హైకోర్టు జోక్యంతో మార్గం సుగమం..
9,500 మందికి రూ.200 కోట్ల చెల్లింపు
రిటైర్మెంట్ బెనిఫిట్లకూ మోక్షం
రుణాల కోసం కొత్తగా 3,000 దరఖాస్తులు
హైకోర్టు జోక్యం ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం నింపింది. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ‘ఉద్యోగుల సొంత నిధి’ నుంచి రుణాలందుకుంటున్నారు. పిల్లల చదువులు, సొంతింటిని సమకూర్చుకోవ టం, ఆస్పత్రి ఖర్చులు, ఇతర అవసరాలకు రుణం పొందుతున్నా రు.. కేవలం 40 రోజుల వ్యవధిలో ఏకంగా 9,500 మంది రూ.200 కోట్ల వరకు రుణాల రూపంలో పొందారు.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్) పేరుకుపోయిన రుణ దరఖాస్తులను క్లియర్ చేసింది. రూ.355 కోట్ల మేర దరఖాస్తుదారులకు చెల్లింపులు చేసింది. అడపాదడపా స్వల్ప మొత్తం రుణాల రూపంలో ఇవ్వటం తప్ప ఇంత మొత్తంలో చెల్లించడం చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఇటు ఉద్యోగుల ఇంటి అవసరాలకు రుణాలు, పదవీ విరమణ పొందిన వారికి సెటిల్‌మెంట్లు, సీసీఎస్‌లో సభ్యత్వం రద్దు చేసుకున్న వారికి చెల్లింపులతో ఒక్కసారిగా సీసీఎస్ కార్యాలయం సందడిగా మారింది.
హైకోర్టు జోక్యంతో...
ప్రతినెలా ఉద్యోగుల జీతం నుంచి నిర్ధారిత మొత్తం మినహాయించి సీసీఎస్‌లో ఆర్టీసీ డిపాజిట్ చేస్తుంది. ఇలా పోగయ్యే మొత్తం నుంచి ఉద్యోగులకు రుణాలివ్వటం సీసీఎస్ విధి.
⇒ ఉద్యోగుల జీతాల నుంచి ఆ మొత్తాన్ని మినహాయిస్తూ దాన్ని కొన్నేళ్లుగా ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. దీంతో సీసీఎస్ దివాలా దశకు చేరిన విషయం తెలిసిందే. దీంతో సీసీఎస్ పాలకవర్గం కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తోంది.
⇒గతేడాది రూ.200 కోట్ల మొత్తాన్ని సీసీఎస్‌కు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించింది. కానీ, కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లించటంతో సీసీఎస్ పాలకవర్గం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. మిగతా రూ.150 కోట్లను వెంటనే చెల్లించాలంటూ ఏప్రిల్‌లో కోర్డు ఆర్టీసీని ఆదేశించింది. దీంతో ఆ నెల చివరలో ఆ మొత్తాన్ని ఆర్టీసీ జమ చేసింది.
⇒ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు నుంచి సీసీఎస్ మరో రూ.150 కోట్లు రుణం పొందింది. ఈ రూ.300 కోట్లను ఉద్యోగులకు రుణాలుగా, రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్లకు వినియోగించాలని నిర్ణయించింది.
9,500 దరఖాస్తులు
ఏప్రిల్ చివరి నాటికి సీసీఎస్‌లో రుణాల కోసం 6,500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ రెండున్నరేళ్లుగా పేరుకుపోయినవే. నిధులు సమకూరాయని తెలియగానే మరో 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వెరసి 9,500 దరఖాస్తుదారులకు రుణాల కింద రూ.200 కోట్లు సీసీఎస్ అందజేసింది. అప్పటివరకు వారి జీతాల నుంచి కోత పెట్టి సీసీఎస్‌లో జమ చేసిన మొత్తాన్ని రిటైర్మెంట్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.
కానీ నిధులు లేక ఏడాదిన్నరగా దాదాపు 1,200 మందికి చెల్లించలేదు. ఇప్పుడు వారికి కూడా సెటిల్ చేశారు. సీసీఎస్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటంతో అందులో నుంచి తమ సభ్యత్వాన్ని రద్దు చేసి సెటిల్ చేయాల్సిందిగా మరో 3,200 మంది దరఖాస్తులు కూడా పెండింగ్‌లో ఉంటూ వచ్చాయి. వారందరికీ చెల్లించేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఆర్టీసీ జమ చేసిన నెలవారీ మొత్తం రూ.55 కోట్లను కూడా ఇందుకు వినియోగించారు. ఇక సీసీఎస్‌లో డిపాజిట్లు పెట్టిన రిటైర్డ్ ఉద్యోగులకు 9 నెలలుగా పేరుకుపోయిన వడ్డీ మొత్తం మరో రూ.9 కోట్లు కూడా చెల్లించారు. కేవలం 40 రోజుల వ్యవధిలో రూ.355 కోట్లు చెల్లించారు.
ఇంకా రావాల్సినవి రూ.980 కోట్లు
రుణాలు ఇస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు దరఖాస్తులు సమర్పించారు. పోగైన నిధులు రూ.355 కోట్లు ఖర్చయిపోవటంతో, ఇప్పుడు కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో 3 వేలు పెండింగ్ జాబితాలోకి చేరాయి. ఇంకా కొత్త దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఆర్టీసీ ప్రతినెలా సీసీఎస్‌కు చెల్లించే మొత్తం రూ.20 కోట్లు మాత్రమే. అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలంటే ఈ మొత్తం సరిపోదు.
సీసీఎస్‌కు ఆర్టీసీ చెల్లించాల్సిన మిగతా బకాయిలు చెల్లిస్తే తప్ప ఇవి క్లియర్ అయ్యే సూచనలు కనిపించటం లేదు. ఇప్పటికీ, సీసీఎస్‌కు ఆర్టీసీ రూ.570 కోట్ల మొత్తం (అసలు) బకాయి ఉంది. దీనిపై చెల్లించాల్సిన వడ్డీ మరో రూ.410 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వెరసి మరో రూ.980 కోట్ల వరకు ఆర్టీసీ బకాయి ఉన్నట్టు తేలుతోంది. విడతలవారీగానైనా ఈ మొత్తాన్ని చెల్లిస్తేనే మిగతా దరఖాస్తులు క్లియర్ అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment