సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన దానికన్నా ఎక్కువగానే ఆర్టీసీకి చెల్లించిందని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ హైకోర్టుకు నివేదించారు. ఆర్టీసీకి ప్రభుత్వ బకాయిల చెల్లింపులతోపాటు జీహెచ్‌ఎంసీ చేసిన చెల్లింపులపై నివేదిక సమర్పించాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సునీల్‌శర్మ ఈ మేరకు కౌంటర్ దాఖలు చేశారు. 2018– 19 సంవత్సరానికి రాయితీ కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం రూ.644.51 కోట్లుకాగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు లభిస్తున్నప్పటికీ ఆర్టీసీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉందన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో బస్సులను తిప్పడం వల్ల వచ్చిన నష్టాల భర్తీకి రూ.1,786.06 కోట్లను తిరిగి చెల్లించాలని జీహెచ్‌ఎంసీని ఆర్టీసీ కోరిందన్నారు. జీహెచ్‌ఎంసీ 2015–16, 2016– 17కు కలిపి రూ. 336.40 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు. ఆర్టీసీ కోరుతున్న మొత్తాలను చెల్లించే పరిస్థితిలో లేమంటూ జీహెచ్‌ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వంగా పలు తీర్మానాలు పంపిందని వివరించారు. జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి ఆధారంగానే ఎప్పటికప్పుడు చెల్లింపులు ఉంటాయని, వాటిని ఏమాత్రం బకాయిలుగా పరిగణించడానికి వీల్లేదన్నారు. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఏవిధంగానూ రుణపడి లేదన్నారు.
ఇప్పటిదాకా రూ. 78 కోట్ల ఆర్జన...
ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలుపెట్టిన 5–10–2019 నుంచి 30–10– 2019 వరకు సంస్థ రూ. 78 కోట్లు ఆర్జించిందని సునీల్‌శర్మ హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీ సమ్మె గురించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ కార్యదర్శికి తెలియచేశామని ఆయన హైకోర్టుకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment