ఆర్టీసీ రూట్‌ మ్యాప్‌! | Telangana Govt Focus On RTC New Route Map | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ రూట్‌ మ్యాప్‌!

Published Wed, Nov 27 2019 2:59 AM | Last Updated on Wed, Nov 27 2019 12:31 PM

Telangana Govt Focus On RTC New Route Map - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 5,100 బస్సులను ప్రైవేటు పర్మిట్లతో తిప్పేందుకు అనుమతించే విషయంలో కేబినెట్‌ ఆమోదం తెలపడంతో మిగతా సగం బస్సులను ఆర్టీసీ పరిధిలో ఎలా నిర్వహించాలన్న అంశాన్ని ఖరారు చేయనుంది. దీనికి సంబంధించి గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ అధీనంలో సగం బస్సులను ఉంచి మిగతా సగం రూట్లను ప్రైవేటు బస్సులు తిప్పుకునేలా వాటి యజ మానులకు స్టేజీ క్యారియర్‌ పర్మిట్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే.

ఉన్నపళంగా ప్రైవేటు పర్మిట్లు జారీ చేయాలా లేక కొంతకాలం ఆగాక ఈ ప్రక్రియ ను చేపట్టాలా అనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయానికి రాలేదు. ఆ ప్రక్రియ ఎలా ఉం డాలనే అంశంపై ఇప్పటికే ఆర్టీసీ–రవాణాశాఖ అధికారులు రూట్‌మ్యాప్‌ తయారు చేశారు. దీనికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేస్తే నోటిఫికేషన్‌ జారీ కానుంది. గురువారం జరిగే కేబినెట్‌ సమావేశంలో దీనిపై మరోసారి చర్చించనున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె విరమించిన నేపథ్యంలో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో మంత్రివర్గ భేటీలో సర్కారు దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

రూ. వెయ్యి కోట్లు ఇవ్వండి...: మంత్రివర్గ భేటీ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఆర్టీసీ ఈడీలు, జేటీసీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. ఆర్టీసీ నిర్వహణపై అధికారులను ఆయన ప్రశ్నించగా ప్రస్తుతానికి రూ. వెయ్యి కోట్లు ఇవ్వాలని వారు కోరినట్లు తెలిసింది. ఆర్టీసీ సహకార పరపతి సంఘం, ప్రావిడెంట్‌ ఫండ్‌ బకాయిలను చెల్లిస్తే కొంత ఉపశమనం ఉంటుందని, యథావిధిగా బస్సులు తిప్పితే క్రమంగా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రూ. వెయ్యి కోట్లు కేటాయించే పరిస్థితి లేదని సీఎం తెలిపినట్లు సమాచారం. దీంతో అంతమేర ఆర్టీసీ ఆస్తుల విక్రయం అంశాన్ని అధికారులు ప్రస్తావించగా రూ. వెయ్యి కోట్లు వచ్చే ఆస్తులెక్కడివని సీఎం వ్యాఖ్యానించినట్లు, ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలించాలని సూచించినట్లు తెలియవచ్చింది.

ఇంత మంది సిబ్బందినేం చేస్తారు?
సగం బస్సులను ప్రైవేటీకరిస్తే మిగతా సగం బస్సుల నిర్వహణ కోసం ఆర్టీసీకి తక్కువ మంది సబ్బందే అవసరమవుతారు. కానీ సమ్మె చేసిన 49,300 మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటే సంస్థపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. దీంతో వీఆర్‌ఎస్‌ పథకాన్ని అమలు చేసి అదనంగా ఉన్న వారిని ఇళ్లకు పంపే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ చేపట్టిన సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాలేదు. ఒకవేళ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఈ విషయం చర్చకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఈ అంశంపై కసరత్తు చేసి కేబినెట్‌ సమావేశమయ్యేలోగా వివరాలను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి వీఆర్‌ఎస్‌ వర్తింపజేయాలనే దిశగా సమాచారాన్ని సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. దీంతోపాటు నాలుగైదేళ్ల తర్వాత ప్రైవేటు పర్మిట్ల విధానం ప్రారంభిస్తే ఈలోగా పదవీవిరమణ రూపంలో సిబ్బంది సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాన్ని కూడా అధికారులు వ్యక్తం చేయనున్నట్లు సమాచారం.

షరతులతోనే విధుల్లోకి!
సమ్మె చేసిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే కచ్చితంగా షరతుల ఆధారంగానే తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. భవిష్యత్తులో యూనియన్లు ఉండకుండా చేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలున్నట్లు తెలుస్తోంది. యూనియన్లతో సంబంధం లేకుండా పనిచేసేలా కార్మికులు అంగీకార పత్రంపై సంతకం చేసి ఇవ్వాలనే షరతు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇకపై సమ్మెల జోలికి వెళ్లబోమని కూడా కార్మికులు నిర్దిష్ట హామీ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత సమ్మె కాలానికి కూడా కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి ఆర్టీసీకి లేని నేపథ్యంలో వేతన సవరణ గడువును నాలుగేళ్ల నుంచి సడలించి ఐదారేళ్ల గడువు విధించే అవకాశం కనిపిస్తోంది. ఈ షరతులను కూడా ఖరారు చేసి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

రెండు రోజులు ‘మంత్రాంగం’!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మరుసటి రోజు, అంటే శుక్రవారం కూడా కేబినెట్‌ సమావేశం కొనసాగే అవకాశముందని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీ, కార్మికుల భవితవ్యంపైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆర్టీసీ భవితవ్యంపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర పెండింగ్‌ అంశాలను సైతం ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఈ సమావేశానికి సంబంధించిన ఏజెండా బుధవారం ఖరారు కానుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement