
సాక్షి, హైదరాబాద్ : సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. మంగళవారం ఉదయం విధులకు హాజరవుతామని కార్మిక సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్మిక సంఘాల ప్రకటనపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఆర్టీసీ జేఏసీ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని సునీల్ శర్మ పేర్కొన్నారు. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి.. ఇప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని అన్నారు. తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని కార్మికులకు సూచించారు.
అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. పరిస్థితులను సమీక్షిస్తామని తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ కార్మికులకు సమ్మె చేయమని చెప్పలేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు సూచించిన ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునేవరకు వేచి చూడాలని కార్మికులకు సూచించారు. ఆ నిర్ణయం ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని.. అప్పటివరకు సంయమనం పాటించాలని కోరారు. కార్మికులు యూనియన్ల మాటలు విని ఇప్పటికే నష్టపోయారు.. ఇక ముందు వారి మాటలు విని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని అన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆర్టీసీ యాజమాన్యం క్షమించదని తెలిపారు.
చదవండి : ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గిన జేఏసీ
Comments
Please login to add a commentAdd a comment