300 మందికి 8 అంతస్తులా? | 300 employees, 8-Story Building to R&B Building in Erramanzil | Sakshi
Sakshi News home page

300 మందికి 8 అంతస్తులా?

Published Fri, Jan 30 2015 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

300 మందికి 8 అంతస్తులా?

300 మందికి 8 అంతస్తులా?

   *ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ భవనంపై ఆ శాఖ కార్యదర్శి విస్మయం
   *'సాక్షి' కథనంతో అత్యవసర భేటీ నిర్వహించిన సునీల్‌శర్మ
   * రాష్ట్ర విభజనకు ముందు తీసుకున్న నిర్ణయాలపై ఆరా
   * పూర్తి వివరాలు, పత్రాలు అందజేయాలని అధికారులకు ఆదేశం
   * దీనిపై సీఎంకు నివేదిక అందించాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: అక్కడ పనిచేసే విభాగాధిపతులు ఆరుగురు... వారి ఆధీనంలో పనిచేసే సిబ్బంది మూడొందలు.. కానీ వారికోసం లక్ష చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంతో ఎనిమిది అంతస్తుల భవనం సిద్ధమవుతోంది. రూ. 67 కోట్లతో నిర్మిస్తున్న ‘అంత పెద్ద భవనంలో మేమేం చేస్తాం..’ అని స్వయంగా ఆ విభాగం అధికారులే ప్రశ్నించే పరిస్థితి. రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ విభాగం కోసం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో నిర్మిస్తున్న భవనం వ్యవహారం ఇది.

ఈ భవనం నిర్మాణంలో అధికారుల ఇష్టారాజ్యం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ‘20 కోట్లతో మొదలై 67 కోట్లకు..’ శీర్షికతో ‘సాక్షి’లో గురువారం కథనం ప్రచురితం కావటంతో రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం 300 మంది సిబ్బంది ఉండే చోట ఇంత పెద్ద భవనం నిర్మించాల్సిన పరిస్థితి, తొలుత ఐదంతస్తులుగా తలపెట్టి తర్వాత ఎనిమిది అంతస్తులకు పెంచుతూ నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్థితులపై ఆయన ఆరా తీశారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, పత్రాలను తనకు అందజేయాల్సిందిగా ఆయన ఆర్‌అండ్‌బీ బిల్డింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. దీనిపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేయనున్నట్టు తెలిసింది. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే... ఈ భవనం పనులు పూర్తయ్యేలోపు దాని అంచనాను మరోసారి సవరించే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతమున్న అంచనా రూ. 67 కోట్లకు పెంచాలనే ప్రతిపాదన 2014లో చేసింది. కానీ ఇప్పుడు పనులు పూర్తి కావటానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఈలోపు నిర్మాణ సామగ్రి ధరలో మార్పులు వస్తాయి. దీంతో అంచనాను మరోసారి సవరించాల్సి ఉంటుందనే తీరులో అధికారులు చెబుతుండడం గమనార్హం.
 
విభజన ముంగిట నిర్ణయం..

రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా ఆర్‌అండ్‌బీ భవనంలో దాదాపు ఏడు వందల మందికి పైగా సిబ్బంది పనిచేశారు. విభజనతో తెలంగాణ వాటా మూడొందలకు తగ్గిపోయింది. 2009లో ఈ భవనం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఐదంతస్తులుగా ప్రణాళిక రూపొందించారు. దానిని 2012లో ఎనిమిది అంతస్తులకు మార్చి... అంచనా వ్యయాన్ని రూ. 20 కోట్ల నుంచి రూ. 39 కోట్లకు పెంచారు. అప్పటికే రాష్ట్ర విభజన అంశం కొలిక్కివచ్చే తరుణంలో ఉంది.

తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చింది. రాష్ట్రం విడిపోతే తొలుత నిర్ణయించినట్టుగా ఐదంతస్తుల భవనం కూడా ఎక్కువే. అలాంటిది ఆగమేఘాల మీద అంచనా వ్యయాన్ని పెంచి ఎనిమిది అంతస్తులుగా నిర్మించాలని నిర్ణయించటం పట్ల ఇప్పుడు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఆ తర్వాత అదనపు పనుల పేరుతో అంచనా వ్యయాన్ని రూ. 67 కోట్లకు పెంచేశారు.
 
ఇతర అవసరాలకు వినియోగిస్తే..

ఇంత భారీ భవనం ఆర్‌అండ్‌బీకి అనవసరమనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ భవనంలోనే ఆర్‌అండ్‌బీ కార్యదర్శి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. కానీ ఛాతీ ఆసుపత్రి స్థలంలో కొత్తగా సచివాలయం ఏర్పాటుచేసే యోచనలో ఉన్నందున... ఆర్‌అండ్‌బీ మంత్రి కార్యాలయం వద్దే కార్యదర్శి కార్యాలయం కూడా ఏర్పటవుతుంది. అదే జరిగితే ఈ కొత్త భవనంలో దాని అవసరం ఉండదు. అలాంటప్పుడు దీన్ని రోడ్లు, భవనాల శాఖకు కాకుండా ఇతర అవసరాలకు వాడితే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. టీహైకోర్టు కోసం ఈ భవనాన్ని విని యోగిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement