సాక్షి, హైదరాబాద్: బస్టాండ్లలో వివిధ కారణాల వల్ల వేచి ఉండాల్సిన ప్రయాణికులకు శుభవార్త. తమ ప్రాంగణాల్లో వినోదాన్ని అందించేందుకు మినీ థియే టర్లు నిర్మించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయిం చింది. ఆర్టీసీ ప్రతిపాదనకు తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ముందుకు వచ్చింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి, టికెట్టేతర ఆదాయం కోసం వివిధ మార్గాలు అన్వేషిస్తోన్న ఆర్టీసీకి ఈ ఆలోచన కాసులు కురిపిస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మినీ థియేటర్ల నిర్మాణానికి చకాచకా అడుగులు వేస్తోంది.
త్వరలో విజయవాడకు బృందం..
టికెట్టేతర ఆదాయం పెంపులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలను వేలం వేసిన ఆర్టీసీ, ఇకపై మినీ థియేటర్లను ఏర్పాటు చేయనుందని సంస్థ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. ఇప్పటికే ఇందుకోసం ఆర్టీసీకి చెందిన 23 స్థలాలను గుర్తించామని, ఇందులో 15 ప్రాంగణాల్లో మినీ థియేటర్లు నిర్మించేందుకు టీఎఫ్‌డీసీ ముందుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ థియేటర్ల ద్వారా ఏటా రూ. 3.11 కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో పండిట్‌నెహ్రూ బస్టాండ్‌లో ఇలాంటి మినీథియేటర్ నడుస్తోంది. ఈ మినీ థియేటర్ నిర్వహణ పని తీరును పరిశీలించేందుకు త్వరలోనే ఈడీ పురుషోత్తమ్ నేతృత్వం లోని బృందం విజయవాడ వెళుతుందని ఆయన వివరించారు.
ఏయే ప్రాంతాల్లో..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొల్లూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, ధర్మపురి, హుజూరాబాద్, సిరిసిల్ల, పెద్ద పల్లి, జడ్చర్ల, షాద్‌నగర్, నర్సా పూర్, సంగారెడ్డి, నాగార్జున సాగర్, కోదాడ, ఆర్మూర్, బోధన్, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment