సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న ప్పుడు తెలంగాణ ఆర్టీసీలో నియమితులైన ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులిప్పుడు తమను ఏపీకి మార్చాలని కోరుతున్నారు. ఏపీలో పుట్టి అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించినందున తమను ఏపీఎస్‌ఆర్టీసీలోకి మార్చాలని తాజాగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మల కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో వినతులు పంపుతున్నారు.
ఆర్టీసీలో ఏర్పడ్డ సంక్షోభంతో..
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని జిల్లాల్లో ఆర్టీసీలో నియమితులయ్యారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో కొంతమంది మాత్రమే ఏపీకి వెళ్లాలనుకున్నారు. మిగతావారు ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో 58:42 దామాషా ప్రకారం ఉద్యోగుల మార్పిడి జరిగినా, ఏపీఎస్‌ఆర్టీసీ పరిధిలోనే సిబ్బంది ఎక్సెస్ కావటంతో ఇక్కడి వారిని తీసుకో లేదు. అక్కడి నుంచే కొందరు తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత ఎవరూ సొంత ప్రాంతానికి బదిలీ చేయాలని కోరిన సందర్భాలు కూడా లేవు. కానీ ఇటీవల ఆర్టీసీలో ఏర్పడ్డ సంక్షోభం వారిని ఆలోచనలో పడేసింది. సమ్మె సమయంలో కార్మికులకు ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ అగాధం, ఆర్టీసీలో సగం మేర ప్రైవేటీకరణ కసరత్తు నేపథ్యంలో అసలు ఉద్యోగాలుంటాయో లేదోనన్న ఆందోళనలో కార్మికులు గడిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించటంతో కథ సుఖాంతమైంది. అయినా.. భవిష్యత్తుపై కొంతమందిలో ఆందోళన మాత్రం కొనసాగుతోంది.
ఏపీలో విలీనం వైపు..
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే కసరత్తు వేగంగా జరుగుతుండటంతో కార్మికుల్లో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదని ప్రభుత్వం అప్పట్లోనే తేల్చి చెప్పింది. వీటన్నింటిని పరిగణించి ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో తాము ఏపీకి చెందిన వారమని, ప్రాథమిక విద్య అంతా అక్కడే జరిగిందని, ఓటరు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయని, తమ తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారని, వృద్ధులైనందున వారితో తాము ఉండాల్సిన అవసరం ఉందని... ఇలాంటి కారణాలు చూపుతూ ఇప్పుడు అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కొంతమంది తమ భార్య/భర్త ఏపీలో ఉద్యోగం చేస్తున్నారన్న కారణాన్ని చూపుతున్నారు. ఇలా డిపో మేనేజర్లు మొదలు ముఖ్యకార్యదర్శి కార్యాలయం వరకు రెండు మూడ్రోజులుగా వినతులు వస్తున్నాయి. తాజాగా కొందరు రిజిస్టర్ పోస్టు రూపంలో మంత్రి పువ్వాడ కార్యాలయానికే తమ వినతులు పంపారు. టీఎస్‌ఆర్టీసీలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు దాదాపు 3 వేల మంది వరకు ఉన్నట్టు సమాచారం.
అది సాధ్యం కాదు: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగుల బదిలీ అనేది అధికారుల స్థాయిలో జరిగే నిర్ణయం కాదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ‘ఆర్టీసీ ఇంకా కేంద్రం దృష్టిలో ఉమ్మడిగానే ఉంది. స్థానికత ఆధారంగా ఉద్యో గుల బదిలీ కావాలంటే కేంద్రం కనుసన్నల్లోనే జరగాలి. లేదంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగుల వినతులతో బదిలీ చేయటం కుదరదు’అని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు.
ఆంధ్రావాళ్లం.. ఏపీకి పంపండి!
Published Wed, Dec 11 2019 3:48 AM | Last Updated on Wed, Dec 11 2019 10:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment