడేసరికి పోలీసులు ఆపడానికైనా, తనిఖీ చేయడానికైనా జంకుతారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా జరిమానా వేయడానికి సందేహిస్తారు. సరిగ్గా ఈ కారణాలతోనే ఎవరికి వారు తమ కార్లపై లైట్లు వెలిగిస్తున్నారు. చుట్టూ ఉన్నవారు తమ వైభోగాన్ని గమనించి ఆశ్చర్యపోవాలని, తాము సాధించిన ఉన్నతిని కీర్తించాలని ఇలాంటివారు కోరుకుంటున్నారు.  
  బుగ్గకార్ల మోజు వలసపాలకులనుంచి మనకొచ్చిన జాడ్యం.
 
 

సామాన్య ప్రజలకు తాము భిన్నమైనవారమనీ, చాలా ఉన్నతులమనీ చెప్పడానికి వారు ఈ కార్లను ఉపయోగించేవారు. ఈ మోజు ఇప్పుడు విదేశాల్లో దాదాపు ఎక్కడా కనబడదు. అక్కడ ఎమర్జెన్సీ సర్వీసులైన అంబులెన్స్‌లకూ, అగ్నిమాపక దళానికి మాత్రమే ఇలాంటి లైట్లను ఉపయోగిస్తారు. శాంతిభద్రతల నిర్వహణలో ఉండే పోలీసులకూ, సైనిక దళాల అధికారులకూ ఇలాంటి కార్ల వాడకానికి అనుమతి ఉంటుంది. కానీ, ఇక్కడంతా అరాచకం. ఎన్నడో 2002లో ఇలాంటి కార్ల వాడకంపై కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. అటుతర్వాత 2005లో దాన్ని సవరించింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ జారీచేసిన ఆ నోటిఫికేషన్లలోనూ జాబితా పెద్దగానే ఉంది. రాష్ట్రపతి మొదలుకొని కేంద్ర ఉప మంత్రుల వరకూ... ప్రణాళికా సంఘం సభ్యులు, కేబినెట్ కార్యదర్శి, త్రివిధ దళాధిపతులు, లెఫ్టినెంట్ జనరల్ లేదా తత్సమాన హోదా ఉన్నవారు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, యూపీఎస్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్ చైర్మన్లు ఇలాంటి కార్లను వినియోగించ వచ్చునని ఆ జాబితాలో పేర్కొన్నారు. ఈ కార్లలో ప్రముఖులు వెళ్లని సందర్భాల్లో లైటు కనబడకుండా నల్ల కవర్‌తో కప్పి ఉంచాలని కూడా సూచించారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యులనుకున్న వారితో అక్కడి ప్రభుత్వాలు జాబితాలు విడుదల చేయొచ్చని కూడా తెలిపారు.
 
 కనుక చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత జాబితాలను విడుదలచేశాయి. క్రమేపీ ఈ జాబితాలతో సంబంధంలేకుండా చాలా మంది యధేచ్ఛగా బుగ్గకార్లను వినియోగిస్తున్నారు. అలాంటి కార్లలో వెళ్లేవారికి ఆ అర్హత లేదని తెలిసినా పోలీసులు ‘ఎందుకొచ్చిన గొడవలెమ్మ’ని చూసీచూడనట్టు ఊరుకుంటున్నారు.
 
 తమ ముందు గత ఫిబ్రవరిలో విచారణకొచ్చిన వ్యాజ్యం సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలిసారి ఈ బుగ్గకార్లపై వ్యాఖ్యానించారు.
 
 ‘వీటి తొలగింపు మానుంచే ప్రారంభం కావాలి... ముందుగా మా వాహనాలకు ఎర్రబుగ్గలను తొలగించండి’ అంటూ న్యాయమూర్తులు అధికారులకు సూచించారు. అటు తర్వాత ఏప్రిల్ నెలలో తదుపరి విచారణ జరిగిన  సమయానికి కూడా మార్పేమీ లేదని గ్రహించి, నిబంధనలకు విరుద్ధంగా ఎర్రబుగ్గ కార్లను వినియోగించేవారికి భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. కొందరు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి కార్లలో తిరుగుతున్నారని అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పినప్పుడు వారిపైనా చర్యలు తీసుకోండని ఆదేశించారు. ఇదే వ్యాజ్యం ఆగస్టులో మరోసారి తమ ముందుకొచ్చినప్పుడు కూడా మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చూశారు. ఇంకో నాలుగు వారాల గడువునివ్వాలని కోరితే నిరాకరించారు.
 
 వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయినా ఫలితం లేకపోయిందని గ్రహించి తాజా ఆదేశాలిచ్చారు. ఇక మూడు నెలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎర్రబుగ్గ కార్లు వాడే అర్హత ఉన్నవారి జాబితాలను రూపొందించాల్సి ఉంటుంది.
 
 తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఎన్నదగినవి. బుగ్గ కార్ల వినియోగం రాచరికాన్ని గుర్తుతెచ్చేదిగా ఉన్నదని, గణతంత్ర వ్యవస్థకు ఇది తగదని వారన్నారు. అలా అంటూనే అర్హుల జాబితాను తగ్గించడం తప్ప వారు దాన్ని పూర్తిగా రద్దుచేయలేకపోయారు. అత్యంత ప్రముఖులకు నిత్యమూ కట్టుదిట్టమైన భద్రత ఎటూ ఉంటుంది. అందుకోసం పెద్ద కాన్వాయ్ ఎప్పుడూ అనుసరిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి బుగ్గకారు వాడటంవల్ల వారికి అదనంగా వచ్చే భద్రతేమీ ఉండదు.
 
 

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో, అత్యున్నత పదవుల్లో ఉన్నవారికి ఆ పదవుల నిర్వహణలో బుగ్గకార్లు అదనంగా తోడ్పడేది ఏమీ ఉండదు. అలాంటప్పుడు వాటి అవసరమేమిటన్న సందేహం ఎవరికైనా వస్తుంది. నిరాడంబరమైన జీవనం, నిండైన ఆలోచనలే జనహృదయాలను సూటిగా తాకుతాయి. అలాంటి నేతలపై గౌరవ మర్యాదలను పెంచుతాయి. బుగ్గకార్లతో వాటిని సాధించాలని చూడటం వృథా ప్రయాసే. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశానుసారం జాబితాలను రూపొందించే టపుడు పాలకులు దీన్ని దృష్టిలో పెట్టుకోవడం ఉత్తమం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement