సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సొంతంగా బస్సులను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రయాణికుల అవసరాల నిమిత్తం అద్దె బస్సులను లీజుకు తీసుకోవాల్సివస్తోందని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. అద్దెకు బస్సులను తీసుకోవడం ఏనాటి నుంచో ఉందని, ఈ నిర్ణయం వెనుక ఆర్టీసీ కార్మికులను దెబ్బతీయాలనే కుట్ర ఏమీలేదని ఆ సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో తెలిపారు. ఆర్టీసీ 1,035 అద్దె బస్సులను తీసుకునేందుకు టెండర్ ఆహ్వానించడాన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ్ ప్రధాన కార్యదర్శి సవాల్ చేస్తూ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఆర్టీసీ సంస్థ వాదనలతో సునీల్ శర్మ కౌంటర్ పిటిషన్ వేశారు.
గత నెల 14న పత్రికల్లో అద్దె బస్సుల కోసం టెండర్‌ను ప్రచురించామని, అదే నెల 21న టెండర్ల దాఖలుకు ఆఖరు తేదీగా నిర్ణయించి అదే రోజు టెండర్లను తెరిచి ఇప్పటి వరకూ 287 మంది బస్సు యజమానులకు ఖరారు పత్రాలను అధికారికంగా ఇచ్చామన్నా రు. ఆర్టీసీలో 10,460 బస్సులుంటే అందులో అద్దె బస్సులు 2,103 మాత్రమేనని వివరించారు. మొత్తం బస్సుల్లో అద్దె బస్సులు 21.26 శాతమేనని, వాస్తవానికి 20 శాతం నుంచి 25% వరకూ అద్దెబస్సులు ఉండేందుకు వీలుగా 2013లోనే ఆర్టీసీ బోర్డు తీర్మానం చేసిందని చెప్పారు. తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యం లో ప్రయాణికుల సౌకర్యం కోసం అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయించామని దీనికితోడు టెం డర్ల ప్రక్రియ ఖరారు అయినందున పిల్‌ను తోసిపుచ్చాలని కోరారు. ఈ వ్యాజ్యాన్ని ఈ నెల 18న హైకోర్టు విచారణ కొనసాగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment