కండక్టర్ లునావత్ కృష్ణానాయక్
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీ వైఖరితో తీవ్ర మానసిక వేదనకు గురయ్యా. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేను. మమ్మల్ని డిపో వద్దకు కూడా రానివ్వడం లేదు. బస్టాండ్, డిపో చుట్టూ బారికేడ్లు పెట్టారు. లోపలికి వెళ్తే మాపై కేసులు పెడుతున్నారు. దీంతో ఆవేదన చెందా. మీరు ఉద్యోగం నుంచి తీయడం కాదు.. నేనే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా’ అని సోషల్ మీడియా వేదికగా సూర్యాపేట డిపోకు చెందిన కండక్టర్ లునావత్ కృష్ణానాయక్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశాడు. కృష్ణానాయక్‌ది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్ తండా. ఇతను సోషల్ మీడియాలో పోస్టు చేసిన లేఖ బుధవారం వైరల్ అయింది.
కృష్ణానాయక్ 2009 నుంచి కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై కార్మికులు, రాజకీయ వర్గాల్లో చర్చసాగింది. ఆ లేఖలో.. ‘తెలంగాణలో గౌరవంతో ఉద్యోగం చేద్దామ నుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదాం అనుకున్నా. కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఎందుకు పుట్టాను అనే మానసిక వేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ప్రారంభించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర ఇబ్బందులను అందులో ప్రస్తావించాడు. ‘కార్మికులు ఏం తప్పుచేశారని.. మహిళలని చూడకుండా లాఠీలతో కొట్టించడం, అరెస్టులు చేయడం ఏంటి’ అని ప్రశ్నించాడు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని, సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరాడు.
పోస్టు నిజమే: కృష్ణానాయక్
మమ్మల్ని డిపో వద్దకు రానివ్వడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. సోషల్ మీడియాతో అందరికీ తెలవాలని సీఎంకు లేఖ రాశా. మేనేజర్ కలిస్తే రాజీనామా కచ్చితంగా ఇస్తా.. వెనక్కు పోను.
Comments
Please login to add a commentAdd a comment