జేఏసీ కో–కన్వీనర్ థామస్‌రెడ్డి (ఫైల్‌ఫోటో)
సాక్షి, హైదరాబాద్: కార్మిక నేతలపై కోపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమాయక కార్మికులపై చూపడం సరికాదని పేర్కొంటున్న జేఏసీ నేతలు కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. తాము రాజీనామాలు చేసి తప్పుకుంటామని, అప్పుడు ఆర్టీసీని ఉన్నది ఉన్నట్లుగా నిర్వహించాలని పేర్కొననున్నట్లు తెలిసింది. దీనిపై బుధవారం జరిగిన సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ‘చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కార్మిక సంఘాల నేతలు సమస్యలు సృష్టిస్తున్నారని మాట్లాడారు. ఆయనకు మాపై అంత కోపం ఉంది. దాన్ని అమాయక కార్మికులపై చూపి వారిని విధుల్లోకి తీసుకోకుండా ఆవేదనకు గురి చేయడం సరికాదు. నేను రాజీనామా చేసి తప్పుకునేందుకు సిద్ధం. మిగతా మా జేఏసీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీని పాత పద్ధతిలోనే కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధం కావాలి. గురువారం కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోవాలి’అని జేఏసీ కో–కన్వీనర్ థామస్‌రెడ్డి అన్నారు.
కార్మిక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు...
సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆవేదనతో ఉన్నందున వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాల జేఏసీ మరోసారి ప్రభుత్వాన్ని కోరింది. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడం చట్ట ప్రకారం సరైన చర్య కాదన్న విషయాన్ని గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తెలుసుకోవాలని సూచించింది. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్‌కు జేఏసీ ఫిర్యాదు చేసింది. మరోవైపు అదే ఫిర్యాదు కాపీలను గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయాల్లో అందజేయాలని జేఏసీ నేతలు సూచించారు. ఆ కార్యాలయాలు లేని ప్రాంతాల్లో సేవ్ ఆర్టీసీ పేరుతో ప్రధాన కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment